సంక్షేమ హాస్టళ్ల భవనాలకు స్థలం సేకరించండి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం

సంక్షేమ హాస్టళ్ల భవనాలకు స్థలం సేకరించండి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం

నల్గొండ, వెలుగు: సంక్షేమ హాస్టళ్ల భవనాల నిర్మాణానికి జిల్లాల వారీగా స్థలం సేకరించి, ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ కలెక్టరేట్​లోని ఉదయాదిత్య భవన్​లో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల ఎక్సైజ్, రవాణా, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. నల్గొండ జిల్లాలో 32  బీసీ సంక్షేమ  పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాలు ఉండగా సుమారు 30 అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని తెలిపారు.

 వాటన్నింటికీ పక్కా భవనాలు నిర్మించేందుకు వెంటనే స్థలం సేకరించాలని సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు భద్రత క్లబ్​లు ఏర్పాటు చేయాలని చెప్పారు. కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థుల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిజాం కాలం నాటి నార్కెట్ పల్లి బస్ డిపోను దత్తత తీసుకొని, పూర్వ వైభవం తీసుకొస్తామని, వారం, పది రోజుల్లో రూటింగ్ ను  సెట్ చేస్తామని హామీ ఇచ్చారు.

హాస్టల్​ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి 

హాస్టల్​విద్యార్థుల విషయంలో ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. జిల్లాకు 77 ఎలక్ట్రిక్​ బస్సులు ఇచ్చినందుకు మంత్రి ప్రభాకర్​కు ధన్యవాదాలు తెలిపారు. అంతకముందు నల్గొండ డిపోలో ఎలక్ట్రిక్​బస్సులను ప్రారంభించి, డిపో నుంచి ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ వరకు స్వయంగా బస్సు నడిపారు. 

అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్  రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్,  కలెక్టర్  ఇలా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ శరత్​చంద్ర పవార్,  మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రవాణా శాఖ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్ తదితరులు వనమహోత్సవంలో భాగంగా కలెక్టరేట్​లో మొక్కలు నాటారు. 

ఆయిల్‌‌పామ్‌‌ సాగును పెంచాలి

నల్గొండ అర్బన్ : జిల్లాలో ఆయిల్‌‌పామ్‌‌ పంటను 50 వేల ఎకరాలకు పెంచాలని రాష్ట్ర ఆర్‌‌‌‌అండ్‌‌బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హార్టికల్చర్‌‌‌‌ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం నల్గొండలోని కలెక్టరేట్‌‌లో ఆయిల్‌‌పామ్ సాగుపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌‌పామ్‌‌ లాంటి పంటలు సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. 

ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఆగస్టులో ప్రారంభించాలని పతాంజలి కంపెనీ నిర్వాహకులకు సూచించారు. ఆయిల్‌‌పామ్‌‌ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.