
- కృష్ణా నదిపై బ్రిడ్జి, బ్యారేజీ కడుతం
మక్తల్/ఊట్కూరు, వెలుగు: నాడు వైఎస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే, మళ్లీ రేవంత్ హయాంలో ఇప్పుడు పంపిణీ చేస్తున్నామని.. అప్పుడు, ఇప్పుడు పేదల సొంతింటి కల నెరవేర్చింది కాంగ్రెస్సేనని పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం మక్తల్, మాగనూర్, ఊట్కూర్, కృష్ణా మండలాల్లో ఆయన పర్యటించారు. ఊట్కూర్ మండలం బిజ్వార్ నుంచి కొత్తపల్లి వరకు రూ.1.90 కోట్లతో, మాగనూర్ నుంచి అచ్చంపేట్ వరకు రూ.3.80 కోట్లతో బీటీ రోడ్డు పనులకు, అవుసులోనిపల్లిలో రూ.20 జీపీ బిల్డింగ్ కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు సీఎం రేవంత్రెడ్డి భరోసాగా నిలిచారన్నారు. మూడేళ్లలో జీవో 69 ద్వారా ఎత్తిపోతల పథకంతో నారాయణపేట జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మాటిచ్చారు.
పులిమామిడి విద్యుత్ సబ్ స్టేషన్ను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరేనని చెప్పగా.. కాంగ్రెస్ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు గుర్తు చేశారు. బిజ్వార్ గ్రామంలో పశు వైద్యశాల కడుతామని, మొగ్దం పూర్, ఆవుసులోనిపల్లిని రెవెన్యూ గ్రామాలుగా మారుస్తామని ప్రకటించారు. కృష్ణా నది, మాగనూర్ పెద్దవాగుపై బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మిస్తామని
చెప్పారు.
ఆలయ భూములను కాపాడుతాం..
మక్తల్ పట్టణంలోని శ్రీపడమటి ఆంజనేయ స్వామి ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం ఆలయ ధర్మకర్తగా ప్రాణేశ్చారి ప్రమాణస్వీకారం చేయగా మంత్రి హాజరయ్యారు. ఆలయ గాలి గోపురానికి రూ.50 లక్షలు మంజూరు చేయించామని, కోనేరును పునరుద్ధరించి వచ్చే జాతర నాటికి వినియోగంలోకి తెస్తామన్నారు. అనంతరం పట్టణంలో దోబిఘాట్ కు వెళ్లే దారిలో కల్వర్టు, రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు.