అపోజిషన్​ పార్టీల వాళ్లకూ మంత్రి చాన్స్​

అపోజిషన్​ పార్టీల వాళ్లకూ మంత్రి చాన్స్​
  • మంత్రులతో రాజీనామాలు..
  • కేబినెట్‌‌లో చేరాలంటూ ప్రతిపక్షాలకు ప్రెసిడెంట్ గొటబయ పిలుపు
  •  ఆర్థిక మంత్రిగా ఉన్న  సోదరుడు బాసిల్ పై వేటు
  • వ్యతిరేకతను తప్పించుకునేందుకు ‘ఐక్యతా ప్రభుత్వం’ ప్రతిపాదన
  •  ప్రెసిడెంట్ ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్షాలు 

కొలంబో: శ్రీలంక ప్రెసిడెంట్ గొటబయ రాజపక్స కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో చేరాలంటూ అన్ని ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు పెరుగుతుండటం, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో.. సంకట స్థితి నుంచి తప్పించుకునేందుకు ఆయన ఈ ప్రతిపాదన చేశారు. సర్కారుపై తీవ్ర విమర్శలకు కారణమైన తన సోదరుడు బాసిల్ రాజపక్స సహా మొత్తం కేబినెట్‌‌లోని 26 మంది మంత్రులతో రాజీనామా చేయించారు. ‘‘ఐక్యతా ప్రభుత్వంలో మంత్రి పదవులు స్వీకరించాలని పార్లమెంటులోని అన్ని ప్రతిపక్ష పార్టీలను అధ్యక్షుడు కోరారు. జాతీయ సంక్షోభం నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగం కావాలని పిలుపునిచ్చారు’’ అని లంక అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే గొటబయ ప్రతిపాదనను ప్రతిపక్షాలు తిరస్కరించాయి. దేశ ప్రజలను మోసం చేయడానికి ఇదో ఎత్తుగడ అంటూ మండిపడ్డాయి. తాము ప్రభుత్వంలో చేరబోమని, ఎన్నికలు జరిగితే పోటీకి సిద్ధమని స్పష్టం చేశాయి.  

ఆ ఇద్దరు తప్ప..

అధ్యక్షుడు గొటబయ మంత్రివర్గంలోని 26 మంది తమ పదవులకు రాజీనామాలు చేశారు. గొటబయ, ఆయన సోదరుడు, ప్రధాని మహింద రాజపక్స మాత్రమే పవర్ లో కొనసాగుతున్నారు. పూర్తి కేబినెట్ ఏర్పాటయ్యే దాకా పార్లమెంటు చట్టబద్ధత, స్థిరత్వాన్ని కాపాడేందుకు, ఇతర వ్యవహారాలను కొనసాగించేందుకు నలుగురు మంత్రులను గొటబయ నియమించారు. ఇప్పటిదాకా ఆర్థిక మంత్రిగా ఉన్న తన సోదరుడు బాసిల్ రాజపక్సపై వేటు వేశారు. ఆయన స్థానంలో కొత్తగా అలీ సబ్రీని మంత్రిగా నియమించారు. విదేశాంగ మంత్రిగా జీఎల్ పీరిస్, విద్యా మంత్రిగా దినేశ్ గుణవర్ధనే, హైవేల శాఖ మంత్రిగా జాన్‌‌స్టన్ ఫెర్నాండో నియమితులయ్యారు. ప్రతిపక్ష పార్టీలతో చర్చల తర్వాత పర్మినెంట్ కేబినెట్‌‌ను అపాయింట్ చేయనున్నారు. 

బాసిల్‌‌పై తీవ్ర వ్యతిరేకత

శ్రీలంక పొదుజన పెరమున (ఎస్‌‌ఎల్‌‌పీపీ) సంకీర్ణ ప్రభుత్వంలో బాసిల్‌‌పై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను కేబినెట్ నుంచి తొలగించారు. అయితే గత నెలలో బాసిల్‌‌ను బహిరంగంగా విమర్శించినందుకు ఇద్దరు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించినా.. ప్రస్తుత ఫారిన్ ఎక్స్‌‌చేంజ్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో శ్రీలంకకు సాయం చేయడానికి సంబంధించిన ఇండియన్ ఎకనమిక్ రిలీఫ్ ప్యాకేజీపై బాసిల్ చర్చలు జరిపారు. మరోవైపు బెయిల్‌‌అవుట్ కోసం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌‌(ఐఎంఎఫ్‌‌)తో చర్చలు జరిపేందుకు అమెరికాకు కూడా వెళ్లనున్నారు. 

రాజీనామాలు కొత్త నాటకం: ప్రతిపక్షాలు

రాజీనామాల వ్యవహారం అంతా మోసమని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ‘సమాగి జన బలవేగయ’ మండిపడింది. ప్రభుత్వంలో చేరాలంటూ ప్రెసిడెంట్ పంపిన ఆహ్వానాన్ని తిరస్కరించింది. ‘‘దేశ ప్రజలను మోసం చేయడానికి మెలోడ్రామా చేశారు. పరిస్థితిని చక్కబెట్టేందుకు నిజమైన ప్రయత్నం చేయలేదు. ఇది ప్రజలను మోసం చేయడానికో ఎత్తుగడ” అంటూ మంత్రుల రాజీనామాపై శ్రీలంక పార్లమెంటులో ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస స్పందించారు. మరోవైపు ఎంత సాధ్యమైతే అంత మేరకు తమకు సాయం చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ‘‘ప్లీజ్ మాకు సాయం చేయండి” అని అన్నారు.

మహింద ఇంటి ఎదుట ఆందోళనలు

శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేయాలంటూ తంగల్లెలోని ఆయన ఇంటి ముందు 2 వేల మందికి పైగా ఆందోళనలకు దిగారు. బారికేడ్లను తోసుకుంటూ వచ్చి రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్ఫ్యూ ఆర్డర్లను ధిక్కరించడం, రాజపక్స ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కేనన్లు ప్రయోగించారు. రాజధాని కొలంబోలో భారీ ఎత్తున ఆందోళనలు జరగడంతో శనివారం విధించిన ఎమర్జెన్సీ సోమవారం ఉదయం దాకా కొనసాగింది.

సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా 

శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అజిత్ నివర్ద్ కాబ్రాల్ తన పదవికి రాజీనామా చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం, నిరసనలు పెరిగిపోవడంతో ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ‘‘అందరు కేబినెట్ మంత్రులు రాజీనామా చేయడంతో.. నేను కూడా నా రిజైన్ లెటర్‌‌‌‌ను సోమవారం అందజేశాను” అని ట్వీట్ చేశారు.   

ట్రేడింగ్ నిలిపివేత

శ్రీలంక స్టాక్ ఎక్స్‌‌చేంజ్‌‌లో ట్రేడింగ్ నిలిపేశారు. మంత్రులు మూకుమ్మడి రాజీనామాలు చేసిన నేపథ్యంలో.. సోమవారం ఉదయం సెషన్ ప్రారంభమైన కొన్ని సెకెండ్ల వ్యవధిలోనే మార్కెట్ ఏకంగా 5.92 శాతం పడిపోయింది. దీంతో వెంటనే ట్రేడింగ్‌‌ ఆగిపోయింది.