భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించిన బడా మల్టీనేషనల్​ కంపెనీలు

భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించిన బడా మల్టీనేషనల్​ కంపెనీలు

అమెజాన్​లో పని చేసేందుకు గీత(పేరు మార్చాం) మూడు నెలల క్రితం అమెరికాకు వెళ్లింది.  మార్చి 20 ఉద్యోగానికి ఆఖరి రోజు అని ఈ వారం ఆమెకు సమాచారం అందింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉందామె.

సీత(పేరు మార్చాం). అమెరికాలో హెచ్1బీ వీసాపై పనిచేస్తున్న మరో ఐటీ ఎంప్లాయి. ఈ నెల 18న మైక్రోసాఫ్ట్​ నుంచి ఆమెను తొలగించారు. సీత సింగిల్​ మదర్. ఆమె కొడుకు హైస్కూల్​ జూనియర్.. ప్రస్తుతం కాలేజీలో జాయిన్​ అయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం పోవడం తమపై చాలా ప్రభావం చూపుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తోంది.

వాషింగ్టన్: అమెరికాలోని బడా మల్టీనేషనల్​ కంపెనీలన్నీ ఇటీవల భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించాయి. ఈ ఎఫెక్ట్​ ముఖ్యంగా ఇండియన్​ ఐటీ ప్రొఫెషనల్స్​పై పడింది. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయి.. కొత్త కొలువుల వేటలో పడ్డారు. కానీ అమెరికాలో ఉండేందుకు వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వర్క్​ వీసా రూల్స్​ ప్రకారం జాబ్​ పోయిన వారు అమెరికాలో ఉండాలంటే 60 రోజుల్లో కొత్త జాబ్​లో జాయిన్​ అవ్వాలి. లేదంటే తిరిగి స్వదేశానికి తిరిగి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాలు దొరక్క చాలా మంది డిప్రెషన్​లోకి వెళ్లిపోతున్నారు. కొందరైతే ఉన్న ఆస్తులను అమ్ముకుంటున్నారు. ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కొంతమంది వాట్సాప్​ గ్రూపులు పెట్టి సమాచారాన్ని షేర్​ చేసుకుంటున్నారు. తోటి వారితో టచ్​లో ఉంటూ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడేందుకు చూస్తున్నారు.

2 లక్షల మంది తొలగింపు

కిందటి ఏడాది నవంబర్​ నుంచి ఇప్పటి వరకు అమెరికా కంపెనీలు దాదాపు 2 లక్షల మంది ఐటీ ఉద్యోగులను తొలగించాయి. ఈ లిస్ట్​లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్​బుక్ తదితర బడా కంపెనీలన్నీ ఉన్నాయి. ఇలా లేఆఫ్​ అయిన వారిలో 30 నుంచి 40 శాతం మంది ఇండియన్​ ఐటీ ప్రొఫెషనల్సే. వీరిలో ఎక్కువ మంది హెచ్1బీ, ఎల్1 వీసాలపై అక్కడ పనిచేస్తున్నారు. ఇండియన్ ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది నాన్​ ఇమిగ్రెంట్ వీసాలైన హెచ్1బీ, ఎల్1లపైనే పనిచేస్తూ ఉంటారు. ఉద్యోగాలు పోయినవారంతా ఇప్పుడు అమెరికాలో ఉండేందుకు గండం ఎదురవుతోంది. ఫారిన్ వర్క్​ వీసా రూల్స్​ ప్రకారం వీరంతా 60 రోజుల వ్యవధిలో కొత్త ఉద్యోగాన్ని సంపాదించాలి. అక్కడికి వీసాను ట్రాన్స్​ఫర్​ చేయించుకోవాలి. లేదంటే వీసా గడువు ముగిసిన పది రోజుల్లో స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాల్సి వస్తుంది.

కొత్త కొలువు రావడం సవాలే

ప్రస్తుతం అన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగాల తొలగింపును వేగవంతం చేశాయి. ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టి.. పాత ఉద్యోగులనే కాదు.. కొత్తగా చేరిన వారిని కూడా ఇంటికి పంపించేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఉద్యోగం సాధించడం ఐటీ ప్రొఫెషనల్స్​కు సవాలే. ‘‘ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉంది. చివరికి ఆస్తులను కూడా అమ్ముకోవాల్సి వస్తోంది. హెచ్1బీ వీసాపై పనిచేస్తున్న వారికి సంబంధించి టెక్​ కంపెనీలు కొంత మినహాయింపు ఇవ్వాలి. ప్రస్తుతం జాబ్​ మార్కెట్, రిక్రూట్​మెంట్​ ప్రాసెస్​ సవాలుగా మారడంతో వారి టర్మినేషన్​ తేదీని కొద్ది నెలల పాటు పొడిగిస్తే అది కంపెనీలకు కూడా మేలు చేస్తుంది”అని సిలికాన్ వ్యాలీకి చెందిన కమ్యూనిటీ లీడర్​ అజయ్ జైన్ భూటోరియా అన్నారు.

వాట్సాప్​ గ్రూపుల్లో జాబ్​ వేకెన్సీల సమాచారం

ఉద్యోగాలు పోగొట్టుకున్న వారిని గట్టెక్కించేందుకు గ్లోబల్​ ఇండియన్ టెక్నాలజీ ప్రొఫెషనల్ అసోసియేషన్ (టీఐటీపీఆర్వో), ఫౌండేషన్​ ఫర్​ ఇండియా అండ్ ఇండియన్​ డయాస్పోరా స్టడీస్(ఎఫ్ఐఐడీఎస్) తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. జాబ్​ సీకర్స్​తో వారిని కనెక్ట్​ చేయడం, జాబ్​  రెఫరెన్స్​లు అందించడం వంటివి చేస్తున్నాయి. అలాగే యూఎస్ సిటిజన్​షిప్​ అండ్​ ఇమిగ్రేషన్​ సర్వీస్​లో పాలసీ మేకర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎఫ్ఐఐడీఎస్ ప్రయత్నిస్తోంది. మరోవైపు ఉద్యోగాలు కోల్పోయిన వారంతా వాట్సాప్​గ్రూపులు ఏర్పాటు చేసుకుని జాబ్స్​ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని పంచుకుంటున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు తమకు ఉన్న అవకాశాలను షేర్​ చేసుకుంటున్నారు. ఒక వాట్సాప్​ గ్రూప్​లో అయితే 800 మందికిపైగా జాబ్​ కోల్పోయిన ఇండియన్​ ఐటీ ప్రొఫెషనల్స్​ ఉన్నారు.