ఏపీ–ఒడిశా బార్డర్​ నుంచి బస్తాలకొద్దీ గంజాయి 

ఏపీ–ఒడిశా బార్డర్​ నుంచి బస్తాలకొద్దీ గంజాయి 


హనుమకొండ, వెలుగు: ఏపీ–-ఒడిశా బార్డర్​ నుంచి తెలంగాణకు పెద్ద మొత్తంలో గంజాయి అక్రమంగా రవాణా అవుతోంది. కొంతమంది ముఠాలుగా ఏర్పడి వైజాగ్, సీలేరు, మోతుగూడెం ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి తీసుకొచ్చి ఇక్కడ బిజినెస్​ చేస్తున్నారు. ఎక్కడికక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుని గుట్టుగా దందా సాగిస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణ వచ్చే మార్గంలో వరంగల్​సెంటర్​ పాయింట్ గా ఉండటంతో ఇక్కడి నుంచే దందా ఎక్కువగా చేస్తున్నారు. ఇలా ఏపీ నుంచి గంజాయి స్మగ్లింగ్​ చేస్తున్న మూడు వేర్వేరు గ్యాంగులను వరంగల్​ పోలీసులు అరెస్ట్​చేశారు. మూడు ముఠాలకు సంబంధించిన  11 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 32 లక్షల విలువైన 318 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు, కార్లు, మూడు ఆటోలు, 11 సెల్​ ఫోన్లు సీజ్​ చేశారు. ఈ వేర్వేరు ఘటనలకు సంబంధించిన వివరాలను వరంగల్​ సీపీ డా.తరుణ్​ జోషి గురువారం వెల్లడించారు. 

మూడు గ్యాంగుల అరెస్టు

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కేంద్రానికి చెందిన బోరం సాయికుమార్, గాటంపల్లి వెంకట్, గోదవర్తి శేషుకుమార్​ ఆంధ్రప్రదేశ్,​ ఒడిశా బార్డర్​లోని సీలేరు, మోతుగూడెం ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయి కొని విశాఖపట్నం నుంచి రాజమండ్రి, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం పట్టణాల మీదుగా మొదట వరంగల్​ నగరానికి చేరవేసేవారు. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. బుధవారం వరంగల్​కు కారులో గంజాయి తీసుకొస్తుండగా టాస్క్​ఫోర్స్​పోలీసులకు సమాచారం అందింది. దీంతో వర్ధన్నపేట పోలీసులతో కలిసి వరంగల్​-ఖమ్మం జాతీయ రహదారిపై డీసీ తండా వద్ద పట్టుకున్నారు. 128 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

* మహబూబాబాద్​జిల్లా కేంద్రానికి చెందిన భూక్య రాములు, షేక్​ ఖలీల్, కరీంనగర్​కు చెందిన కోనమల్ల సునీల్​ఏపీలోని వైజాగ్​నుంచి గంజాయి తీసుకొస్తుండగా నల్లబెల్లి మండలం రామతీర్థం గ్రామశివారులో అరెస్ట్​ చేశారు. కారు, ఆటో స్వాధీనం చేసుకుని 134 కిలోల గంజాయిని సీజ్​ చేశారు. 
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన బత్ర నరేశ్, తూముల క్రాంతి కుమార్, తుమ్మల నాగరాజు, జి.మనోజ్, మారంపూడి శ్రీను నర్సంపేట మీదుగా వరంగల్​ తీసుకొస్తుండగా ఖానాపురం పోలీసులు పట్టుకున్నారు. రెండు ఆటోల్లో తరలిస్తున్న 56 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

వరంగల్​ కేంద్రంగా దందా

ఏపీ, ఒడిశా బార్డర్​ నుంచి తెలంగాణకు వస్తున్న గంజాయి దందాకు వరంగల్​ కేంద్రంగా మారింది. సిటీలో కొన్నిచోట్ల స్థావరాలు ఏర్పాటు చేసుకున్న గంజాయి స్మగ్లర్లు ముందుగా సరుకుని ఆ అడ్డాలకు చేరవేస్తున్నారు. అక్కడ స్టోర్​చేసి డిమాండ్​ను బట్టి ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు. ముఖ్యంగా వరంగల్, కాజీపేట రైల్వే ట్రాకులు, బస్టాండ్లు, వరంగల్ రైల్వే క్వార్టర్లు, ఖిలా వరంగల్, శివనగర్, కాశీబుగ్గ, ఆరెపల్లి, ఎర్రగట్టుగుట్ట తదితర ప్రాంతాలు గంజాయి స్మగ్లింగ్​కు ప్రధాన స్థావరాలుగా మారాయి. ముఠాలుగా ఏర్పడిన దుండగులు యూత్, స్టూడెంట్స్​కు అలవాటు చేస్తుండటంతో క్రైం రేట్​ పెరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. 

కేసులు పెడుతున్నా అంతే

గంజాయి కేసుల్లో పట్టుబడుతున్నవారంతా ఎంతోకొంత చదువుకున్నోళ్లే ఉంటున్నారు. ఇప్పుడు పోలీసులు అరెస్ట్​ చేసిన 11 మంది కూడా కనీసం ఇంటర్​చదివిన వాళ్లే కావడం గమనార్హం. వారంతా జల్సాలు, ఈజీ మనీకి అలవాటు పడి గంజాయి స్మగ్లింగ్​కు పాల్పడుతున్నట్లు  పోలీసులు చెబుతున్నారు. గంజాయి దందాలో లాభాలు బాగా వస్తుండటంతో నిందితులు దీనినే జీవనాధారంగా మార్చుకుంటున్నారు. స్మగ్లింగ్​ చేస్తూ పోలీసులకు చిక్కి శిక్ష అనుభవించినా పద్ధతి మార్చుకోవడం లేదు. వర్ధన్నపేటలో దొరికిన గ్యాంగ్​ పై ఇదివరకు కూడా గంజాయి స్మగ్లింగ్​ కేసు ఉంది. ఇప్పుడు మరోసారి అదే రీతిలో పట్టుబడ్డారు. ఇలా రిపీటెడ్​గా నేరాలకు పాల్పడుతున్న  దాదాపు 10 మంది స్మగర్లపై వరంగల్ పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. అయినా చాలామంది వాటిని లైట్​ తీసుకుని యథేచ్ఛగా గంజాయి దందా సాగిస్తున్నారు. ఇలా తరచూ నేరాలకు పాల్పడుతున్న వారిపై సీరియస్​యాక్షన్​ తీసుకుంటేనే గంజాయి దందాకు అడ్డుకట్టే వేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.