దేశంలో మూడో అతి పెద్ద నది కృష్ణా

దేశంలో మూడో అతి పెద్ద నది కృష్ణా

తెలంగాణ రాష్ట్రంలో జరిగే పోటీ పరీక్షల్లో నదుల మీద ప్రశ్న లేకుండా ప్రశ్నాపత్రం ఉండదు. దేశంలో రెండో, మూడో అతిపెద్ద గోదావరి, కృష్ణా నదులు తెలంగాణలో ప్రవహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకత ఏమిటంటే ఉత్తరాన గోదావరి, దక్షిణాన కృష్ణా, ఈ రెండు నదుల మధ్యన తెలంగాణ రాష్ట్రం భూపరివేష్టితమై ఉంటుంది.  అందుకనే తెలంగాణ రాష్ట్రానికి నదులపరంగా ప్రాముఖ్యత ఉంది.

గోదావరి, కృష్ణా నదులు గతంలో మూడు జిల్లాల మీదుగా ప్రవహించేవి. అవి వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి గోదావరి, కృష్ణా నదులు ప్రస్తుతం 5 జిల్లాల్లో ప్రవహిస్తున్నాయి. అవి వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, వికారాబాద్, సిద్దిపేట. రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులకు చాలా ప్రాముఖ్యత ఉంది. గోదావరి బేసిన్ ప్రాంతంలో 40 నదులు ఉండటం, అవి 20 జిల్లాలో  ప్రవహిస్తుండటం ఇందుకు కారణం. కృష్ణా నది బేసిన్​లో 20 నదులు ఉన్నాయని, అవి 18 జిల్లాల నుంచి ప్రవహిస్తున్నాయని, వీటివల్ల తెలంగాణలో భూగర్భ జల వనరులు పెరగడానికి ఇవీ ఒక కారణం.

గోదావరి : గోదావరి నదిని దక్షిణగంగ అని అంటారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది గోదావరి, ద్వీపకల్ప నదుల్లోకెల్లా అతిపెద్దది. గోదావరి మొత్తం పొడవు 1465 కి.మీ. తెలంగాణ రాష్ట్రంలో 600 కి.మీ. పొడవున ప్రవహిస్తుంది. కందకుర్తి వద్ద గోదావరి తెలంగాణలో ప్రవేశిస్తుంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో కందకుర్తి ఉంది. గోదావరికి అతిపెద్ద ఉపనది ప్రాణహిత, ముఖ్యమైన ఉపనది మంజీర. ముఖ్యమైన కుడి ఉపనదులు ప్రవర, మంజీరా, మన్నేరు. ముఖ్యమైన ఎడమ ఉపనదులు పూర్ణ, ప్రాణహిత, శబరి. తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతం 79 శాతం ఉండగా గోదావరి దేశంలో 7 రాష్ట్రాల నుంచి ప్రవహిస్తుంది. అవి మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌‌‌‌గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ.

గోదావరి బేసిన్‌‌‌‌లో..

గోదావరి బేసిన్‌‌‌‌లో తెలంగాణలో 40 నదులు ఉన్నాయి. లెండి, మంగెర, హరిద్ర, సుద్దవాగు, కడెం, పెనగంగ, పెద్దవాగు, సత్నాలా, వట్టివాగు, చలిమెలవాగు, రాలి వాగు, రాళ్లవాగు, ఎర్రవాగు, గొల్లవాగు, వార్ధా, ప్రాణహిత, ఇంద్రావతి, మోదికుంటవాగు, చిక్కపల్లివాగు, గుండ్లవాగు, పాలెంవాగు, కిన్నెరసాని, తాలిపేరు, మల్లూరు, లక్నవరం, మురేడు, నాలవాగు, పోచారం, హల్ది, మానేరు, మూల, హుస్సేన్‌‌‌‌మియా, మోరంచ, కడలేరు, మ్రోగితుమేద, స్వర్ణ, బోగువాగు, మేదివాగు, అయేర్రు. గోదావరి పూర్వం 7 జిల్లాల్లో  ప్రవహించేది. అవి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి. ప్రస్తుతం 20 జిల్లాల నుంచి ప్రవహిస్తోంది. ఆ జిల్లాలు ఆదిలాబాద్, కుమ్రం భీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి, వరంగల్, హనుమకొండ, ములుగు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, మహబూబాబాద్. 

ప్రస్తుతం గోదావరి నది ఈ కింది జిల్లాలను వేరు చేస్తూ ప్రవహిస్తోంది.

1. నిర్మల్, నిజామాబాద్
2. నిర్మల్, జగిత్యాల
3. మంచిర్యాల, జగిత్యాల
4. మంచిర్యాల, పెద్దపల్లి 
5. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు

మంజీర: మరాఠీ భాషలో మంజీరాను మంజ్ర అంటారు మంజీర నది జన్మస్థలం బాలాఘాట్ శ్రేణి. ఈ శ్రేణి మహారాష్ట్రలోని అహ్మద్‌‌‌‌నగర్ జిల్లాలో ఉంది. మంజీర తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో ప్రవేశిస్తుంది. ఈ నది గతంలో మూడు జిల్లాల నుంచి ప్రవహించేది. అవి మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్. ప్రస్తుతం 6 జిల్లాల గుండా ప్రవహిస్తోంది. అవి సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, వికారాబాద్, నిజామాబాద్, సిద్దిపేట

హరిద్ర: హరిద్ర జన్మస్థలం రుద్రురు, బోధన్ మండలం, నిజామాబాద్ జిల్లా. హరిద్ర రిజర్వాయర్ నిజామాబాద్ జిల్లాలో మాత్రమే ఉంటుంది. ఆ జిల్లాలో మాత్రమే ప్రవహిస్తుంది.

కృష్ణా నది: కృష్ణా నది దేశంలో మూడో అతి పెద్ద నది. ద్వీపకల్ప నదుల్లో రెండో అతిపెద్దది. దేశంలో కృష్ణా నది పొడవు 1400 కి.మీ. తెలంగాణ రాష్ట్రం గుండా 612 కి.మీ. పొడవు ప్రవహిస్తుంది. మహబూబ్‌‌‌‌నగర్ జిల్లా కృష్ణా మండలం లేదా మక్తల్ మండలంలోని తంగడి గ్రామం వద్ద ప్రవేశిస్తుంది. కృష్ణా నది ముఖ్యమైన ఉప నదులు దూద్‌‌‌‌గంగ, పంచగంగ. కృష్ణా నదికి కుడివైపున గల ఉప నదులు ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, కోయిన, యొన్న. ఎడమ వైపున గల ఉపనదులు భీమా, మూసి, మున్నేరు, దిండి, పాలేరు. తెలంగాణలో కృష్ణా పరివాహక వైశాల్యం 68 శాతం.  కృష్ణా నది దేశంలో 4 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. అవి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక.

కృష్ణా బేసిన్‌‌‌‌లో..

కృష్ణా బేసిన్‌‌‌‌లో తెలంగాణలో దాదాపు 20 నదులు ఉన్నాయి. భీమా, తుంగభద్ర, జురాల, పెద్దవాగు, దిండి, హలియా, ఖంగల్, మూసి, పాలేరు, మున్నేరు, వైరా, కొటలేరు, ఖంగ, కాకరవేణి, కొటేపల్లివాగు, ఈసీ, ఆలేరు, బయనవాగు, ఆకేరు, పాకాల. కృష్ణా నది గతంలో 6 జిల్లాల్లో ప్రవహించేది. అవి మహబూబ్‌‌‌‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం. ప్రస్తుతం 18 జిల్లాల గుండా ప్రవహిస్తోంది. అవి.. మహబూబ్‌‌‌‌నగర్, గద్వాల జోగులాంబ, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, హైదరాబాద్, రంగరెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌‌‌‌గిరి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, సిద్దిపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, జనగాం. కృష్ణా నది ప్రస్తుతం 1. వనపర్తి, జోగులాంబ,  2. నారాయణపేట, జోగులాంబ జిల్లాలను వేరుచేస్తూ ప్రవహిస్తోంది.

మూసీ నది : మూసీ నది జన్మస్థలం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలు. వాడపల్లి (వజిరాబాద్) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. వాడపల్లి నల్లగొండ జిల్లాలో ఉంది. గండిపేట చెరువు (ఉస్మాన్‌‌‌‌సాగర్) మూసీ నది ఒడ్డున ఉంది. ప్రాచీనకాలంలో ముఖ్యమైన రేవు పట్టణం వాడపల్లి. మూసీ నది గతంలో 4 జిల్లాల గుండా ప్రవహించేది. అవి రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, వరంగల్. ప్రస్తుతం 9 జిల్లాల గుండా ప్రవహిస్తోంది. అవి వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట. 

- పృథ్వీ కుమార్ చౌహాన్, పృథ్వీస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్