
- ఆలస్యంగా వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్
- ప్రమాణస్వీకారం బహిష్కరించిన ఎంపీటీసీలు
జగిత్యాల టౌన్(వెల్గటూర్), వెలుగు: ఉదయం పదకొండు గంటలకు వస్తానన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ సాయంత్రం అయినా రాకపోవడంతో వేచి చూసీ చూసీ విసుగొచ్చిన ఎంపీటీసీలు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించారు. మంత్రి రాక కోసం గంటల కొద్ది టైమ్ వెయిట్ చేయిస్తూ ఆఫీసర్లు ప్రోగ్రాం నిర్వహించకపోవడం బాధకరమని, ఆయనకు సమయపాలన లేదని ఆరోపించి కొందరు ఎంపీటీసీలు ప్రమాణస్వీకారం చేయకుండానే వెళ్లిపోయారు.
గురువారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల ప్రజాపరిషత్ ఆఫీస్‌లో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి కొప్పులను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. మొత్తం 15 మంది ఏంపీటీసీలు టైమ్‌కు అటెండ్ అయ్యారు. మంత్రి కోసమని వెయిట్ చేసూ ఆఫీసర్లు ప్రోగ్రామ్ ఎంతకీ స్టార్ట్ చేయకపోవడంతో నలుగురు కాంగ్రెస్ ఎంపీటీసీలు, ఒక ఇండిపెండెంట్ఎంపీటీసీ పదవీబాధ్యతలు చేపట్టకుండా ప్రోగ్రాం బహిష్కరించారు. వారు మాట్లాడుతూ ఆఫీసర్లు చెప్పిన టైమ్ కంటే ముందే మేం వచ్చాం. అయితే మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఇతర ప్రోగ్రాంలు ఉన్నాయని, సాయంత్రం వరకు ప్రమాణస్వీకారం ఉండదని కనీసం సమాచారం ఇవ్వకపోవడం బాధకరమన్నారు. ధర్మారంలో టైమ్‌కు కార్యక్రమం నిర్వహించి వెల్గటూర్‌కు రావడానికి మంత్రి సమయమంతా హరించారని అందుకే తామంతా బహిష్కరించినట్లు తెలిపారు. బహిష్కరించిన వారిలో ఎంపీటీసీలు ఎండీ బషీర్, రంగు తిరుపతి, గాజుల మల్లేశం, అనుమండ్ల మంజుల, జాడీ సుజాత ఉన్నారు. అయితే సాయంత్రం 4:30 గంటలకు మంత్రి రావడంతో ఆఫీసర్లు మిగిలిన ఎంపీటీసీలతో ప్రమాణస్వీకారం పూర్తి చేయించారు.