స్టూడెంట్లపై లాఠీచార్జ్‌‌ సిగ్గుచేటు ..కేంద్రంపై కాంగ్రెస్‌‌ లీడర్‌‌‌‌ రాహుల్‌‌ గాంధీ మండిపాటు

స్టూడెంట్లపై  లాఠీచార్జ్‌‌ సిగ్గుచేటు ..కేంద్రంపై కాంగ్రెస్‌‌ లీడర్‌‌‌‌  రాహుల్‌‌ గాంధీ మండిపాటు

న్యూఢిల్లీ: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఎస్ఎస్‌‌సీ అభ్యర్థులపై లాఠీచార్జ్‌‌ చేయడం దారుణమని కాంగ్రెస్‌‌ లీడర్‌‌‌‌ రాహుల్‌‌ గాంధీ మండిపడ్డారు. ఇది పిరికి ప్రభుత్వ లక్షణమని విమర్శించారు. యువకుల ఆందోళనను పరిగణలోకి తీస్కోకుండా వారిని పోలీసులతో కొట్టించడం సిగ్గుచేటని ఆయన సోమవారం ట్వీట్‌‌ చేశారు. ఓట్ల చోరీతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ సర్కారుకు యువకుల భవిష్యత్తును కూడా దోచుకోవడం అలవాటుగా మారిందని ఆరోపించారు. 

‘‘ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిరసన తెలుపుతున్న ఎస్ఎస్‌‌సీ అభ్యర్థులు, టీచర్లపై లాఠీచార్జ్‌‌ చేయడం పిరికి ప్రభుత్వ లక్షణం, సిగ్గుచేటు”అని రాహుల్‌‌ ఎక్స్‌‌లో పోస్ట్‌‌ చేశారు. పరీక్షలు మెరుగ్గా నిర్వహించాలని యువకుల గళమెత్తితే అణిచివేసేందుకు ప్రయత్నించడమేంటని ప్రశ్నించారు. యువకులు, రైతులు, పేదలు, దళితులు, మైనార్టీల డిమాండ్లకు కేంద్రం ప్రాధాన్యం ఇవ్వట్లేదని మండిపడ్డారు. 

కాంగ్రెస్‌‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. బీజేపీ పాలనలో రిక్రూట్‌‌మెంట్‌‌ ప్రక్రియల్లో అవినీతి కారణంగా యువత భవిష్యత్తు నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న స్టూడెంట్లపై బలప్రయోగం చేయడం ప్రభుత్వానికి అవమానకరమని, సిగ్గుచేటని ట్వీట్‌‌ చేశారు.