
గోదావరి ఖని, వెలుగు : రామగుండం ఎన్టీపీసీలో అగ్రిమెంట్ ను అమలు చేయాలంటూ ఆందోళన చేపట్టిన కాంట్రాక్ట్ కార్మికులపై సీఐఎస్ఎఫ్ పోలీసులు లాఠీచార్జ్ చేసి చితకబాదారు. పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా లాఠీలతో కొట్టడంతో దాదాపు వందమందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి తలలు పగిలి రక్తం కారగా, మరికొందరికి కాళ్లు, చేతులు, వీపులపై తీవ్ర గాయాలయ్యాయి. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్‌లోని వివిధ లొకేషన్లలో 3,500 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తుంటారు. గతంలో అగ్రిమెంట్ టైమ్ పూర్తికాగా 2018 నుంచి తిరిగి అమలు కావాల్సి ఉంది. ఇందులో కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయడం, వారసత్వ ఉద్యోగ అవకాశం, ప్రమోషన్, హైస్కిల్డ్, స్కిల్డ్ వేతనాలు, తదితర అంశాలున్నాయి.
అగ్రిమెంట్ ను అమలు చేయాలని జేఏసీ లీడర్లు కౌశిక హరి, చిలుక శంకర్, నాంసాని శంకర్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందు 500 మంది కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేపట్టగా సీఐఎస్ఎఫ్ పోలీసులు ఒక్కసారిగా లాఠీచార్జ్ చేశారు. జర్నలిస్టులను సైతం లాఠీలతో కొట్టారు. కార్మికులు, పోలీసులు రాళ్లతో దాడులు చేసుకున్నారు. గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు వచ్చాక పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం జేఏసీ లీడర్లు ఎన్టీపీసీ హెచ్‌ఆర్ మేనేజర్ సుదర్శన్‌తో చర్చలు జరిపారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. గాయపడ్డ కార్మికులుఎన్టీపీసీ పోలీస్ స్టేషన్‌లో సీఐఎస్‌ఎఫ్ పోలీసులపై ఫిర్యాదు చేశారు. కార్మికులపై లాఠీఛార్జీని ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేప ట్టారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు మారం వెంకటేశ్, దుబాసి మల్లేశ్, సాదుల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
లాఠీచార్జీ దుర్మార్గం: వివేక్ వెంకటస్వామి
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు, జేఏసీ లీడర్లు కౌశిక హరి, మరికొందరిపై సీఐఎస్‌ఎఫ్ పోలీసులు లాఠీఛార్జీ చేయడం దుర్మార్గమైన చర్య అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, పార్టీ నేత పి. మల్లికార్జున్ తీవ్రంగా ఖండించారు. రామగుండం ఎన్టీపీసీలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు అగ్రిమెంట్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ లీడర్లు, కార్మికులపై లాఠీచార్జ్ చేసిన సీఐఎస్ఎఫ్ పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు.