
పాట్నా: బిహార్‌లో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిందని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. దశాబ్దాల ఎన్డీయే పాలనలో 65 వేల హత్యలు జరిగాయని తెలిపారు. బిజినెస్‌మెన్ గోపాల్ ఖేమ్కా హత్యపై స్పందిస్తూ ఆదివారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో తేజస్వీ యాదవ్ పోస్టు పెట్టారు. ‘‘బిహార్‌లో కుప్పకూలుతున్న లా అండ్ ఆర్డర్, పెరిగిపోతున్న అవినీతిపై ఎవరికైనా కోపం రావడం లేదంటే.. వాళ్లలో న్యాయ భావన, మానవత్వం చచ్చిపోయినట్టే.
కులం, మతం పేరుతో ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజల సెంటిమెంట్లను విస్మరించడం దారుణం. అది బిహార్ వినాశనానికి కారణమవుతుంది” అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఏడేండ్ల కింద గోపాల్ ఖేమ్కా కొడుకు గుంజన్‌ను కూడా కాల్చి చంపారు. ఆ క్రిమినల్స్‌ను అధికార పార్టీ నేతలు కాపాడుతున్నారు. వాళ్లంతా బెయిల్‌పై దర్జాగా బయట తిరుగుతున్నారు” అని మండిపడ్డారు.