
- 2029లో జరిగే చాన్స్
- వన్ నేషన్, వన్ ఎలక్షన్ పై కొనసాగుతున్న కసరత్తు
- 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే రిపోర్ట్ సబ్మిట్ చేయనున్న కమిషన్
న్యూఢిల్లీ : ఇప్పట్లో జమిలి ఎన్నికలు సాధ్యం కావని లా కమిషన్ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. 2024 ఎన్నికలకు ముందు ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ అమలు చేయడం కష్టమే అని లా కమిషన్ భావిస్తున్నట్లు వివరించాయి. ఈ మేరకు 22వ లా కమిషన్ తన నివేదికను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సబ్మిట్ చేసేందుకు సిద్ధం చేస్తున్నది. జమిలి ఎన్నికలపై లా కమిషన్ రిపోర్ట్‌ను 2024 లోక్‌సభ ఎన్నికల్లోగా పబ్లిష్ చేసే అవకాశం ఉందని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రుతురాజ్ అవస్థి ఇటీవల వెల్లడించారు.
జమిలి ఎన్నికలపై కసరత్తు ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు. అందుకే, నివేదిక సిద్ధం చేయడానికి కొంత టైమ్ పడుతుందని వివరించారు. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు కూడా ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు లా కమిషన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 2024 లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్లు వివరించాయి. లా కమిషన్ వర్గాల సమాచారం ప్రకారం.. 2029లోనే జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతున్నది.
2022 డిసెంబర్‌లో 22వ లా కమిషన్ జమిలి ఎన్నికల ప్రతిపాదనపై జాతీయ రాజకీయ పార్టీలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, బ్యూరోక్రాట్లు, విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాలు కోరేందుకు ఆరు ప్రశ్నలను రూపొందించింది. ప్రతిపాదనలు పూర్తయిన వెంటనే నివేదిక సిద్ధం చేసేందుకు లా కమిషన్ కసరత్తు చేస్తున్నది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే లా మినిస్ట్రీకి సబ్మిట్ చేయాలని భావిస్తున్నది.
21వ లా కమిషన్ చెప్పింది ఏంటంటే..
లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం ద్వారా ప్రజా ధనం ఆదా చేయొచ్చని 2018లో, 21వ లా కమిషన్ అభిప్రాయపడింది. నిర్వహణ వ్యవస్థ, భద్రతా దళాలపై భారం కూడా తగ్గించొచ్చని సెంటర్ లా మినిస్ట్రీకి అందజేసిన డ్రాఫ్ట్‌లో పేర్కొంది. జమిలి ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ పథకాలు, విధానాల అమలు మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడింది.
అయితే, దీని కోసం రాజ్యాంగంలో సవరణ చేయాల్సి ఉంటుందని కూడా సూచించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సంబంధిత నిబంధనలను సవరించాలని కూడా సిఫారసు చేసింది. ఈ సవరణలన్నీ పూర్తి చేస్తే ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ సాధ్యమవుతుందని సూచించింది.
స్వలింగ సంపర్కులు యూసీసీ కింద రారు..
ఈ–ఎఫ్ఐఆర్ నమోదు, యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)పై కూడా నివేదికను లా కమిషన్ కేంద్రానికి సమర్పించింది. దేశ వ్యాప్తంగా ఈ – ఎఫ్ఐఆర్ రిజిస్టర్‌ను దశలవారీగా అమల్లోకి తీసుకురావాలని సూచించింది. శిక్ష పడే దాన్ని బట్టి ఇంప్లిమెంట్ చేయాలని తెలిపింది. ముందుగా మూడేండ్లు శిక్ష పడే నేరాలకు సంబంధించిన కేసుల్లో ఈ – ఎఫ్ఐఆర్ విధానం అమల్లోకి తేవాలంది. దీని కోసం సెంట్రలైజ్డ్ నేషనల్ పోర్టల్ ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొంది.
వివిధ మతాలకు సంబంధించిన ‘పర్సనల్ లా’లు ఈ చట్టంతో ఉమ్మడి చట్టం కిందే వస్తుందని పేర్కొంది. యూసీసీ మతంపై ఆధారపడకుండా దేశ పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుందని వివరించినట్లు తెలిసింది.
ఇప్పటికే హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించే విషయాన్ని పరిశీలించి, సిఫార్సు చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 23న కోవింద్ అధ్యక్షతన ప్యానెల్ ఫస్ట్ టైమ్ సమావేశమైంది. ప్యానెల్ సభ్యులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాశ్ సి కశ్యప్, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలు ఉన్నారు. ఈ క్రమంలో లా కమిషన్ వర్గాలు చేసిన కామెంట్లు జమిలి ఎన్నికల నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి. మరికొన్ని రోజుల్లో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయనుంది.
లైంగిక అంగీకార వయస్సు 16 ఏండ్లకు తగ్గించొద్దు
పోక్సో చట్టానికి సంబంధించిన లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అంగీకారం తెలిపే వయస్సుపై లా కమిషన్ ఆఫ్ ఇండియా తన రిపోర్ట్ ను శుక్రవారం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సబ్మిట్ చేసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక సంబంధ విషయంలో అంగీకారం తెలిపే వయస్సును 16 ఏండ్లకు తగ్గించాలని కొందరు డిమాండ్ చేయడాన్ని వ్యతిరేకించింది. 18 ఏండ్లు ఉంచాలని సూచించింది. 16 ఏండ్లకు తగ్గిస్తే.. చైల్డ్ ట్రాఫికింగ్, బాల్య వివాహాలు వంటి వాటిపై జరుగుతున్న పోరాటాలపై నెగిటివ్ ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది.
పోక్సో చట్టం ప్రకారం ఇప్పుడు ఉన్న అంగీకార వయస్సు మార్చడం మంచిది కాదని తెలిపింది. అయితే, 16 నుంచి 18 ఏండ్ల మధ్య వయస్సున్న పిల్లలు పరస్పర అంగీకారంతో లైంగిక చర్యలో పాల్గొంటే.. అలాంటి కేసుల పరిష్కారానికి మాత్రం చట్టంలో కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమా? ఆకర్షణా? క్రిమినల్ ఉద్దేశం ఉందా? అనేది కోర్టు గుర్తించాల్సి ఉంటుందని ప్యానెల్ తన నివేదికలో సూచించింది.
ఇలాంటి కేసుల్లో పోలీసుల దర్యాప్తు కూడా ఎంతో కీలకమని అభిప్రాయపడింది. అందరి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని రిపోర్ట్ సబ్మిట్ చేసినట్లు లా కమిషన్ ప్యానెల్ వెల్లడించింది.