పెండింగ్​లోనే ఫారెస్ట్, మహిళా వర్సిటీల చట్టాలు 

పెండింగ్​లోనే ఫారెస్ట్, మహిళా వర్సిటీల చట్టాలు 
  • చట్టం చేయట్లే..ఆర్డినెన్స్ తేవట్లే
  • పెండింగ్​లోనే ఫారెస్ట్, మహిళా వర్సిటీల చట్టాలు 
  • ఐదు ప్రైవేటు వర్సిటీల చట్టాలదీ అదే ధోరణి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ పలు అంశాలకు ఆమోదం తెలిపినా.. అవి ఇంకా చట్టరూపంలోకి మారట్లేదు. పలు యూనివర్సిటీల చట్టాలు పెండింగ్​లోనే ఉంటున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమైనా సర్కారు వర్సిటీల చట్టాలలో మార్పులు, ప్రైవేటు వర్సిటీల చట్టాలనూ రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతోంది. సీఎం కేసీఆర్.. గవర్నర్ తమిళిసై మధ్య విభేదాలతోనే జాప్యం జరుగుతున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఎంఎన్ఆర్, గురునానక్, నిక్మార్, కావేరీ (అగ్రీ వర్సిటీ), సీఐఐ -అమిటీ తదితర 5 ప్రైవేటు వర్సిటీలకు ఏప్రిల్​లోనే కేబినెట్ ఆమోదించింది. వర్సిటీల్లో టీచింగ్ రిక్రూట్​మెంట్ కోసం కామన్ రిక్రూట్​మెంట్ బోర్డు ఏర్పాటుకు అంగీకరించింది. రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీకి కూడా కేబినెట్ అనుమతించింది. ఫారెస్ట్ వర్సిటీకి అంతకుముందు జనవరిలో జరిగిన భేటీలోనే కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటన్నింటి ఏర్పాటుకు అధికారికంగా చట్టం తీసుకురావాల్సి ఉన్నా.. ఇప్పటికీ ఏ ఒక్కటీ రాలేదు. వర్సిటీలను ఈ విద్యాసంవత్సరం ప్రారంభించాల్సి ఉన్నా, ఇప్పటికీ చట్టం గానీ ఆర్డినెన్స్ గానీ రాకపోవడంతో అయోమయం నెలకొన్నది. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. ఈ నెల 21న అసెంబ్లీ సమావేశం పెట్టి, వీటిని ఆమోదిస్తారని ప్రచారం జరిగింది కానీ, ఆ సమావేశం కాస్తా రద్దయింది. దీంతో మళ్లీ అసెంబ్లీ ఎప్పుడు పెడతారో తెలియని పరిస్థితి నెలకొంది. 

వర్సిటీల చట్టాల సవరణపైనా నిర్లక్ష్యమే

రాష్ట్రంలో కామన్ రిక్రూట్​మెంట్ బోర్డు ద్వారా వర్సిటీల్లోని 3500 పోస్టులను భర్తీ చేస్తామని సర్కారు ప్రకటించింది. దీనికి అన్ని యూనివర్సిటీల చట్టాలను మార్చాల్సి ఉంది. అందులో భాగంగా ప్రభుత్వం కామన్ బోర్డు చైర్మన్, మెంబర్లను నియమించింది. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు చట్టం చేయలేదు.

అడ్మిషన్లు నడుస్తున్నయ్

రాష్ట్రంలో కొత్తగా కేబినేట్ ఆమోదించిన ప్రైవేటు వర్సిటీలు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టాయి. గురునానక్​ వర్సిటీ సర్కారు పెద్దలు పాల్గొనే పలు ఎడ్యుకేషన్ ఫెయిర్లలోనూ పాల్గొంటోంది. ఫీజుల లిస్టు వెబ్‌‌సైట్​లో పెట్టి అడ్మిషన్లు తీసుకుంటోంది. కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా యూనివర్సిటీగా ప్రభుత్వం అప్ గ్రేడ్​ చేసింది. చట్టం చేయకపోయినా ఆ వర్సిటీలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. డిగ్రీ అడ్మిషన్లకు దోస్త్​లోనూ అధికారులు మహిళా వర్సిటీ పేరును చేర్చారు. కాగా, ఇప్పటికీ ఆ వర్సిటీకీ వీసీ లేదా డైరెక్టర్​ను కూడా ప్రభుత్వం నియమించలేదు.