
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కోర్టు విచారణలు సైతం ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు సహా అన్ని రాష్ట్రాల హైకోర్టులు కూడా అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా లాయర్ టీ షర్ట్ వేసుకుని మంచంపై పడుకుని న్యాయమూర్తి ముందుకు వచ్చారు. దీనిపై జడ్జి హెచ్చరించడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. హర్యానాలోని రేవరీ ఫ్యామిలీ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును బీహార్‌లోని జెహానాబాద్ కోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్‌పై ఆ లాయర్ వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే లాయర్ మంచంపై పడుకుని కనిపించడంతో సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవీంద్ర భట్.. ఆయన తీరును తప్పుబట్టారు. కనీస కోర్టు మర్యాదను పాటించాలని సూచించారు. దీంతో ఆ లాయర్ తాను ఇలా టీషర్టు వేసుకుని, మంచంపై పడుకుని విచారణకు హాజరు కావడం తప్పేనని, మన్నించాలని కోరారు. అయితే ఏప్రిల్ నెలలో రాజస్థాన్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా లాయర్ బనియన్‌లో కనిపించారు. దీంతో న్యాయమూర్తి ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.