
సంగారెడ్డి టౌన్, వెలుగు: సుప్రీం కోర్టులో సీజేఐ బీఆర్ గవాయ్‌పై న్యాయవాది రాకేశ్ కిషోర్ దాడికి ప్రయత్నించడాన్ని నిరసిస్తూ మంగళవారం సంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చే శారు. సీనియర్ న్యాయవాదులు శ్రీనివాస్ రామారావు, నారాయణ, కృష్ణా ,దర్శన్, లక్ష్మి మాట్లాడుతూ.. సీజేఐపై జరిగిన దాడిని భారత రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థ పై, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.
రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి న్యాయవాదులు ముందు వరుసలో ఉండాలని పిలుపునిచ్చారు. రాకేష్ కిషోర్ బార్ కౌన్సిల్ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు రత్నాకర్, సంజీవయ్య,పెంటయ్య, యాదయ్య, అపర్ణ, విజయదుర్గ, సుభాష్ చంద్ర, సింధూజ, చందర్ నాయక్, జైపాల్, ప్రభాకర్ పాల్గొన్నారు.
కోర్టు విధులు బహిష్కరించిన న్యాయవాదులు
చేర్యాల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయిపై దాడిని తీవ్రంగా ఖండిస్తు చేర్యాల కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఇలాంటి సంఘటనలు దేశభద్రతకు, న్యాయవ్యవస్థకు కళంకమని తెలిపారు. కార్యక్రమంలో చేర్యాల బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ వీరమల్లయ్య, ప్రధాన కార్యదర్శి ప్రణీత్, కార్యదర్శి సురేశ్ కృష్ణ , న్యాయవాదులు సురేందర్, మనోహర్, మహేందర్, ప్రసాద్ పాల్గొన్నారు.
సీజేఐ మీద దాడి చేసిన మతోన్మాదిని కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనం రమేశ్డిమాండ్చేశారు. ఆర్ఎస్ఎస్దిష్టిబొమ్మను చేర్యాల పాత బస్‌స్టాండ్ వద్ద దహనం చేశారు. కార్యక్రమంలో రాంప్రసాద్, మల్లేశం, అలీం, ఎల్లయ్య, కనకవ్వ, బ్రహ్మయ్య, రమేశ్, తిరుపతి పాల్గొన్నారు.
భారత రాజ్యాంగంపై తీరని మచ్చ
హుస్నాబాద్: సుప్రీం కోర్టులో మతవాద న్యాయవాది చేసిన దాడి భారత రాజ్యాంగంపై తీరని మచ్చ అని హుస్నాబాద్ జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ అన్నారు. సీజేఐ గవాయిపై న్యాయవాది రాకేశ్ కిషోర్ కాలి బూటుతో దాడి చేసిన ఘటనపై హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రజాసంఘాలు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ అణగారిన వర్గానికి చెందిన వ్యక్తి ప్రధాన న్యాయమూర్తిగా ఎదగడం జీర్ణించుకోలేక చేసిన కుట్ర ఇది అన్నారు.