
చేనేత ఉత్పత్తుల జీఎస్టీపై రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధమా? అని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం కింద లోన్స్ కోసం అప్లికేషన్స్ పెట్టుకుంటే.. వాటిని కేంద్రానికి పంపించకుండా రాష్ట్ర ప్రభుత్వం తొక్కి పెడుతోందన్నారు. టెస్కో సంస్థలను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఎత్తి వేసిందన్నారు. నూలు సబ్సిడీ 10 శాతం నుండి 15 శాతానికి పెంచిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనన్నారు. అత్యధికంగా ముద్ర లోన్స్ ను చేనేత కార్మికులు పొందుతున్నారని చెప్పారు.
వనస్థలిపురంలో తెలంగాణ యునైటెడ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోస్టల్ కవర్ లాంచింగ్ కార్యక్రమానికి లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కొండా లక్ష్మణ్ బాపూజీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మహా నేత అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ బాపూజీని వంచించి ముఖ్యమంత్రి కాకుండా చేసిందన్నారు. బాపూజీ సేవలను కేసీఆర్ విస్మరించారన్నారు. దేశ వ్యాప్తంగా అఖిల భారత పద్మశాలీల సంఘాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి బాపూజీ అని కొనియాడారు. మొదటి నుండి తెలంగాణ సాధన కోసం పోరాడిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. మొదటి దశ ఉద్యమంలో మొదటిసారిగా రాజీనామా చేసిన మహోన్నత వ్యక్తి బాపూజీ అని అన్నారు.