కొప్పుల ఈశ్వర్ కు ​అడ్లూరి లక్ష్మణ్‍ కుమార్ సవాల్

  కొప్పుల ఈశ్వర్ కు ​అడ్లూరి లక్ష్మణ్‍ కుమార్ సవాల్

కరీంనగర్‍ టౌన్, వెలుగు: మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మానికి, న్యాయానికి  కట్టుబడి ఉంటే ఈ నెల 24న హైకోర్టులో రీ కౌంటింగ్  పిటిషన్ వేయాలని ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‍ కుమార్ సవాల్​విసిరారు. శుక్రవారం కరీంనగర్​డీసీసీ ఆఫీస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్‍ కుమార్ మాట్లాడారు. 2018 ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో ధర్మపురి నియోజకవర్గంలో అవకతవకలు జరిగాయని,  కౌంటింగ్ చివరి నిమిషంలో 11 ఈవీఎమ్ మెషీన్లు మొరాయించాయన్నారు. కానీ, అధికారుల చేతివాటంతో గెలుపు మారిపోయిందన్నారు. చివరి రౌండ్ వరకు తానే 3,500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నానని, చివరి 11ఈవీఎంల లెక్కించి 440 ఓట్లతో కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు ప్రకటించారని అన్నారు. అప్పటి కలెక్టర్ శరత్, రిటర్నింగ్ ఆఫీసర్ కలిసి కౌంటింగ్ సిబ్బందికి ఆదేశాలివ్వడం వల్లే ఇలా జరిగిందన్నారు. కౌంటింగ్ రోజుకు సంబంధించిన అన్ని వీడియో, సీసీ ఫుటేజీలను అందించాలని ఆర్టీఐ ద్వారా కోరినా 
ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. 

ఈశ్వర్​ పిటిషన్​ను కొట్టేసిన సుప్రీం 

లెక్కింపులో జరిగిన అవకతవకలపై రీ కౌంటింగ్ జరపాలని హైకోర్టును ఆశ్రయించానని చెప్పాడు. రీ కౌంటింగ్ జరపాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఆరుగురు సీనియర్ అడ్వొకేట్లతో ఈశ్వర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారని, సుప్రీంకోర్టు కూడా ఈశ్వర్  పిటిషన్ ను తప్పుపడుతూ కొట్టివేసిందని, హైకోర్టు తీర్పును సమర్థించిందని తెలిపారు. ఇప్పటికైనా కౌంటింగ్ కు సహకరించి, ధర్మం, న్యాయంవైపు నిలవాలని సూచించారు. చిత్తశుద్ది ఉంటే ఈశ్వర్ ఈనెల 24న హైకోర్టులో జరిగే హియరింగ్ కు హాజరై, కౌంటింగ్ కోసం  పిటిషన్ వేయాలని కోరారు. మొత్తం పోలైన ఓట్లకు, కౌంటింగ్ లో వచ్చిన ఓట్లకు ఒక శాతం తేడా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్​లీడర్లు అంజన్ కుమార్, నరేందర్ రెడ్డి ఉన్నారు.