కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకగూటి పక్షులే

కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకగూటి పక్షులే
  • రాష్ట్రంలో ప్రజల ఆశయాలకు భిన్నంగా కుటుంబ పాలన
  • టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్

రాష్ట్రంలో అవినీతి పాలనతో, కుటుంబ పాలనతో విసిగిపోయిన ప్రజలకు ఇవాళ బీజేపీ ఒక ఆశాకిరణంగా కనిపిస్తోందని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పతనమయ్యే సమయం ఆసన్నమైందన్నారు. రాష్ర్టంలో కుటుంబ పాలనకు స్వస్తి పలికేందుకే బీజేపీ విజయ శంఖారావం పూరించిందన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు,ఆశయాలకు భిన్నంగా కుటుంబ  కొనసాగుతోందని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియమాకాలు కావాలని తెగించి, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో యువకుల బతుకులు ఆగమైపోయాయని, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు తలెత్తాయని, చేనేత కార్మికుల మగ్గాలు మూగబోయాయని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు విసిగిపోయాయని, అందుకే ఇవాళ మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు ఒక బీజేపీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. 

యూపీ తరహా పాలన కావాలంటే

కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకగూటి పక్షులేనని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. మజ్లిస్ మతోన్మాద రాజకీయాలను, కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలను, టీఆర్ఎస్ కుటుంబ పాలను ఎదుర్కొవాలనే దమ్ము, ధైర్యం, సాహసం ఒక బీజేపీకి, ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలన్నా, నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపాలన్నా, వ్యవసాయం లాభసాటిగా సాగాలన్నా నరేంద్ర మోడీ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ప్రజారంజక పాలన కొనసాగుతోందని, ఆ రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయని తెలిపారు. యూపీ తరహా పాలన తెలంగాణలోనూ రావాలంటే రాష్ట్రంలో బీజేపీ రావాల్సిందే అన్నారు. రాష్ర్ట ప్రజలందరికీ భరోసా కల్పించేందుకు, అవినీతిలో కూరుకుపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పెకిలించేందుకు బీజేపీ సన్నద్ధమైందన్నారు.