అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్

అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్

హైదరాబాద్: కార్లు, బైక్ లు దొంగిలిస్తూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఓ నేరస్థుడ్ని ఎల్బీ నగర్ సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. రాచకొండ క్రైం డీసీపీ యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లాకు చెందిన ధరావత్ రమేశ్ గతంలో పలు కేసుల్లో నేరస్థుడిగా ఉన్నారు. ఇటీవల ఎల్ బీ నగర్ పరిధిలోని సూర్య నగర్ కాలనీలో ఆఫీస్ ముందు పార్క్ చేసిన స్కోడా కారు చోరీకి గురైంది. అనుమానం రావడంతో రమేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. స్కోడా కారుతో పాటు చాలా దొంగతనాలు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. పగటి పూట కార్లు, బైకులు కొట్టేస్తూ... రాత్రి వేళ ఇళ్లల్లో చోరీలకు పాల్పడినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.

నిందితుడి నుంచి రూ.35.5 లక్షల విలువైన 10 తులాల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, రెండు బైక్ లు, మూడు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే మొత్తం 22 కేసులు నమోదు కాగా... అందులో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 10, సూర్యాపేట జిల్లాలో 5, నల్గొండ జిల్లాలో 3, కొత్తగూడెంలో 1, విజయ వాడలో 1, విశాఖపట్నంలో 2 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడి కోర్టుకు కోర్టుకు తరలించారు.