వైఎస్ షర్మిల‌తో కలిసి పనిచేస్తా.. అది నా బాధ్యత

వైఎస్ షర్మిల‌తో కలిసి పనిచేస్తా.. అది నా బాధ్యత

వైఎస్ షర్మిల‌తో కలిసి పనిచేస్తానని ప్ర‌ముఖ మ‌హిళా నేత‌ ఇందిరా శోభ‌న్ తెలిపారు. బుధ‌వారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆమె.. అనంత‌రం ష‌ర్మిల‌తో భేటి అయ్యారు. త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రాజన్న రాజ్యం కోసం షర్మిల‌ పనిచేస్తున్నారని, తెలంగాణ హక్కులకోసం 100 శాతం పోరాడుతామని ఆమె హామీ ఇచ్చిన‌ట్టు తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమ‌ని, 4 కోట్ల ప్రజల కోసం పనిచేయడమే ముఖ్యం, ప్రాంతీయత కాదని అన్నారు. మహిళగా మరొక మహిళకు సపోర్ట్ చేయడం త‌న బాధ్యతగా చెప్పారు.

అయితే తాను మొదటినుంచి సమస్యలపైనే పోరాడాన‌ని, తెలంగాణ ఉద్యమం నుంచి ఈరోజు వరకు ప్రజలకోసం పనిచేశానని కాంగ్రెస్ పార్టీలో పని మాత్రమే ఉంటుంది తప్ప గుర్తింపు లేదని ఇందిరా శోభ‌న్ అన్నారు. పనిచేసినప్పుడు పదవులు ఆశించడం తప్పుకాదని ఆమె అన్నారు. కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలున్నాయని.. ఓడిపోయిన వారికే మళ్ళీ మళ్ళీ పోటీచేసే అవకాశాలు ఇస్తూ, పనిచేసే త‌న లాంటి వారికి అన్యాయం చేస్తున్నారని ఆవేద‌న చెందారు. పదవులు ఇవ్వకపోయినా కనీసం పిలిచి మాట్లాడేవారు కూడా కాంగ్రెస్ నాయకత్వం లో లేరని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రజల అవసరాలను గుర్తించదని, ప్రజలు కోరుకునేది ఒకటైతే కాంగ్రెస్ నేతలు చేసేది ఒక‌ట‌ని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ ప‌నిచేశార‌ని, ఆయ‌న ఆశయాలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగడంలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రజా పోరాటం చేయడం లేద‌ని అన్నారు ఇందిరా శోభ‌న్.