
ములుగు జిల్లా : మేడారంలోని వనదేవతలను జనం పెద్దసంఖ్యలో దర్శించుకుంటున్నారు. ఇవాళ ఇద్దరు ఎంపీలు మేడారం వెళ్లి.. మొక్కులు చెల్లించుకున్నారు. ములుగు జిల్లా సమ్మక్క-సారలమ్మ మండలం మేడారంలోని వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ముగింపు రోజు మహబూబాబాద్, మహబూబ్ నగర్ ఎంపీలు సీతారాం నాయక్, జితేందర్ రెడ్డి లు కుటుంబ సభ్యులతో అమ్మలను దర్షించుకొన్నారు. నిలువెత్తు బంగారం సమర్పించారు.
మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్లామని, ఆయన కూడా సానుకాలంగా స్పందించారన్నారు ఎంపీలు. వన దేవతల దయ వల్ల మళ్ళీ తాము ఎంపీలుగా గెలుస్తామని, ఇదే విషయమై తల్లులను మొక్కుకున్నామన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు నిజామాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, కరీంనగర్, ఛత్తీస్ ఘడ్, భూపాలపట్నం వంటి పలు ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా మేడారం తరలివచ్చారు భక్తులు. ముందుగా జంపన్నవాగు లో పుణ్య స్నానాలు ఆచరించి, అక్కడే భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.