జోరుగా జంపింగ్‌‌లు..కరీంనగర్ జిల్లాలో పార్టీలు మారుతున్న లీడర్లు

జోరుగా జంపింగ్‌‌లు..కరీంనగర్ జిల్లాలో పార్టీలు మారుతున్న లీడర్లు
  •     టికెట్ రాక కొందరు, టికెట్ కోసం మరికొందరు, పార్టీలో ఇమడలేక ఇంకొందరు
  •     పోటీ పడి నేతలను చేర్చుకుంటున్న పార్టీలు
  •     ఎలక్షన్ ​వరకూ ఇదే పరిస్థితి కొనసాగే చాన్స్

కరీంనగర్, వెలుగు : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారుతున్న లీడర్ల సంఖ్య పెరుగుతోంది. తాము ఇన్నేళ్లు పార్టీ కోసం కష్టపడినా టికెట్ రాలేదని కొందరు, టికెట్ కోసం మరికొందరు, ఉన్న పార్టీలో ఇమడలేక ఇంకొందరు పార్టీలు మారుతున్నారు. సాధారణ కార్యకర్త నుంచి పెద్ద లీడర్ల వరకు కండువాలు మార్చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకోవడంలో అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈక్రమంలో ఏ లీడర్ ఎప్పుడు ఏ కండువా కప్పుకుంటాడో, ఏ పార్టీలో చేరుతాడో తెలియని పరిస్థితి. దీంతో ఆయా లీడర్ల అనుచరులు సైతం అయోమయానికి గురవుతున్నారు. 

ఉన్న పార్టీలో మొండిచేయి..ఇతర పార్టీల నుంచి ఆఫర్లు

  •  మానకొండూరు మాజీ ఎమ్మెల్యే 2019 లోక్ సభ ఎన్నికల టైంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందని భావించారు. తీరా టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ ను వీడారు. కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలతో సంపద్రింపులు జరపగా.. చివరికి బీజేపీ నుంచి హామీ రావడంతో ఆ పార్టీలో చేరి టికెట్​దక్కించుకున్నారు. వలస నేతకు టికెట్ రావడంతో ఇన్నాళ్లు ఆశలు పెట్టుకున్న బీజేపీ సీనియర్ నేత గడ్డం నాగరాజు బీఆర్ఎస్ లో చేరారు. ఇదే స్థానం నుంచి పోటీ చేయాలనుకున్న తెలంగాణ ఉద్యమకారుడు దరువు ఎల్లన్న కూడా టికెట్ విషయంలో భంగపడి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇదే నియోజకవర్గంలో ఇల్లంతకుంట ఎంపీపీ ఉట్కూరి వెంకటరమణ రెడ్డి, మానకొండూర్ ఎంపీపీ ముద్దసాని సులోచన శ్రీనివాస్ రెడ్డి.. ఎమ్మెల్యే రసమయి తీరు నచ్చక బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. 
  •     హుజూరాబాద్ బీఆర్ఎస్‌‌లో ఉన్న వొడితల ప్రణవ్ బాబు గత జడ్పీటీసీ ఎన్నికల్లో సైదాపూర్ టికెట్ ఆశించారు. కానీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. తన తాత సింగాపురం రాజేశ్వర్ రావు రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు  ఎలాగైనా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌‌లో చేరడంతో ఆపార్టీ నుంచి ఆయనకు టికెట్​దక్కింది. 
  •     రామగుండంలో బీఆర్ఎస్ జడ్పీటీసీ కందుల సంధ్యారాణి బీజేపీలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. కొన్ని రోజుల కింద ఇదే నియోజకవర్గం నుంచి టికెట్​ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.
  •  పెద్దపల్లికి చెందిన బీఆర్ఎస్ నేత నల్లా మనోహర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇదే నియోజకవర్గంలోని ఓదెల జడ్పీటీసీ గంటా రాములు యాదవ్ టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్‌‌కు రిజైన్ చేశారు. ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు పార్టీలో ప్రాధాన్యం లేదని బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నేత సి.సత్యనారాయణరెడ్డి ఆ పార్టీ విధానాలు నచ్చక బీఆర్ఎస్ లో చేరారు. సుల్తానాబాద్ ప్యాక్స్​ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సుల్తానాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బిరుదు మమత బీఆర్ఎస్‌‌ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఎలిగేడు సర్పంచ్ బూర్ల సింధూజ, దూళికట్ట సర్పంచ్ కావేరి, కూనారం సర్పంచ్ విజయమొగిలి, దూళికట్ట పీఏసీఎస్ చైర్మన్  బీఆర్ఎస్‌‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. 
  •     మంథని టికెట్​ఆశించి భంగపడిన కాటారం ప్యాక్స్​చైర్మన్, బీఆర్ఎస్ నేత చల్లా నారాయణరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం బీజేపీలో చేరారు.  
  •     కోరుట్లలో బీజేపీ లీడర్ నిశాంత్ కార్తికేయ ఆ పార్టీని వీడి బీఎస్పీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. ఇదే నియోజకవర్గంలో మాజీ జడ్పీటీసీ ఆకుల లింగారెడ్డి బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. డాక్టర్ రఘు కూడా బీజేపీలో టికెట్ రాలేదని అలిగి బీఆర్ఎస్ లోకి వెళ్లి... తిరిగి మళ్లీ బీజేపీలోకి వచ్చారు. 
  •  సిరిసిల్ల బీజేపీ టికెట్ ఇవ్వలేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమాకాంతారావు బీఆర్ఎస్ లో చేరారు.

కరీంనగర్​లోనూ గోడ దూకారు..

కరీంనగర్​  నియోజకవర్గంలో కొన్నాళ్లుగా ఏ పార్టీలో లేకుండా స్వచ్ఛంద కార్యక్రమాలకే పరిమితమైన మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి కొద్దిరోజుల కింద కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు టికెట్ విషయంలో స్పష్టమైన హామీ లభించకపోవడంతో, తన రాజకీయ గురువు నాగం జనార్దన్‌‌రెడ్డితో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఆదివారం సంప్రదింపులు జరిపారు. ఆయన త్వరలోనే బీఆర్ఎస్ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు బీఆర్ఎస్‌‌లో ఉన్న మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ నెలన్నర కింద ఆ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్​గూటికి చేరారు. అంతకుముందే బొమ్మకల్ సర్పంచి పురుమల్ల శ్రీనివాస్ కూడా బీఆర్ఎస్‌‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.

బీఆర్ఎస్ కరీంనగర్ రూరల్ జడ్పీటీసీగా ఉన్న ఆయన భార్య పురమల్ల లలిత కూడా అధికార పార్టీకి రాజీనామా చేశారు. సంతోష్​ కుమార్, పురుమల్ల శ్రీనివాస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. కాగా కాంగ్రెస్ టికెట్ కన్ఫామైతే కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లోకి చాలా మంది జంప్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. అలాగే బీజేపీ సోషల్ మీడియాలో, బీజేవైఎం, హిందూవాహిని లాంటి సంస్థల్లో యాక్టివ్ గా ఉండే వందలాది మంది కార్యకర్తలు ఇటీవల మంత్రి గంగుల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

ALSO READ : డోర్నకల్‌‌పై వీడని సస్పెన్స్‌‌ .. రామచంద్రునాయక్‌‌, నెహ్రూ నాయక్‌‌ మధ్య పోటాపోటీ