నడిపెల్లి వర్సెస్ పూస్కూరి.. మంచిర్యాల బీఆర్ఎస్​లో ముదిరిన టికెట్ ఫైట్​

నడిపెల్లి వర్సెస్ పూస్కూరి.. మంచిర్యాల బీఆర్ఎస్​లో ముదిరిన టికెట్ ఫైట్​
  • ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా దివాకర్ రావు 
  • నియోజక వర్గ అభివృద్ధిలో ఫెయిల్​ అయ్యారనే టాక్​ 
  • ఈ సారి కొత్త లీడర్ వైపు     ప్రజలు, క్యాడర్​ చూపు  
  • ఆ దిశగానే పావులు కదుపుతున్న పార్టీ అధిష్టానం
  • టికెట్​ రేసులో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​

ఆదిలాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల టైమ్​దగ్గరపడుతున్న కొద్దీ మంచిర్యాల నియోజకవర్గ బీఆర్ఎస్​లో సమీకరణాలు స్పీడ్​గా మారుతున్నాయి. కొత్త పేర్లు తెరపైకి రావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు తన సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని బుగులుపడుతున్నారు.  ఎలాగైనా టికెట్​రెన్యూవల్​చేసుకోవాలని, అది సాధ్యం కాకపోతే తన కొడుకు విజిత్​రావును బరిలోకి దించాలనే ప్లాన్​తో ఇద్దరూ జనంలోకి వెళ్తున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్​రావు పనితీరుపై ఇటు ప్రజలు, అటు క్యాడర్​ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ సర్వేల్లో తేలిందని చెప్తున్నారు. దీంతో ఈసారి ఆయనను పక్కకు పెట్టాలని అధిష్టానం భావిస్తున్నట్టు సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.  

 నాలుగు సార్లు గెలిచినా చేసిందేమీ లేదు.... 

 ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గ అభివృద్ధికి పెద్దగా చేసిందేమీ లేదన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. కేవలం కమీషన్ల కోసమే ఇష్టారీతిన పనులు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. మంచిర్యాల, నస్పూర్, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే అనుచరులు, అధికార పార్టీ లీడర్ల భూకబ్జాలు, ల్యాండ్​ సెటిల్​మెంట్లు, అవినీతి దందాల వెనుక ఆయన కొడుకు విజిత్​రావు పాత్ర ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్​అధికారుల ట్రాన్స్​ఫర్లలో ముడుపుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇరవై ఏండ్ల సుదీర్ఘ కాలంలో పార్టీ ప్రతిష్టను గానీ, వ్యక్తిగత ఇమేజ్​ను గానీ బిల్డప్​చేసే పర్ఫార్మన్స్​ ప్రదర్శించకపోవడం నడిపెల్లి రాజకీయ భవిష్యత్తుకు ప్రశ్నార్థకంగా మారిందని సొంత పార్టీలోనే చర్చించుకుంటున్నారు. క్షేత్రస్థాయి వాస్తవం అధిష్టానం దృష్టికి చేరడం, ఈసారి పక్కకు పెట్టబోతున్నట్టుగా వార్తలు రావడంతో కలవరపడుతున్నారు.ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఆయన కొడుకు విజిత్​రావును బరిలోకి దింపే దిశగా సైతం పావులు కదుపుతున్నారని సన్నిహితులు పేర్కొంటున్నారు. విజిత్​రావు అనుచరులు చేస్తున్న అక్రమాలు పార్టీకి తలనొప్పులుగా మారాయని అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్టు చెప్తున్నారు. క్లీన్​ ఇమేజ్​ఉన్న క్యాండిడేట్​కోసం వెతుకుతున్నట్టు గులాబీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సన్మానం తిరస్కరించిన కేసీఆర్...

ఈనెల 9న మంచిర్యాలలో జరిగిన ప్రగతి నివేదన సభలో ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సీఎం కేసీఆర్ సన్మానించబోగా ఆయన తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. మీటింగ్ ముగిసిన తర్వాత ఎమ్మెల్యే దివాకర్... కేసీఆర్ ను బొకే ఇచ్చి శాలువాతో సత్కరించబోయారు. కేసీఆర్ దానిని తిరస్కరిస్తూ చేయితో నెట్టివేస్తూ వేదిక దిగి వెళ్లిపోయారు. మీటింగ్ ప్రారంభంలో వేదికపై ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధుల పేర్లను ప్రస్తావించిన కేసీఆర్ మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య పేర్లను ప్రస్తావించలేదు. దీంతో అభ్యర్థుల మార్పు ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. 

తెరపైకి సీనియర్లు.... 

బీఆర్​ఎస్​అధిష్టానం సిట్టింగ్​ఎమ్మెల్యేకు టికెట్​రెన్యూవల్​ విషయంలో సుముఖంగా లేదన్న వార్తల నేపథ్యంలో పలువురు సీనియర్​ లీడర్లు తెరపైకి వచ్చారు. గెలుపు గుర్రాల అన్వేషణలో బీఆర్‌‌ఎస్‌‌ అధిష్టానం ఫిల్మ్​ డెవలప్​మెంట్​మాజీ చైర్మన్​ పూస్కూర్​ రామ్మోహన్​రావు పేరును నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఆయన అనుచరులు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. రామ్మోహన్​రావు టీఆర్‌‌ఎస్ క్షేత్రస్థాయి నిర్మాణం దగ్గరి నుంచి కేసీఆర్​కు సన్నిహితంగా ఉన్నారని, అక్రమాలకు అతీతమైన వ్యక్తిగా, విద్యాధికుడిగా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో విజన్‌‌ ఉన్న వ్యక్తిగా అధిష్టానం ఆయన పేరును దాదాపుగా ఖరారు చేసిందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న సీఎం కేసీఆర్​జిల్లా పర్యటన సందర్భంగా రామ్మోహన్​రావు స్వాగత పోస్టర్లను నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జీర్ణించుకోలేని దివాకర్​రావు తన అనుచరులతో వాటిని చింపి వేయించారని ఆరోపిస్తున్నారు.

 పోస్టర్లపై సాక్షాత్తు కేసీఆర్​తో పాటు ప్రభుత్వంలో కీలకమైన లీడర్ల ఫొటోలు, ఆఖరికి దివాకర్​రావు ఫొటో సైతం ఉన్నప్పటికీ చింపించే పనిలో పడ్డారంటే రామ్మోహన్​రావుపై ఎంతటి అక్కసు పెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. పార్టీ లీడర్లు, కార్యకర్తలు రామ్మోహన్​రావును కలవరాదని, ఆయన ఇంటికి ఎందుకు వెళ్తున్నారని వార్నింగులు పంపుతున్నారని చెప్తున్నారు. దివాకర్​రావు వెంట తిరుగుతున్న చాలామంది లీడర్లు ఇప్పటికే రామ్మోహన్​రావుతో టచ్ ఉంటున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్​సైతం టికెట్​ రేసులో ఉన్నట్టు అధిష్టానానికి సంకేతాలు పంపారు. ఆయన కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ పాత క్యాడర్​ను కూడగడుతున్నారు. ఈ పరిణామాలను బీఆర్​ఎస్ అధిష్టానం ఎప్పటికప్పుడు క్లీన్​గా అబ్జర్వ్​చేస్తున్నట్టు సమాచారం.