ఎన్నికల లబ్ధికోసం లీడర్ల ఫౌండేషన్లు

ఎన్నికల లబ్ధికోసం లీడర్ల  ఫౌండేషన్లు

 

  •     తాతలు, తల్లిదండ్రుల, సోదరుల పేర్లపై ట్రస్టుల ఏర్పాటు
  •     యువకుల కోసం ఆటల  పోటీలు, ఫ్రీ ట్రైనింగ్​ క్యాంప్​లు  
  •     మహిళలకు ముగ్గుల పోటీలు, సంస్థలకు విరాళాలు, 
  •     వ్యక్తులకు ఆర్థిక సాయాలు, శుభకార్యాలు, చావులకు హాజరు  
  •     వచ్చే ఎలక్షన్లకు గ్రౌండ్​, ప్రిపేర్ ​చేసుకుంటున్న లీడర్లు 

 

నల్గొండ, వెలుగు: వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాజకీయ పార్టీల లీడర్లు ఇప్పటి నుంచే జనాల్లోకి వెళ్లేందుకు కొత్త దారులు వేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్నవారితో పాటు పోటీకి సిద్ధపడుతున్న నేతలంతా ఊళ్లల్లో తెగ తిరుగుతున్నారు. తమ పేరు నలుగురి నోళ్లలో నానేందుకు, జనానికి మరింత దగ్గరయ్యేందుకు ఏదో పేర ట్రస్టులు, ఫౌండేషన్లు ఏర్పాటు చేసి.. సేవాకార్యక్రమాలతో పాటు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. గతంలో కార్యక్రమాలకు గెస్టులుగా వెళ్లిన వారే ఇప్పుడు హోస్టులుగా మారుతున్నారు. తాము ఏర్పాటు చేసుకున్న సంస్థల పేర ప్రోగ్రామ్స్​ చేసి..వాటిని సోషల్​మీడియాలో వైరల్​చేస్తున్నారు. ఈ స్ట్రాటజీతో ఓటర్లను ఆకట్టుకోవడం ఈజీ అవుతుందని భావిస్తున్నారు. ఇందులో ఇప్పటికే  బీఆర్ఎస్ ​లీడర్లు దూసుకుపోతుండగా, మిగతా పార్టీల ఆశావహులు ఇప్పుడిప్పుడే  ఆ వైపు అడుగులు వేస్తున్నారు.      

టార్గెట్ యూత్... ​  

వచ్చే ఎన్నికల్లో యువ ఓటర్లే కీలకమవుతారని భావించిన లీడర్లు వారి మీదే కన్నేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం లాంటి అంశాలు యువతపై ప్రభావం చూపవని భావిస్తున్న బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు వారి పైనే  ఫోకస్ ​పెడుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ప్రైవేట్ ​కోచింగ్ ​సెంటర్ల ద్వారా ఫ్రీ కోచింగ్​ ఇప్పిస్తున్నారు. ఇటీవల పోలీస్​ఈవెంట్స్ కు హాజరైన కొందరు అభ్యర్థులకు ఉచితంగా పౌష్టికాహారం పంపిణీ చేయగా..మరికొందరు లీడర్లు సంక్రాంతి సందర్భంగా ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇంకొందరు మెగా హెల్త్​ క్యాంపులు నిర్వహించారు. అలాగే ఎప్పుడో కాని గ్రామాలకు వెళ్లని ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల లీడర్లు ఇప్పుడు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు అటెండ్ ​అవుతున్నారు. చనిపోయిన వారి కుటుంబసభ్యులను, రోగులను ఇండ్లకు వెళ్లి మరీ పరామర్శిస్తున్నారు. పేదలకు ఆర్థికసాయం చేస్తున్నారు. అడిగిన సంస్థలకు విరాళాలు ఇస్తున్నారు. పేద విద్యార్థులకు  ఉచితంగా చదువు చెప్పిస్తామని భరోసా ఇస్తున్నారు.

వివిధ జిల్లాల్లో ఇలా...

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి జగదీశ్​రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్​ చాలాకాలంగా తమ తల్లుల పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేంద ర్​రెడ్డి కొడుకు అమిత్​ రెడ్డి తన తాత గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ​ట్రస్ట్​ పేరున, నకిరేకల్​లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చిరుమర్తి చేయూత ఫౌండేషన్​ పేరుతో, ఆలేరులో ప్రభుత్వ విప్​​ గొంగడి సునీత తన భర్త మహేందర్​ రెడ్డి యువసేన పేరుతో, హుజూర్​నగర్​, మిర్యాలగూడ, నాగార్జునసాగర్​, నల్గొండ ఎమ్మె ల్యేలు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.  

ఆదిలాబాద్ లో బీజేపీ టికెట్​ఆశిస్తున్న ఎన్ఆర్​ఐ కంది శ్రీనివాస్​రెడ్డి  కేఎస్సార్ ట్రస్టు పేరుతో సేవా  కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ గిరిజన మోర్చా నేత సాకటి దశరథ్ కూడా బోథ్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాదవ్ బలరాం బోథ్ నియోజకవర్గంలో వ్యక్తిగత సాయం చేస్తున్నారు. రోజూ ఏదో ఒక గ్రామంలో పర్యటిస్తున్నారు.  

మంచిర్యాలకు చెందిన దుర్గం అశోక్ అనే రియల్టర్​ ప్రధాన పార్టీల నుంచి చెన్నూరు టికెట్​ఆశిస్తున్నారు. నేతకాని సామాజిక వర్గానికి చెందిన ఈయన ‘దుర్గం అశోక్ యువసేన’ పేరుతో చెన్నూర్​ నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల నుంచి బీజేపీ టికెట్​ఆశిస్తున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​వు వెరబెల్లి ట్రస్ట్ ద్వారా సేవాభారతి, ఏకలవ్య ఇతర సంస్థలతో కలిసి  నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ టికెట్​ను తన కొడుకుకు ఇప్పించుకోవాలనే ఆలోచనలో ఉన్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు నడిపెల్లి ట్రస్ట్ పేరిట సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. తన కొడుకు విజిత్​రావు చైర్మన్​గా ఉన్న ఈ ట్రస్ట్​ ద్వారా యూత్​ను ఆకట్టుకునేందుకు  క్రికెట్, కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. పేద విద్యార్థులకు, మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తున్నారు. 

ఆసిఫాబాద్​ జిల్లాలోని సిర్పూర్ (టి) నుంచి బీజేపీ టికెట్ఆశిస్తున్న  పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ..కొత్తపల్లి వెంకటలక్ష్మి, నర్సయ్య ఫౌండేషన్​ ద్వారా, బీజేపీ నాయకుడు పాల్వాయి హరీశ్​బాబు  ప్రజా బంధు  ఫౌండేషన్  ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయా ట్రస్ట్​ల ద్వారా ఆపదలో ఉన్నవాళ్లకు ఆర్థిక సాయంతో పాటు యూత్​ను ఆకట్టుకునేందుకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. 

ఖమ్మం జిల్లా పాలేరులో రూలింగ్ ​పార్టీ టికెట్​ కోసం ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నడుమ తీవ్ర పోటీ నడుస్తోంది. దీంతో ప్రజల్లో ఆదరణ పెంచుకునేందుకు కందాల విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.  ఆయన తన తల్లిదండ్రుల స్మారకంగా కందాల ఫౌండేషన్  ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గతేడాది పోలీస్ రిక్రూట్​మెంట్​సందర్భంగా క్యాండిడేట్లకు  ఫ్రీ కోచింగ్ క్యాంప్ నిర్వహించారు. నియోజకవర్గంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు 

రూ.10వేల చొప్పున సాయం చేస్తున్నారు.

 భద్రాద్రి  జిల్లా కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్​ టికెట్​ఆశిస్తున్న రాష్ట్ర హెల్త్  డైరెక్టర్ గడల శ్రీనివాసరావు  ఏడాది కిందే డాక్టర్ జీఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఫ్రీ హెల్త్​ క్యాంపులు, ఉచిత, నామమాత్రపు ఫీజులపై ఆపరేషన్లు, ట్రీట్​మెంట్ ​ఇప్పిస్తున్నారు. బతుకమ్మ, సంక్రాంతికి మహిళలకు పొటీలు నిర్వహిస్తున్నారు. జాబ్ మేళాల పేరుతో యూత్​ను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భద్రాచలంలో సీపీఎం నేత బండారు చందర్రావు కూడా ట్రస్ట్ ద్వారా  పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తన సోదరుడు రేగా విష్ణు ట్రస్ట్ పేరుతో, ఇల్లెందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ, ఆమె భర్త, మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరిసింగ్ హరిప్రియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు.