ఓ వైపు జెండా ఆవిష్కరణ.. మరో వైపు లీడర్ల వాగ్వాదం

ఓ వైపు జెండా ఆవిష్కరణ.. మరో వైపు లీడర్ల వాగ్వాదం

వికారాబాద్ దోమ ఎంపీడీఓ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు బయటపడింది. జెండా ఆవిష్కరించేందుకు సిద్దమైన ఎంపీపీ అనసూయను వైస్ ఎంపీపీ మల్లేశం అడ్డుకున్నారు. ఎంపీడీవో జెండా ఆవిష్కరించాలి... మీరెందుకు జెండా ఆవిష్కరిస్తారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎంపీపీ కుమారుడు రాఘవేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశం మధ్య వాగ్వాదం జరిగింది. ఓ వైపు ఎంపీడీఓ జెండా ఆవిష్కరిస్తుండగా.. మరోవైపు ఇద్దరు నాయకులు తిట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నేతల తీరుతో జాతీయ జెండా ఆవిష్కరణకు తీవ్ర అవమానం జరిగిందని స్థానికులు అంటున్నారు.

ఇద్దరూ ఒకే పార్టీ నేతలైనప్పటికీ.... గత కొన్ని రోజులుగా ఎంపీపీ అనసూయ ఎమ్మెల్యే మహేష్ రెడ్డితో దూరం పాటిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ ఛైర్మన్ మనోహర్ వెంట ఉంటూ బీఆర్ఎస్ లో మరో గ్రూపుగా కొనసాగుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరి వర్గ పోరుకు గణతంత్ర వేడుకలు వేదికగా మారాయి.