
అలంపూర్, వెలుగు : గద్వాల జిల్లా అలంపూర్ ఎంపీపీ ఎన్నిక రసాభాసగా మారింది. టీఆర్‌ఎస్ ఆరింటికి ఆరు ఎంపీటీసీలు నెగ్గినా ఎంపీపీ ఎన్నిక గొడవకు దారితీసింది. కోరంలేక శుక్రవారం జరగాల్సిన ఎంపీపీ ఎన్నిక శనివారం నిర్వహించారు. అధికారుల చెప్పిన సమయానికి మాజీ ఎంపీపీ, ప్రస్తుత జడ్పీటీసీ శంషద్ బేగం భర్త ఇస్మాయిల్నలుగురు ఎంపీటీసీలతో మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. ఆయన వెంట ఎంపీటీసీతోపాటు మరో ఐదుగురు మహిళలు బురఖా వేసుకొని రావడంతో ఎన్నికల అధికారులు అభ్యంతరం చెప్పి లోపలికి అనుమతించలేదు. ఈ విషయమై ఎమ్మెల్యే వర్గీయులు, ఇస్మాయిల్‌కు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇస్మాయిల్‌పై ఎమ్మెల్యే వర్గీయులు పిడిగుద్దులు కురిపించారు. దాడిలో ఇస్మాయిల్ చొక్కా చిరిగింది. క్యాతుర్ ఎంపీటీసీ అనురాధ చేతికి గాయమైంది. దీంతో పోలీసులు కలుగజేసుకుని ఇరు వర్గాలను సముదాయించారు.
ఎమ్మెల్యే చెప్పిన వారికి కాకుండా..
అంతవరకు ఎంపిక హాల్‌లోనే ఉన్న ఎమ్మెల్యే అబ్రహం బయటకొచ్చి ఇస్మాయిల్ వెంట వచ్చిన ఎంపీటీసీలతో మాట్లాడారు. విప్ జారీ చేస్తున్నట్టు ప్రకటించి, బుక్కాపురం ఎంపీటీసీ రూపాదేవికి చేతులెత్తాలని సూచించారు. సరేనని తలూపిన ఎంపీటీసీలు లోపల మాత్రం ఇస్మాయిల్ సూచించిన కాశీపురం ఎంపీటీసీ పింజరి బేగంకు చేతులెత్తారు. దీంతో ఆమె ఎంపీపీగా ఎన్నికయ్యారు.