ప్రతిపక్ష నేతలకు సోనియా డిన్నర్..24 పార్టీలకు ఖర్గే ఆహ్వానం

ప్రతిపక్ష నేతలకు సోనియా డిన్నర్..24 పార్టీలకు ఖర్గే ఆహ్వానం

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి. దీనిపై చర్చించేందుకు ఇప్పటికే బీహార్ లోని పాట్నాలో మొదటి మీటింగ్ నిర్వహించగా, ఇప్పుడు రెండో మీటింగ్ కు సిద్ధమయ్యాయి. ఈసారి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో బెంగళూర్ లో ప్రతిపక్షాల సమావేశం జరగనుంది. ఈ మీటింగ్​కు రావాలని 24 పార్టీలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆహ్వానం పంపారు. ‘‘మన మొదటి మీటింగ్ విజయవంతమైంది. అందులో దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై చర్చించాం. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఈ చర్చలను కొనసాగించాల్సిన అవసరం ఉంది” అని ఆయన ఆయా పార్టీలకు రాసిన లెటర్ లో పేర్కొన్నారు. ఈ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కూడా హాజరుకానున్నారు. 17న రాత్రి ప్రతిపక్ష నేతలకు ఆమె డిన్నర్ ఇవ్వనున్నారని తెలిసింది. ఉమ్మడి కూటమికి పేరు ఖరారు చేయడంతో పాటు కోఆర్డినేటర్​ను కూడా ఎన్నుకునే అవకాశం ఉందని తెలిపాయి. కాగా, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఫస్ట్ మీటింగ్ కు 15 పార్టీలు హాజరుకాగా, ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి హాజరుకాలేదు. ఇక ఈసారి కొత్తగా 8 పార్టీలకు ఆహ్వానం పంపించారు.

ఆప్ హాజరైతదా?

బెంగళూర్ లో జరగనున్న మీటింగ్ కు హాజరుకావాలని ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. అయితే ఆప్ హాజరవుతుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. పాట్నా  మీటింగ్​లో గొడవ నేపథ్యంలో ఆప్ చీఫ్​ అర్వింద్​ కేజ్రీవాల్ హాజరవడంపై సందేహం నెలకొంది.