
రాష్ర్టంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కొనసాగేలా చూసేందుకు రైతు ఐక్యవేదిక ఏర్పాటు కావాలని జాతీయ రైతు సంఘాల నాయకులు తీర్మానించారు. ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జాతీయ రైతు సంఘాల నాయకుల సమావేశమయ్యారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలపై ఈ సమావేశంలో వారంతా సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చించారు. గిట్టుబాటు ధరలను కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను రైతు సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు.
దేశ రైతాంగాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై సమావేశంలో చర్చించారు. దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. వారితో కలిసి భోజనం కూడా చేశారు. ఇటీవలి కిసాన్ ఆందోళనలో పాల్గొన్న పలువురు సీనియర్ రైతు సంఘాల నేతలు తమ అభిప్రాయాలను సమావేశంలో వెల్లడించారు. దేశంలో అసంఘటితంగా ఉన్న రైతాంగం మొత్తం సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు. తెలంగాణలో వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, రైతు వేదికలు, వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ప్రభుత్వ పథకాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ను రైతు సంఘాల నేతలు అడిగి తెలుసుకున్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దేశంలో అనేక వర్గాలు తమ ఆకాంక్షలను, హక్కులను నెరవేర్చుకునేందుకు ఇంకా పోరాటాలు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తోందో ఆలోచించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. రైతు సమస్యలకు ఇంకా ఎందుకు పరిష్కారం దొరకడం లేదో చర్చించుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. అమెరికా, చైనా వంటి మిగతా ఏ దేశాలతో పోల్చి చూసినా నీటి వనరులు, వ్యవసాయ యోగ్యమైన భూమి, మానవ వనరులు భారతదేశంలోనే పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. దేశంలో నీరు సమృద్ధిగా ఉన్నా.. ఇప్పటికీ సాగు, తాగునీటికి దేశ ప్రజలు ఎదురు చూడాల్సి ఎందుకు వస్తుంది అని ప్రశ్నించారు. దేశ వనరులను సరిగా వినియోగించుకుంటూ.. దేశ సౌభాగ్యాన్ని గుణాత్మకంగా అభివృద్ధి పరిచే రైతు వ్యవసాయ సంక్షేమ దిశగా సాగే సుపరిపాలన కోసం అందరం అడుగులు వేయాల్సి ఉందన్నారు.
• దేశంలో తెలంగాణ మోడల్ వ్యవసాయ విధానాలు అవలంభించాలని సమావేశంలో పాల్గొన్న రైతు సంఘాల నేతలు కోరారు.
• జై జవాన్, జై కిసాన్ నినాదాన్ని నిజం చేయాలని, రక్షణ, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వ మద్దతు లేకుంటే ఆ దేశం, ఆ రాష్ట్రం వెనుకబడుతుందని రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు.
• పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలు వారి రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలు, వ్యవసాయం, రైతుల పరిస్థితుల గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు.