కౌంటింగ్ తేదీ మార్చండి : చర్చిల లీడర్లు

కౌంటింగ్ తేదీ మార్చండి : చర్చిల లీడర్లు
  • ఈసీకి మిజోరం చర్చి కమిటీల విజ్ఞప్తి

ఐజ్వాల్: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని మార్చాలని మిజోరంలోని పలు చర్చిల లీడర్లు ఎలక్షన్ కమిషన్ అధికారులను కోరుతున్నారు. డిసెంబర్ 3 ఆదివారం కావడంతో ప్రేయర్​కు ఇబ్బంది అవుతుందని అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) అధికారులను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లినా అపాయింట్​మెంట్ దొరకలేదని ఎన్జీవో కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు వివరించారు. అధికారులు తమకు అనుకూలంగా వ్యవహరించేలా ఆదివారం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు. 

ఇప్పటి వరకు ఈసీఐ నుంచి ఎలాంటి హామీ రాలేదన్నారు. అధికారులను కలిసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఎన్జీవో కో ఆర్డినేషన్ కమిటీ శుక్రవారం ఢిల్లీకి వెళ్లింది. అయితే, అపాయింట్​మెంట్ దొరకలేదు. మంగళవారం (28వ తేదీ) మధ్యాహ్నం 3 గంటలకు అపాయింట్​మెంట్ ఇచ్చారని కమిటీ జనరల్ సెక్రటరీ మల్​సామ్లియానా తెలిపారు. కౌంటింగ్ తేదీ మార్చేలా అధికారులను కోరుతామని వివరించారు. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం వారి డిమాండ్లను అంగీకరించడం లేదు. పోలింగ్‌ తేదీ లాగా కౌంటింగ్‌ తేదీ ప్రభావం సాధారణ ప్రజలపై ఉండదని, ఆ రోజు వారు నచ్చినట్లుగా అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొన వచ్చని ఎలక్షన్‌ కమిషన్‌ స్పష్టం చేస్తున్నది.