బతుకమ్మకు చీరలు.. దసరాకు లిక్కర్

బతుకమ్మకు చీరలు.. దసరాకు లిక్కర్
  • బల్క్​గా కొని పెట్టుకుంటున్న నేతలు  
  • ఎన్నికల కోడ్ వచ్చేలోగా చీరల పంపిణీకి ఏర్పాట్లు 
  • దసరాకు ఒకట్రెండు రోజుల ముందు మద్యం పంపిణీకి ప్లాన్

హైదరాబాద్, వెలుగు: బతుకమ్మ, దసరా పండుగలు వస్తుండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు, ఆశావహులు రంగంలోకి దిగారు. ఓవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ పరంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుండగా.. మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష పార్టీల లీడర్లు ఇతర రాష్ట్రాల నుంచి చీరలు తెప్పించి పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో చీరలు దిగుమతి అవుతున్నాయి. బతుకమ్మ, దసరాకు ప్రతిఏటా రావాల్సిన స్టాక్​కంటే ఎక్కువ వస్తోంది. గుజరాత్, పశ్చిమ​బెంగాల్, అస్సాం, తమిళనాడు, ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో చీరలు తెప్పిస్తున్నారు. వీటిలో కొన్నింటికి బిల్లులు ఉండడం లేదు. ఇప్పటికే రూ.20 లక్షల విలువైన చీరలను అధికారులు సీజ్​చేశారు. మహిళా ఓటర్ల కోసం చీరలు పంచుతున్న లీడర్లు.. మగ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు లిక్కర్ పంపిణీపై దృష్టి పెట్టారు. దసరాకు తమవైపు నుంచి చిన్న కానుక అంటూ వివిధ బ్రాండ్ల హాఫ్​బాటిళ్లను పంపిణీ చేసేందుకు రెడీగా పెట్టుకున్నారు. 

55 లక్షల చీరలు.. 

కాంగ్రెస్ నుంచి పోటీలోకి దిగాలని భావిస్తున్న కొంతమంది లీడర్లు, బీజేపీ లీడర్లు మరికొందరు, ఇండిపెండెంట్​గానైనా సరే పోటీ చేయాలని భావిస్తున్న ఇంకొందరు.. ఇతర రాష్ట్రాల నుంచి చీరలను కొనుగోలు చేసి తెప్పించుకుంటున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లీడర్లు తెప్పించుకున్న చీరలు 55 లక్షలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. పట్టు, సిల్క్ ఇతర చీరలను కొనుగోలు చేసి నియోజకవర్గాల్లోకి డంప్​చేసుకున్నారు. తమకు తెలిసిన బట్టల షాప్ ఓనర్ల గోదాముల్లోనే వీటిని దాచినట్లు తెలుస్తోంది. అధికారులు సీజ్​ చేయడానికి వీల్లేకుండా ఈ పద్ధతిని ఎంచుకున్నట్లు సమాచారం. ఎన్నికల కోడ్​అమల్లోకి వచ్చే కంటే ముందే గ్రామాల్లో పంపిణీ చేయాలని ఆయా లీడర్లు చూస్తున్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, మెదక్​జిల్లాల్లో కొంతమేర ఇప్పటికే చీరలను మహిళలకు పంచిపెట్టారు.  

ALSO READ  :- ఆ మూడు సీట్లపై టెన్షన్ .. బీఆర్ఎస్​పై అసంతృప్తి ఎమ్మెల్యేల తిరుగుబాటు 

క్వార్టర్, హాఫ్ బాటిళ్లు సిద్ధం.. 

క్యాడర్​తో పాటు ఓటర్లకు దసరా పండుగకు లిక్కర్ పంచేందుకు అన్ని పార్టీల లీడర్లు రెడీ అయ్యారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి పెట్టుకున్న క్వార్టర్, హాఫ్ బాటిళ్లను గ్రామాల్లో పంచేలా ప్లాన్​చేసుకున్నారు. రాష్ట్రంలో దసరాకు పెద్ద మొత్తంలో లిక్కర్ వినియోగం ఉంటుంది. అయితే దసరా లోపు ఎలక్షన్​షెడ్యూల్​వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో ఎక్కువ మొత్తంలో లిక్కర్​కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. లీడర్లు దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే వైన్స్​ల నుంచి రోజూ కొంత మొత్తంలో తీసుకుని పెట్టుకుంటున్నారు. దసరాకు ఒకట్రెండు రోజుల ముందు, దసరా నాడు తమ కార్యకర్తలతో లిక్కర్​ బాటిళ్లు పంపిణీ చేయాలని చూస్తున్నారు. గత వారం రోజుల్లోనే రూ.550 కోట్ల విలువైన లిక్కర్, బీర్లు మద్యం డిపోల నుంచి వైన్స్​లకు చేరాయి. ఈ నెల 3న రూ.109 కోట్లు, 4న రూ.180 కోట్ల మద్యం లిఫ్ట్ అయింది. 5,6,7 తేదీల్లోనూ రూ.వంద కోట్ల చొప్పున మద్యం సేల్​అయింది.