మున్సిపల్ ఆస్తులపై లీడర్ల పెత్తనం!

మున్సిపల్ ఆస్తులపై లీడర్ల పెత్తనం!
  •  సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల్లో షాపింగ్ కాంప్లెక్స్ అక్రమ లీజులు

సంగారెడ్డి/సదాశివపేట, వెలుగు : సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, సంగారెడ్డి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్​లపై కొందరు లీడర్లు పెత్తనం చెలాయిస్తున్నారు. 20 ఏండ్ల కింద వారు అద్దె రూపంలో తీసుకున్న షాపింగ్ కాంప్లెక్స్ ను ఇప్పటికీ వదలడం లేదు. నామమాత్రంగా మున్సిపాలిటీకి అద్దెలు కడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు కిరాయికి ఇస్తూ వారి దగ్గర లక్షల్లో అడ్వాన్సులు, వేలల్లో అద్దెలు వసూళ్లు చేస్తున్నారు. బినామీల పేర్లతో నడుస్తున్న ఈ అక్రమ వ్యాపారాలపై మున్సిపల్ అధికారులు, పాలకవర్గాలు నోరెత్తకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ wతతంగాన్ని అధికార పార్టీకి చెందిన కొందరుయ ఇంతకాలం  నడిపించారు. ఇప్పుడు పాత షాపులతో పాటు కొత్తగా నిర్మించిన కాంప్లెక్స్​ల్లో అద్దెల కోసం డిమాండ్ పెరగడంతో అక్రమ లీజులు ఒక్కొక్కటి గా బయటపడుతున్నాయి. 

సదాశివపేటలో...

పట్టణంలోని ప్రధాన కూడళ్లలో మున్సిపాలిటీకి సంబంధించిన16 షాపులు ఉన్నాయి. చిరువ్యాపారుల కోసం నిర్మించిన షాపులను టెండర్ల ద్వారా లీజుకు ఇచ్చింది. కానీ మున్సిపల్​ ఆదాయం కోసం జారీ చేసిన జీవో 535‌‌‌‌‌‌‌‌, జీవో 56 ప్రకారం ఆఫీసర్లు వాటిని అమలు చేయడంలేదు. ఆ 16 షాపులకు గడువు దాటి 20 ఏండ్లు అయినా కొత్తగా వేలం నిర్వహించలేదు. బస్టాండ్​ ముందు ఉన్న మున్సిపల్​కాంప్లెక్స్ ఏన్నో ఏండ్లుగా అధికార పార్టీకి చెందిన ఓ నేత ముఖ్య అనుచరుడి గుప్పిట్లో ఉండిపోయింది. అతడు వేలంలో రూ.30 వేల అడ్వాన్స్​, నెలకు రూ.8 వేల నుంచి రూ.12వేలకు పాట పాడిన తర్వాత మరొకరికి ఇచ్చాడు. వారి దగ్గర నుంచి  రూ. 2లక్షల నుంచి రూ.8 లక్షల అడ్వాన్స్ తీసుకొని, నెలకు  రూ.20 వేల అద్దె వసూలు చేస్తున్నట్టు తెలిసింది.  అలాగే టౌన్ లోని 65వ నేషనల్ హైవేపై 8 షాపులు, గాంధీచౌక్​ వద్ద 6 దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ఒక్కో షాపుకు రూ.2 వేల నుంచి రూ.4వేల వరకు మాత్రమే మున్సిపాలిటీకి చెల్లిస్తున్నారు. కానీ లీజుదారులు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల అడ్వాన్స్, రూ.6 వేల నుంచి రూ.15వేల వరకు అద్దెలు వసూలు చేస్తున్నారు. 

సంగారెడ్డిలో...

సంగారెడ్డి గ్రేడ్ వన్ మున్సిపాలిటీ పాత బస్టాండ్ వద్ద ఉన్న దుకాణాల్లో కొన్నింటికి నెలకు రూ.3,800, మరి కొన్నింటికి రూ.6 వేలు,  మరో రెండు  షాపులకు రూ.8 వేల చొప్పున కిరాయిలు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి మార్కెట్ విలువ ప్రకారం ఆయా దుకాణాలకు ఒక్కోదానికి కనీసం రూ.13 వేలు అద్దె వసూలు చేయాల్సి ఉంది. 

రీ టెండర్స్ పెడ్తలె... 

మున్సిపల్ ​షాపింగ్ ​కాంప్లెక్స్​లో ఉన్న దుకాణాలకు మళ్లీ వేలం పాటలు పెట్టడంలేదు. ప్రస్తుతం ఉన్న రెంట్లపై 50 శాతం లేదా కాంట్రాక్ట్ తీసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 33 శాతం పెంచాల్సి ఉండగా ఇప్పటివరకు అలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే లీజును కూడా పునరుద్ధరించాలన్న నిబంధనలు ఉన్నాయి. ఇందుకు పాలకవర్గం తీర్మానం చేయాల్సి ఉండగా ఆ దిశగా కౌన్సిలర్లు ఆలోచించకపోవడంతో మున్సిపల్ ఆదాయానికి భారీగా నష్టం వస్తోంది. 

ఆరేండ్లుగా ఖాళీగానే...

సదాశివపేటలోని సిద్ధాపూర్ రోడ్డులో 2016లో స్ట్రీట్​ వెండర్​ల కోసం వెజిటేబుల్, నాన్​వెజిటేబుల్ ​మార్కెట్ల కోసం షాపింగ్ ​కాంప్లెక్స్​ నిర్మించారు. 14వ ఆర్థిక సంఘం ఫండ్స్​తో రూ.30 లక్షలతో షాపుల నిర్మాణం పూర్తిచేసి వాటిని ఇప్పటికీ వినియోగంలోకి తీసుకురాలేదు. దాదాపు ఆరేండ్లుగా వాటిని నిరుపయోగంగా ఉంచి ప్రధాన రోడ్డు పక్కన మటన్​, చికెన్​ టెంపరరీ షాపులను వినియోగంలోకి తెచ్చారు. రోడ్డుకు ఇరువైపులా మాంసం దుకాణాలు ఉండటంతో వాహనదారులు, నడ్చుకుంటూ వెళ్తున్నవారు ఇబ్బంది పడుతున్నారు. 

అందుబాటులోకి తెస్తాం

సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి షాపులను అందుబాటులోకి తేవడం కోసం ఉన్నతాధికారులకు నివేదికలు అందించాం. త్వరలో వాటిని అందుబాటులోకి తెస్తాం. షాపులకు సంబంధిచిన రీ వేలం పాటను కౌన్సిల్​ తీర్మానం కోసం పెట్టి వాటి ఆమోదానికి సభ్యుల సహకారం తీసుకుంటాం.  ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం షాపులకు అద్దెలు వసూలు చేసేందుకు చర్యలు చేపడుతాం. చాలా రోజులుగా వేలంపాట నిర్వహించకపోవడం వల్ల పాత వారే కొనసాగుతున్నారు. వీరిలో ఎవరైనా దుకాణాలను ఇతరులకు కిరాయికి ఇచ్చి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం.    

- క్రిష్ణారెడ్డి, మున్సిపల్​ కమిషనర్, సదాశివపేట