కొండపోచమ్మ నుంచి చేవెళ్లకు నీళ్లియ్యండి

కొండపోచమ్మ నుంచి చేవెళ్లకు నీళ్లియ్యండి
  •     ‘పాలమూరు’ పనులు ఇప్పట్లో అయ్యేలా లేవని ఆందోళన
  •     నీళ్లియ్యకపోతే రాజకీయంగా దెబ్బతింటామని ఆవేదన
  •     ప్రాణహిత ‑ చేవెళ్ల డిజైన్​లోనే కొద్ది మార్పులు చేసి నీళ్లివ్వాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌‌, వెలుగు: కొండపోచమ్మసాగర్‌‌ రిజర్వాయర్‌‌ నుంచి చేవెళ్ల ప్రాంతానికి నీళ్లివ్వాలనే డిమాండ్‌‌ తెరపైకి వచ్చింది. పాలమూరు‑– రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇచ్చేలా ప్రతిపాదించినా ఆ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం  లేదు. దీంతో చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌‌, పరిగి, వికారాబాద్‌‌, తాండూరు నియోజకవర్గాలకు చెందిన టీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. పర్మిషన్‌‌ వస్తుందో రాదో తెలియని పాలమూరు ఎత్తిపోతలపై ఆధారపడటం కన్నా, ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టులో ప్రతిపాదించిన డిజైన్‌‌లో కొద్దిపాటి మార్పులు చేసి కొండపోచమ్మ సాగర్​ నుంచి నీళ్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. 

నీళ్లు ఇవ్వలేకపోతే వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలే చాన్స్‌‌‌‌ ఉందని వారు అనుకుంటున్నారు. అభ్యర్థనపై సీఎం సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిసింది. 4 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు కొండపోచమ్మ నుంచి నీటిని ఇచ్చే ప్రపోజల్‌‌‌‌పై ప్రభుత్వం దృష్టి సారించినట్టు సమాచారం. వీలైతే వచ్చే బడ్జెట్‌‌‌‌లోనే ఈ పథకాన్ని ప్రకటించాలని, సాధ్యం కాకపోతే  రాబోయే ఆరు నెలల్లో స్కీం ప్రకటించేలా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. 

పాలమూరు ప్రాజెక్టు ఇప్పట్లో కష్టమే!

ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాణహిత -– చేవెళ్ల సుజల స్రవంతి పథకంలో చేవెళ్ల, పరిగి నియోజకవర్గాల్లో కలిపి 3.81 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రతిపాదించారు. ప్రస్తుత కొండపోచమ్మసాగర్‌‌‌‌ (పాములపర్తి) ఎగువ నుంచి చేవెళ్ల ప్రాంతానికి నీటిని తరలించేలా డిజైన్‌‌‌‌ చేశారు. 23, 24, 25 ప్యాకేజీలుగా ఈ పనులు విభజించి వర్క్‌‌‌‌ ఏజెన్సీలతో అగ్రిమెంట్‌‌‌‌ చేసుకొని 2 శాతం మొబిలైజేషన్‌‌‌‌ అడ్వాన్స్‌‌‌‌లు కూడా చెల్లించారు. శంకర్‌‌‌‌పల్లి సమీపంలో కిలోమీటర్ టన్నెల్‌‌‌‌ కూడా తవ్వారు. చేవెళ్ల చెరువును బ్యాలెన్సింగ్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌గా మార్చి పరిగి, రాయికోడ్‌‌‌‌ కాలువల ద్వారా 3.81 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రతిపాదించారు. ప్రాణహితను రద్దు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్‌‌‌‌ చేసిన తర్వాత పాత ప్రాజెక్టులోని చేవెళ్ల ప్యాకేజీలను పూర్తిగా తొలగించారు. పాలమూరు –- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టే కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌‌‌‌ నుంచి నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, పనులు మొదలై ఆరేండ్లయినా 30% పని కూడా కాలేదు. కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌‌‌‌ సహా 19 నుంచి 21వ ప్యాకేజీ వరకు చేపట్టాల్సిన పనులకు టెండర్లు కూడా పిలువలేదు. కృష్ణా నదిపై మిగులు జలాల ఆధారంగా చేపట్టిన పాలమూరు –- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అంత సులభంగా అనుమతులు వచ్చే ఆస్కారం లేదు. దీంతో  కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మసాగర్‌‌‌‌ నుంచి కేపీ లక్ష్మీదేవిపల్లికి లింక్‌‌‌‌ చేసే పనులపై ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌‌‌‌, చేవెళ్ల, పరిగి, వికారాబాద్‌‌‌‌, తాండూరు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. నీళ్లు ఎప్పుడు వస్తాయనే ప్రశ్న స్థానిక రైతుల నుంచి ఎదురవుతోందని వాళ్లు సీఎం దగ్గర చెప్పుకున్నట్టు తెలిసింది. 

నీళ్ల తరలింపు ఇట్లా..!

కొండపోచమ్మసాగర్‌‌ నుంచి సంగారెడ్డి కాలువ ద్వారా నీటిని మహబూబ్‌‌సాగర్‌‌ రిజర్వాయర్‌‌కు తరలిస్తారు. సంగారెడ్డి కాలువ 107వ కి.మీ. పాయింట్‌‌ నుంచి 6.5 కి.మీ.ల పొడవైన గ్రావిటీ కెనాల్‌‌, 51 కి.మీ.ల టన్నెల్‌‌ ద్వారా కేపీ లక్ష్మీదేవిపల్లి వరకు నీటిని పంపుతారు. ఇక్కడ 52 మీటర్ల ఎత్తయిన లిఫ్ట్‌‌ ఏర్పాటు చేసి రిజర్వాయర్‌‌లో పోస్తారు. ఇలా రోజుకు 0.8 టీఎంసీల చొప్పున 90 రోజుల్లో దాదాపు 70 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.3,500 కోట్ల వరకు అవుతుందని ప్రాథమికంగా లెక్కగట్టారు. ఇలా కాకుండా లోకల్‌‌ స్ట్రీమ్స్‌‌ను ఉపయోగించుకొని కొండపోచమ్మ నుంచి గండిపేట, ఉస్మాన్‌‌ సాగర్‌‌ వరకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించుకోవచ్చని, అక్కడి నుంచి లక్ష్మీదేవపల్లికి టన్నెల్‌‌ ద్వారా నీటిని తరలించి ఒక్క లిఫ్టు ఏర్పాటు చేసుకుంటే తక్కువ వ్యయంతో నీళ్లు ఇవ్వొచ్చని చెప్తున్నారు. ఈ ప్రతిపాదనల్లో లాభసాటి ప్రపోజల్‌‌ను ఫైనల్‌‌ చేయాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.