- మహానటుడు ఎన్‌టిఆర్‌కు విశ్వేశ్వరరావు వియ్యంకుడు.
- ఈయన కుమార్తె శాంతి ఎన్టీఆర్ కొడుకు మోహనకృష్ణ భార్య
- శాంతి కొడుకే జూనియర్ ఎన్టీఆర్
- జూనియర్ ఎన్టీఆర్ కు విశ్వేశ్వరరావు తాత
చెన్నై: ప్రముఖ దర్శక నిర్మాత విశ్వశాంతి విశ్వేశ్వరరావు అలియాస్ యు.విశ్వేశ్వరరావు కరోనాతో కన్నుమూశారు. ప్రస్తుతం ఈయన వయసు 90 ఏళ్లు. 1990 నుండే ఈయన సినిమా నిర్మాణ రంగానికి దూరంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. చెన్నైలో నివసిస్తున్న ఈయనకు కరోనా సోకడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. గురువారం చికిత్స ఫలించక కన్నుమూశారు. విప్లవ భావాలతో కెరియర్‌ను ఆరంభించి ఎన్నో హిట్ సినిమాలను అందించారు. నందమూరి తారకరామారావుతో కంచుకోట, నిలువుదోపిడీ, దేశోద్ధారకుడు, మార్పు, తీర్పు, హరిశ్చెంద్రుడు లాంటి హిట్ సినిమాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. మహానటుడు ఎన్‌టిఆర్ కు విశ్వేశ్వరరావు వియ్యంకుడు. ఎన్‌టిఆర్ కుమారుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహనకృష్ణకు, విశ్వేశ్వరరావు కూతురు శాంతి భార్య. మోహనకృష్ణ, శాంతి కుమారుడే యువ హీరో నందమూరి తారకరత్న.
ఆర్ధికంగా సంపన్న కుటుంబంలో పుట్టిన ఈయనకు సమాజ శ్రేయస్సు కోసం కట్టుబడి ఉండేవారు. విప్లవ భావాలతో ఆర్ట్ సినిమాలు నిర్మిస్తూనే, కమర్షియల్ కథలతో కూడా సినిమాలు చేసి సక్సెస్ సాధించారు. నిర్మాతగా, దర్శకునిగా, రచయితగా విశ్వేశ్వరరావు తనదైన బాణీ పలికించి తెలుగు ప్రజలను అలరించారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు దేశ విదేశాలలో ప్రదర్శితం అయ్యాయి. ప్రేక్షకుల రివార్డులతోపాటు ప్రభుత్వ అవార్డులనూ పొందాయి. ఇప్పటికీ ఆనాటి సినీజనం 'విశ్వశాంతి' విశ్వేశ్వరరావు అనే ఆయనను గుర్తు చేసుకుంటారు. కేవలం స్టార్స్ తోనే కాకుండా కొత్త వారికి అవకాశం కల్పించేందుకు, బడ్జెట్ ను తగ్గించేందుకు వర్ధమాన నటీనటులతోనూ సినిమాలు నిర్మించేందుకు ప్రాధాన్యత నిచ్చారు. ఈయన నిర్మించి, దర్శకత్వం వహించిన 'నగసత్యం' (1979), 'హరిశ్చంద్రుడు' (1980) చిత్రాలు వరుసగా ఉత్తమ తెలుగు చిత్రాలుగా జాతీయ అవార్డులు సంపాదించాయి. 'కీర్తి కాంత కనకం'తో ఉత్తమ దర్శకునిగా, 'పెళ్లిళ్ల చదరంగం'తో బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డులు అందుకున్నారు.
స్కూల్లో టీచరుగా కెరీర్ మొదలుపెట్టి సినిమా రంగం వైపు
సంపన్నుల కుటుంబంలో పుట్టిన విశ్వేశ్వరరావుకు మూడేళ్ల వయసులోనే తండ్రి చనిపోతే మేనమామ చేరదీశాడు. అందుకే కాబోలు లేటుగా అంటే 8 సంవత్సరాల వయసు వచ్చేవరకు అక్షరాభ్యాసం జరగలేదు. మొదట్లో ఇతడు వ్యవసాయ పనులపై ఆసక్తి చూపే వాడు. ఇతని చురుకుదనం చూసిన బావ దావులూరి రామచంద్రరావు బాగా చదివిస్తే ఉన్నత స్తాయికి ఎదుగుతాడని భావించి 14వ యేట నుండి స్కూలుకు పంపడం మొదలుపెట్టాడు. తొలుత ముదినేపల్లి, గుడివాడ, ఏలూరు చదువుకుంటూ చివరకు విజయనగరంలలో బి.ఎస్.సి.పట్టా సంపాదించాడు. డిగ్రీ పూర్తయ్యాక తాను చిన్నప్పుడు చదువుకున్న గుడివాడ హైస్కూలులో ఉపాధ్యాయుడిగా చేరాడు. తనకు చదువు చెప్పిన టీచర్లు ఇంకా అక్కడ పనిచేస్తుండడంత వారి సరసనే సహ ఉపాధ్యాయుడిగా పనిచేయడం ఆయనకు వింతగా నమ్మశక్యం కానిదిగా అనిపించింది. టాలీవుడ్ సినిమా నిర్మాతలు అట్లూరి పూర్ణచంద్రరావు, పి.రాఘవరావు గుడివాడ స్కూలులో ఇతనికి శిష్యులు. సాయంత్రం పూట చదువుకునే వారి కోసం గుడివాడలో జనతా ట్యుటోరియల్ ఇన్‌స్టిట్యూట్ స్థాపించి కొంతకాలం నడిపారు. తర్వాత బావ ప్రోద్బలంలో సినిమా రంగంలోనికి అడుగు పెట్టాడు.
చెన్నైలో సహాయ దర్శకుడిగా కెరీర్
విశ్వేశ్వరరావు చెన్నై వచ్చిన తర్వాత మొదట పి.పుల్లయ్య వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడిగా చేరాడు. కన్యాశుల్కం, జయభేరి చిత్రాలకు పుల్లయ్య వద్ద పనిచేశారు. ఆ సమయంలో బాలనాగమ్మ సినిమా నచ్చడంతో ఆర్ధికంగా ఏ లోటు లేని ఆయన తమిళ డబ్బింగ్ హక్కులు కొని నిర్మాతగా మారాడు. ఆ చిత్రం విడుదలై అతడికి లాభాలు తీసుకువచ్చింది. దీంతో విశ్వశాంతి అనే సంస్థను స్థాపించి 15 తమిళ, తెలుగు డబ్బింగ్ సినిమాలు నిర్మించాడు.
విశ్వేశ్వరరావు నిర్మించిన సినిమాలు:
కంచుకోట (1967)
నిలువు దోపిడి (1968)
పెత్తందార్లు (1970)
దేశోద్ధారకులు (1973)
దర్శకత్వం వహించిన సినిమాలు:
తీర్పు (1975)
నగ్నసత్యం (1979)
హరిశ్చెంద్రుడు (1981)
కీర్తి కాంత కనకం (1983)
వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలు తీసినా తన ఆశయాలను ప్రతిబింబించే చిత్రాలను నిర్మించాలనే ఉద్దేశంతో అటువంటి చిత్రాలకు దర్శకత్వం వహించేందుకు ఎవరూ ముందుకురారని తనే దర్శకుడిగా అవతారం ఎత్తి ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా విజయవంతమైన సినిమాలు తీశారు. 1990లో తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు తరలివెళ్లినా ఆయన మాత్రం చెన్నైలోనే ఉండిపోయారు.
