టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీలతో బెడిసికొట్టిన బీఆర్ఎస్​ఎమ్మెల్యేల వ్యూహం

 టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీలతో  బెడిసికొట్టిన బీఆర్ఎస్​ఎమ్మెల్యేల వ్యూహం

నల్గొండ, వెలుగు: తెలంగాణలో తొమ్మిదేండ్ల తర్వాత రాక రాక వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్న బీఆర్ఎస్​ఎమ్మెల్యేల వ్యూహం, టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీల కారణంగా బెడిసికొట్టింది. ఏకంగా 25 లక్షల మంది యువతీయువకులు పోటీ పరీక్షలు రాస్తుండడంతో వారిని ఎలాగైనా తమవైపు తిప్పుకునేందుకు రాష్ట్రంలో 50 మందికి పైగా ఎమ్మెల్యేలు వాళ్ల సొంత నియోజకవర్గాల్లో  ఏడాది కిందే ఫ్రీ కోచింగ్​సెంటర్లు తెరిచారు. ఎక్కడెక్కడి నుంచో ఫ్యాకల్టీని రప్పించి , ఫ్రీ ఫుడ్,అకామిడేషన్​ పేరుతో లక్షలకు లక్షలు ఖర్చు పెట్టారు. యూత్ ​ఓటర్లంతా ఇక తమ చేతిలో ఉన్నట్లే అనుకుంటున్న టైంలో టీఎస్​పీఎస్సీ పేపర్​లీకేజీ వ్యవహారం బయటపడడంతో సీన్​ రివర్స్​అయింది. అసలే పేపర్ ​లీకేజీ ఘటనతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా, సర్కారు తీరును ప్రతిపక్షాలు ఎక్కడికక్కడ ఎండగడుతున్నాయి. మరోవైపు న్యాయం కోసం నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగుతుండడంతో ఎమ్మెల్యేలు తలపట్టుకుంటున్నారు. 

50కి పైగా ఫ్రీ కోచింగ్​ సెంటర్లు.. 

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్​గతేడాది అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లో ప్రకటించారు. ఆ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్​, పోలీసు రిక్రూట్​మెంట్​ బోర్డు, గురుకుల రిక్రూట్​మెంట్​ బోర్డు నుంచి వరుస నోటిఫికేషన్లు వచ్చాయి. గ్రూప్స్​కు సంబంధించి గ్రూప్​,1,2,3,4 నోటిఫికేషన్లు రిలీజ్​అయ్యాయి. సీఎం ప్రకటనతోనే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో హడావిడి మొదలైంది. ఏకంగా 24  లక్షల మంది టీఎస్​పీఎస్సీలో వన్​టైం రిజిస్ట్రేషన్​ చేసుకోవడంతో వీళ్లందరినీ ఓటుబ్యాంకుగా మలుచుకునేందుకు బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు ప్లాన్​ వేశారు. ఈ క్రమంలోనే సుమారు 50మందికిపైగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఫ్రీ కోచింగ్​సెంటర్లు తెరిచారు. ఇందుకోసం అప్పటికప్పుడు తమ తండ్రులు, తాతల పేర్లతో ఫౌండేషన్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి ఫ్యాకల్టీని రప్పించి మరీ ట్రైనింగ్​ ఇప్పించారు. కొందరైతే లోకల్​గా ఉన్న  కోచింగ్ సెంటర్లను దత్తత తీసుకొని తమ పేర్లతో ఫ్రీ పబ్లిసిటీ చేసుకున్నారు. ఈ కోచింగ్​ సెంటర్ల పేరిట ఒక్కో ఎమ్మెల్యే ఇప్పటివరకు రూ.50 లక్షల నుంచి రూ. కోటి దాకా ఖర్చు చేసినట్లు చెప్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్​లైన్​పై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేండ్ల పాటు ఎలాంటి నోటిఫికేషన్లు లేకపోవడంతో అప్పటికే యూత్​ ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు యువ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారని రూలింగ్​ పార్టీ చేయించిన సర్వేల్లోనూ తేలింది. ఇలాంటి టైంలో ఎమ్మెల్యేలు చేసిన ఫ్రీ  కోచింగ్ ప్రయోగం సక్సెస్​ అయిందనే టాక్​ వచ్చింది. ప్లాన్ వర్కవుట్​ అయిందని సంబరపడ్తున్న టైంలో పేపర్ లీకేజీల వ్యవహారం బయటపడడం ఎమ్మెల్యేలంతా పరేషాన్​లో పడ్డారు. 

మంత్రుల కామెంట్లపైనా ఆగ్రహం..

ఈసారి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువతీయువకులు సొంత ఊర్లను విడిచి, హైదరాబాద్​, జిల్లా కేంద్రాల్లో హాస్టళ్లు, రూములు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అక్కడి దాకా వచ్చే స్థోమతలేనివారు నియోజకవర్గ కేంద్రాల్లోనో, సమీప పట్టణాల్లో ఏర్పాటుచేసిన కోచింగ్​సెంటర్లకు వెళ్లి చదువుకుంటున్నారు. ఈ క్రమంలో వేలాది మంది తాము చేస్తున్న ప్రైవేట్​జాబ్స్​ మానేశారు.  చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు నెలల తరబడి లీవ్​లు పెట్టి చదివారు. తీరా పేపర్లు లీకవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇలాంటి టైంలో వారికి మనోధైర్యం కల్పించాల్సిన మంత్రుల్లో కొందరు బాధ్యతారహితంగా మాట్లాడడంపై నిరుద్యోగులు మండిపడ్తున్నారు. ‘ఒకరిద్దరు చేసిన తప్పుతో మాకే సంబంధం? ’ అని మంత్రి కేటీఆర్​ అంటే ‘లీకేజీలు కామన్’ అని మరో మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి కామెంట్​ చేయడాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలే తప్పు పడుతున్నారు. మరోవైపు లీకేజీ వ్యవహారం ప్రతిపక్ష పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ  ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాలు కొనసాగుతున్నాయి.  నిరుద్యోగులు మండల, జిల్లా కేంద్రాల్లోనూ  రోజుకో చోట ఆందోళనలు చేస్తున్నారు. సోషల్​ మీడియాలోనూ ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు.  ఈ పరిణామాలతో  బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా నారాజ్​అయ్యారు.  యూత్​ను బుట్టలో వేసుకునేందుకు ఏడాదికాలంగా తాము పడ్డ కష్టమంతా బూడిదలో పోసినట్లయిందని వాపోతున్నారు.