స్కూల్​ స్టూడెంట్స్​లో లెర్నింగ్​ స్కిల్స్​  తగ్గినయ్​​

స్కూల్​ స్టూడెంట్స్​లో లెర్నింగ్​ స్కిల్స్​  తగ్గినయ్​​

హైదరాబాద్, వెలుగు: కరోనా తెచ్చిన ఏడాదిన్నర గ్యాప్ పిల్లల చదువులపై తీవ్ర ప్రభావం చూపించింది. స్కూళ్లలో ఫిజికల్ క్లాసులు మొదలైనా స్టూడెంట్స్ హాజరు పెరగడానికి రెండు, మూడు వారాల పైనే పట్టింది. ప్రైవేట్ స్కూళ్లలో చదివే స్టూడెంట్స్ కి ఆన్​లైన్ లో క్లాసులు, పేరెంట్స్ మానిటరింగ్ ఉన్నా సబ్జెక్ట్  లెర్నింగ్​లో మాత్రం వెనకబడ్డారు. సర్కారు బడుల్లోని పిల్లల్లో సగానికిపైగా డిజిటల్ క్లాసులు వినడంలేదు. టీశాట్, దూరదర్శన్ ద్వారా పాఠాలు చెప్పినా చాలా మందికి సరిగా అర్థం కావడంలేదు. దీంతో చాలామంది స్టూడెంట్స్ సబ్జెక్ట్‌‌ బేసిక్స్ కూడా మర్చిపోయారు. పిల్లల్లో వచ్చిన లెర్నింగ్ గ్యాప్ మెరుగుపరిచేందుకు అక్టోబర్ నుంచి ప్రభుత్వ స్కూళ్లలో బేస్ లైన్ సెషన్లు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. లేట్​గా స్కూళ్లు స్టార్ట్ కావడంతో పాఠాలు  
రి విజన్ ​చేయడం, బేస్ లైన్ నిర్వహించడం కష్టంగా మారింది. ఎగ్జామ్స్ షెడ్యూల్ లోపు సిలబస్ కంప్లీట్ చేయడం అసాధ్యమని టీచర్లు చెబుతున్నారు. 
మార్కుల ఆధారంగా కేటగిరీలుగా.. 
బేసిక్ లెర్నింగ్ సెషన్​ను ప్రస్తుతం అన్ని ప్రభుత్వ స్కూళ్లలో  3 నుంచి 10 తరగతి వరకు ప్రతి రోజు జరుగుతుంది. మొదట స్టూడెంట్స్ కు క్లాస్​ను బట్టి ఒక పరీక్ష పెడతారు. అందులో వచ్చే మార్కుల ఆధారంగా బేస్ లైన్​లో 4 కేటగిరీలుగా చేస్తారు. ఏ గ్రేడ్ వచ్చిన స్టూడెంట్స్ కు సెషన్లు లేకుండా డైరెక్ట్ క్లాసులు ఉంటాయి. బీ గ్రేడ్ వస్తే బేస్ లైన్ తో పాటు క్లాసులు,  సీ, డీ గ్రేడ్ లు వస్తే స్టూడెంట్స్ పై  ప్రత్యేక దృష్టి పెట్టి వారిలో స్కిల్స్ పెంచేందుకు టీచర్లు ప్రయత్నిస్తున్నారు. మ్యాథ్స్​, లాంగ్వేజెస్, సైన్స్ సబ్జెక్ట్ ల్లో వెనకబడిన స్టూడెంట్స్​కు పాఠాలు చెప్పడం, అవి గుర్తుండేలా రివిజన్ చేయడం ఇబ్బందికరంగా మారిందని టీచర్లు పేర్కొంటున్నారు. 
హై స్కూల్స్​ స్టూడెంట్స్​లో  ఎక్కువగా..
కరోనాకు ముందటితో పోలిస్తే పిల్లల్లో లెర్నింగ్ తగ్గిపోయిందని టీచర్లు అంటున్నారు. బేస్ లైన్ సెషన్లు నిర్వహిస్తున్నా కానీ అర్థం చేసుకోవడానికి  టైం పట్టొచ్చంటున్నారు.  ఈ సమస్య హైస్కూల్ స్టూడెంట్లలో తీవ్రంగా ఉందంటున్నారు. టెన్త్ స్టూడెంట్లకు 70 శాతమే సిలబస్ ఉంటదని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికే చాలా స్కూల్స్ 30 శాతం ​ కంప్లీట్ చేశాయి. ఇప్పుడు మిగతా 70 శాతంలోని పాఠాలపై  ఫోకస్ చేశామని టీచర్లు పేర్కొంటున్నారు. మిగతా క్లాసులన్నింటికీ 100 శాతం సిలబస్ ఉంది. ఒకప్పటిలా కాకుండా ఫార్మేటివ్ ​, సమ్మెటివ్ అసెస్​మెంట్​పరీక్షలు నిర్వహిస్తున్నారు. సిలబస్​పూర్తి కాకుండా టెస్ట్ లు కండక్ట్ చేయడం ఎలా సాధ్యమని మరోవైపు ప్రైవేట్ స్కూళ్ల మేనేజ్​మెంట్లు అంటున్నారు. బేస్‌‌లైన్ ప్రోగ్రాంతో మెయిన్ సిలబస్ అటకెక్కుతుందని, ఇప్పుడు నేర్చుకునే వాటిపై కూడా స్టూడెంట్స్ శ్రద్ధ చూపలేరని అంటున్నారు.

ఇబ్బందికరంగా ఉంది 
ఈ నెల1 నుంచి బేస్‌‌లైన్ సెషన్స్ కండెక్ట్  చేయాలని ఆదేశాలొచ్చాయి. స్టార్ట్ చేసిన వారానికే దసరా సెలవులు వచ్చాయి. బేసిక్ లెవల్స్ నుంచి పిల్లలకు నేర్పిస్తూ ప్రస్తుత సిలబస్  పూర్తి చేయడం ఇబ్బందిగా ఉంది. ఇప్పటివరకు 10 శాతం సిలబస్​కూడా పూర్తి కాలేదు. సరిపడా టీచర్లు లేరు. ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించాలి. 
– రేణు, హెచ్ఎం, గవర్నమెంట్ స్కూల్ 

టీచర్లే లేరు..
 స్కూల్​లో మ్యాథ్స్, తెలుగు, హిందీ టీచర్లు రెండేండ్ల క్రితం రిటైర్‌‌‌‌ అవగా, ఇంకా భర్తీ చేయలేదు. ఈ టైంలో పాఠాలు చెప్పడమే కష్టంగా ఉంది. ఎగ్జామ్స్ లోగా సిలబస్ కంప్లీట్ చేయాలి. పిల్లలకు టెస్ట్ లు పెట్టాలి. నవంబర్ వరకు బేస్ లైన్ ఉంటే లెసెన్స్ చెప్పడానికి, రివిజన్ కు టైం ఉండదు. 
- నరసింహ,హెడ్ మాస్టర్, 
గవర్నమెంట్ హై స్కూల్

 సబ్జెక్ట్ టీచర్ల కొరత
సర్కారు బడుల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ప్రైవేట్ నుంచి చాలామంది స్టూడెంట్లు ప్రభుత్వ​ స్కూళ్లలో చేరారు.  టీచర్లను అడ్జెస్ట్ చేయలేక హెడ్ మాస్టర్లు ఇబ్బంది పడుతున్నారు. పక్క స్కూల్స్ ​నుంచి టీచర్లను తీసుకుందామన్నా అన్నిచోట్ల ఇదే సమస్య ఉంది. గతేడాది వందల మంది హెడ్ మాస్టర్లు, టీచర్లు రిటైరయ్యారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. మరోవైపు విద్యా వలంటీర్లను కూడా తీసుకోలేదు. సోషల్, బయాలజీ, హిందీ సబ్జెక్ట్​లు చెప్పేందుకు టీచర్లు లేరు. ప్రభుత్వం స్పందించి వెంటనే టీచర్లను రిక్రూట్ చేయాలని లేదంటే విద్యా వలంటీర్లనైనా నియమించాలని హెడ్​మాస్టర్లు కోరుతున్నారు. హైదరాబాద్​ జిల్లాల్లో మొత్తం 690 స్కూళ్లలో 6,305 మంది సబ్జెక్ట్ టీచర్లు  అవసరం కాగా.. 4,739 మందే ఉన్నారు. 1,566 ఖాళీలు ఉన్నాయి. ఈ ఏడాది అన్ని స్కూల్స్​లో  బేస్​ లైన్ ​సిస్టమ్​ అమలు చేస్తుండడంతో వివిధ కేటగిరీల్లోని స్టూడెంట్స్​కు టీచింగ్​చేయడం ఇబ్బందిగా ఉందని టీచర్లు అంటున్నారు.