బ్యాగ్స్, చెప్పులు, పర్స్, జాకెట్, బెల్ట్, సీట్ కవర్స్ ఇలా చాలా రకాల లెదర్ వస్తువులు వాడుతుంటారు చాలామంది. అయితే, అందుకోసం ఏటా కొన్ని కోట్ల మూగ జీవాలు బలైపోతున్నాయి. వాటి మరణాల్ని తగ్గించడానికి ‘నేను తయారుచేసిన బయో లెదర్ సాయపడుతుంది’ అంటోంది రాజస్తాన్‌కు చెందిన దివ్యా వర్మ.
ఎఫ్‌ఏఓ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) వాళ్ల లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏటా 2.29 బిలియన్ అంటే దాదాపు 229 కోట్ల జంతువుల్ని కేవలం లెదర్ వస్తువుల తయారీకోసం చంపేస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా నాచు, కిచెన్ వేస్ట్ (కూరగాయలు, పండ్ల తొక్కల)తో బయోలెదర్‌ని తయారుచేసింది దివ్య. దానికి ‘కుదరత్’ అని పేరు పెట్టింది. కుదరత్ అంటే ‘ప్రకృతి’ అని అర్థం. ఈ బయో లెదర్ కూడా మామూలు లెదర్‌లాగ గట్టిగా ఉంటుంది. మట్టిలో కలిసిపోతుంది. వాటర్ ప్రూఫ్ కూడా.
అమ్మను చూసి..
దివ్య సొంతూరు అహ్మదాబాద్. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడి), అహ్మదాబాద్‌లో సస్టైనబుల్ డిజైన్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. తరువాత బిట్స్, పిలానీలో బయోలాజికల్ సైన్సెస్‌లో మాస్టర్స్ చదివింది. చిన్నప్పుడు దివ్య తల్లి గార్డెనింగ్ చేసేది. ఆ తోటలోనే ఆడుకునేది దివ్య. మొక్కలకు పెస్టిసైడ్స్ వాడకుండా, కిచెన్ వేస్ట్‌తో కంపోస్ట్ తయారుచేసి మొక్కలకు వేసేది ఆమె తల్లి. అప్పుడే ‘ప్రకృతిలోని ఏ వస్తువూ వృధాగా పోదు. ప్రతీది ఏదో ఒక రూపంలో పనికొస్తుంది. వాటిని బాగా చూసుకుంటే, అవి మనకు మంచి చేస్తాయి’ అనుకునేది. అలా నేచర్‌పై ఇష్టాన్ని పెంచుకుంది. ఆ ఇష్టమే సస్టైనబుల్ డిజైన్ కోర్స్‌లో చేరేలా చేసింది. ఆ కోర్స్ చదువుతున్నప్పుడు బయోప్లాస్టిక్, బయో ఫ్యాబ్రిక్, బయో టెక్స్‌టైల్ గురించి తెలుసుకుంది. వాటిపై రీసెర్చ్ చేసి ఎలా తయారుచేస్తారో తెలుసుకుంది. తరువాత తను కూడా బయోలాజికల్ ఐటమ్స్ తయారుచేయాలి అనుకుంది. అప్పుడే, కిచెన్ వేస్ట్‌తో బయోలెదర్ చేయాలనే ఆలోచన వచ్చింది.
వంటగదే ల్యాబ్‌గా..
ఎన్‌ఐడి ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్. కేతన్ కుమార్‌తో తన ఆలోచన పంచుకుంది దివ్య. ఆమె ఆలోచన నచ్చి దివ్యకు సాయం చేస్తానన్నాడు కేతన్. దానిపై రీసెర్చ్ చేసి, ల్యాబ్‌లో పని మొదలుపెట్టేలోపు కొవిడ్ లాక్‌డౌన్ వచ్చింది. దాంతో ఇంటికే పరిమితం అయింది దివ్య. అయినా, పని ఆపలేదు. కిచెన్‌లోనే ప్రయోగాలు చేసింది. వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఫ్రెండ్స్ సాయంతో తెప్పించుకుంది. కొబ్బరి, వాల్‌నట్ షెల్స్‌ను పొడి చేసింది. వాటిని జనపనారతో కలిపి మెటీరియల్ తయారుచేసింది. అది సక్సెస్ కావడంతో, తరువాత నాచుతో ట్రై చేసింది. అది కూడా సక్సెస్ అయింది. తరువాత నాచుకి గుడ్డు పెంకులు, కొబ్బరి పీచు, పండ్లు, కూరగాయల తొక్కల్ని కలిపి లెదర్ తయారుచేసింది. ఆ లెదర్ మెటీరియల్ వాసన రాకుండా పూలతో సెంట్‌ని తయారుచేసి, బయోలెదర్ తయారీకి వాడుతుంది.
ఇప్పుడు అవి రోజ్, లెమన్, లిల్లీ, బంతి ఫ్లేవర్లలో దొరుకుతున్నాయి. ప్రస్తుతం బయోలెదర్‌తో హ్యండ్ బ్యాగ్‌లు, చేతి సంచులు తయారుచేస్తోంది. వాటిని ఎగ్జిబిషన్స్‌ల్లో పెట్టి అమ్ముతోంది. బయోలెదర్‌తో త్వరలో వీలైనన్ని ఎక్కువ రకాల ప్రొడక్ట్స్ చేసి మార్కెట్‌లోకి తీసుకొస్తానంటోంది. బయోలెదర్ తయారు చేసినందుకు ‘గ్రీన్ కాన్సెప్ట్ అవార్డ్, గ్రీన్ కాన్సెప్ట్ ఆడియన్స్ అవార్డ్, సిఐఐ యంగ్ డిజైనర్ అవార్డ్’లు గెలుచుకుంది. ‘నేషనల్ జేమ్స్ డైసన్ అవార్డ్’ రన్నరప్‌గా నిలిచింది దివ్య.‘‘లెదర్ ఐటమ్స్ తయారు చేయడంవల్ల ఇండస్ట్రియల్ పొల్యూషన్ జరుగుతుంది. ఎక్కువ నీళ్లు, కరెంట్ కూడా అవసరమవుతుంది. వాటినుంచి వచ్చే వేస్టేజ్ నీళ్లు, గాలిలో కలిసి మనిషి ప్రాణాల మీదికి తెస్తుంది. ఈ కుదరత్ బయోలెదర్ వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఏవీ ఉండవు. పైగా బయో వేస్టేజ్ తగ్గుతుంది. నేచర్‌ని, జంతువుల్ని కాపాడాలి అన్న ఆలోచనతో కుదరత్ బయోలెదర్ కనిపెట్టా” అని చెప్పింది దివ్య.
