కరోనాతో వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నరు

 కరోనాతో వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నరు
  • చూసుకోవడం కష్టమై కొందరు.. వైరస్ అంటుతదేమోనని ఇంకొందరు 
  • కొన్ని రోజులని నెలలైనా తీస్కపోతలే.. గోస పడుతున్న పెద్ద మనుషులు

హైదరాబాద్​, వెలుగు: ‘‘కరోనాకు భయపడి కేర్ టేకర్లు వస్తలేరు. మా అమ్మను చూసుకునేందుకు ఎవరూ లేరు. మీ హోమ్​లో అడ్మిషన్ కావాలి” అంటూ ఒక కొడుకు.. ‘‘ఇంట్లో చిన్న పిల్లలున్నారు. మా అమ్మను చూసుకోవడం కుదరడం లేదు. ఎంత ఫీజు అయినా పర్లేదు. జాయిన్ చేసుకోండి” అంటూ ఓ కూతురు.. ‘‘ఇంట్లో అందరికీ పాజిటివ్ వచ్చింది. పెద్దవాళ్లను చూసుకోడానికి ఎవరూ లేరు. ఓల్డేజ్ హోమ్​కు షిఫ్ట్ చేయాలని అనుకుంటున్నాం” అంటూ ఓ బంధువు.. ఇలా మాయదారి కరోనా కారణంగా పెద్దోళ్లను ఓల్డేజ్ హోంలకు పంపుతున్నరు. పిల్లల మీద ప్రేమతో కొందరు.. పెద్దలకు ఏమన్నా అవుతుందేమోనని ఇంకొందరు.. అక్కడైతేనే అన్ని ఫెసిలిటీలు ఉంటాయని మరికొందరు.. ఇలా రకరకాల కారణాలతో పెద్దవాళ్లను హోమ్​లలో జాయిన్ చేస్తున్నారు.

హోంలకు పెరిగిన డిమాండ్ 
హైదరాబాద్ సిటీలోని కొన్ని పాపులర్​ ఓల్డేజ్​ హోమ్​లకు అడ్మిషన్ల కోసం రోజూ పది, పదిహేను కాల్స్ వస్తున్నాయి. చాలా హోమ్స్​లో అడ్మిషన్లు బంద్​ చేశారు. ఫస్ట్ వేవ్ టైం నుంచే కొన్ని హోమ్​లు కొత్త వాళ్లను తీసుకోవడం లేదు. ఏళ్ల తరబడి ఉంటున్న పాతవాళ్లకు కొత్త వాళ్లతో వైరస్ సోకవచ్చని చేర్చుకోవడంలేదు. కొన్ని హోమ్‌లలో మాత్రం కరోనా నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే చేర్చుకుంటున్నారు. చాలా తక్కువ హోమ్‌లు మాత్రమే పాజిటివ్ వచ్చిన వాళ్లనూ అడ్మిట్ చేసుకుని, ఐసోలేషన్, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. కొందరైతే హోమ్‌లను మూసేశారు. కరోనా తగ్గిన తర్వాత రీఓపెన్ చేస్తామని బోర్డులు పెట్టారు. ఇలా పాజిటివ్ వాళ్లనూ చేర్చుకునే హోమ్‌లకు రోజూ 25 వరకూ కాల్స్ వస్తున్నాయని అంటున్నారు. ఇక బోయిగూడలో ఓ మిషనరీ ఆధ్వర్యంలో ఫ్రీ అకామిడేషన్ తో నడుస్తున్న హోంకు వంద మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారని చెప్తున్నారు.

పెద్దోళ్ల ఎదురుచూపులు 
ఓల్డేజ్ హోమ్‌లలో వివిధ సర్వీసులు అందిస్తున్నారు. కరోనా పాజిటివ్ వాళ్లను చేర్చుకున్న సెంటర్లలో వాళ్లను ఐసోలేషన్​లో ఉంచి ట్రీట్​మెంట్ ఇప్పిస్తున్నారు. మంచి డైట్ ఇస్తున్నారు. పోస్ట్​కొవిడ్​ సర్వీస్​ కూడా అందిస్తున్నారు. నెగెటివ్ వాళ్లను మాత్రమే చేర్చుకునే సంస్థలు వాళ్లను పది రోజుల పాటు ఐసోలేషన్​లో ఉంచిన తర్వాతే మిగితా వాళ్లతో కలుపుతున్నారు. కొత్త వ్యక్తులను తీసుకోని హోమ్​లు ఇప్పటికే ఉన్నవాళ్లకు టీకాలు వేయిస్తున్నాయి. అయితే చాలా మందిని కొన్ని రోజులకే అని చెప్పి అడ్మిట్ చేస్తున్నారని, కానీ కరోనా కారణంగా నెలలు అయినా తీసుకుపోవడంలేదని అంటున్నారు. పెద్దవాళ్లు మాత్రం ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తారా? అని ఎదురుచూపులు చూస్తున్నారని చెప్తున్నారు. 

సెకండ్ వేవ్ తో మారిన సీన్
ఫస్ట్ వేవ్ లో ఇంట్లో ఎవరో ఒకరికి పాజిటివ్ వస్తే ఐసోలేషన్ లో ఉంటే సరిపోయేది. కానీ సెకండ్ వేవ్ లో ఇంట్లో ఒకరికి వస్తే మిగతా అందరికీ స్పీడ్ గా వైరస్ అంటుతోంది. అంతేకాకుండా సెకండ్ వేవ్ లో చాలా మందికి సీరియస్ అవుతోంది. దవాఖాన్లలో బెడ్లు, ఆక్సిజన్, మందుల కొరత వల్ల జనంలో భయం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో వృద్ధులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల వారికి వైరస్ సోకితే కష్టమని ఓల్డేజ్ హోమ్‌లవైపు చూస్తున్నారు. అక్కడైతేనే పెద్దోళ్లకు అన్నీ టైం ప్రకారం అందుతాయని, వాళ్లను చూసుకునేందుకు కేర్ టేకర్లు, మెడికల్ సౌకర్యాలు కూడా ఉంటాయని భావిస్తున్నారు. ఇక కరోనా వల్ల ఇప్పుడు ఎవరికి వాళ్లు ఎక్స్​ట్రా కేర్​ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరికి పెద్ద వాళ్లు భారంగా కనిపిస్తున్నారు. అందుకే డబ్బులు పోయినా సరే హోమ్‌కి పంపుతున్నారు.  

కాల్స్ పెరిగినయ్ 
కరోనాతో అడ్మిషన్ కాల్స్ పెరిగాయి. ఇంతకుముందు రోజుకు రెండు, మూడు వచ్చేవి. ఇప్పుడు 10 నుంచి 15 వస్తున్నా యి. కొందరు తమకు పాజిటివ్ వచ్చిందని, మరికొందరు తమ పేరెంట్స్ కి పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. వచ్చినోళ్ల ను నెగెటివ్ రిపోర్ట్ తీసుకుని జాయిన్ చేసుకున్నాం. ప్రస్తుతం అడ్మిషన్లు ఆపేశాం.  
- మలినేని అరుణ, ది నెస్ట్ హోమ్ ఫర్ ది ఎల్డర్స్, మియాపూర్   

టీకాలు వేయించినం 
మాకు రోజు ఐదు నుంచి ఆరు వరకు కాల్స్ వస్తున్నాయి. ఇంట్లో స్పేస్ లేక పెద్దవాళ్లను హోమ్‌లకు పంపిస్తున్నామని అంటున్నారు. 30 నుంచి 40 వేలు అయినా ఇస్తాం. అడ్మిట్ చేసుకోవాలని అడుగుతున్నారు. కానీ మేం కరోనా పాజిటివ్ వాళ్లను జాయిన్ చేసుకోవడం లేదు. మా హోంలో 20 మంది ఉన్నారు. వారికి ఫస్ట్ డోస్ వాక్సినేషన్ చేయించాం.   
- ఆయేషా, అమ్మ ఓల్డేజ్ హోమ్, సికింద్రాబాద్