ఇంటర్ స్పాట్​కు ‘కరోనా’ కష్టాలు

ఇంటర్ స్పాట్​కు ‘కరోనా’ కష్టాలు

హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్ భయంతో ఇంటర్ వాల్యుయేషన్ కు లెక్చరర్లు ముందుకొస్తలేరు. ఇప్పటికే ఓసారి వాయిదాపడ్డ స్పాట్ ను తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నా అవే ఇబ్బందులు కొనసాగుతున్నాయి. వాల్యుయేషన్ ను ఈ నెల12 నుంచి ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించినా, పేపర్లు దిద్దేందుకు ఎంతమంది వస్తారన్నది తెలియక ఇంటర్ బోర్డు అధికారులు టెన్షన్ పడుతున్నారు. మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షలకు 9.65 లక్షల మంది హాజరయ్యారు. ఆన్సర్  షీట్లను దిద్దడం అదే నెలలో ప్రారంభమైంది. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో ఇంటర్ స్పాట్ వాయిదా పడింది. తాజాగా జేఈఈ, నీట్ తదితర పోటీ పరీక్షల తేదీల ప్రకటన రావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ నెల12న ఇంటర్ వాల్యుయేషన్  ప్రారంభిస్తామని విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి ప్రకటించారు. దీంతో ఇంటర్ బోర్డు అధికారులు స్పాట్ కు ఏర్పాట్లు మొదలుపెట్టారు.

ఇంకా 55 లక్షల పేపర్లు దిద్దాలె..

రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులందరివీ 65 లక్షల వరకూ ఆన్సర్ షీట్లు ఉండగా, 55 లక్షల  ఆన్సర్ షీట్లను వాల్యుయేషన్  చేయాల్సి ఉంది. వాల్యుయేషన్  కోసం ఇప్పటికే పాతవి12 స్పాట్ కేంద్రాలతో పాటు కొత్తగా మరో 21 సెంటర్లను ఏర్పాటు చేశారు. సెంటర్ లోని ఒక్కోరూమ్ లో 8 నుంచి 12 మంది  వాల్యుయేషన్  చేసేలా చూస్తున్నారు. రోజుకు 45 పేపర్లు దిద్దించాలని ఇప్పటికే ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నది.  15 వేల మంది లెక్చరర్లను వాడుకోవాలని భావిస్తోంది.

రోజుకు 30 పేపర్లే దిద్దించాలి..

రెడ్ జోన్ లో ఉన్న హైదరాబాద్, వరంగల్ లోనే ఎక్కువ పేపర్లు దిద్దించేందుకు ఏర్పాట్లు చేస్తుండటం లెక్చరర్లను భయాందోళనకు గురిచేస్తోంది. లెక్చరర్లకు మాస్కులు, శానిటైజర్లు ఇస్తామనీ, హాస్టల్ ఫెసిలిటీ కల్పిస్తామనీ ఆఫీసర్లు చెబుతున్నారు. తమకు ఇన్సూరెన్స్ కల్పించాలని, రోజుకు 30 పేపర్లనే దిద్దించాలని కాంట్రాక్టు లెక్చరర్లు ఇప్పటికే అధికారులను కోరారు. ఈ క్రమంలో లెక్చరర్ల భయాన్ని తొలగించేందుకు యూనియన్లను, ప్రైవేటు కాలేజీ మేనేజ్మెంట్లను ఇంటర్ బోర్డు రంగంలోకి దించింది.

సర్దుకోవాలె

అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు. లోటుపాట్లున్నా లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్ సర్దుకోవాలి. అందరూ స్పాట్ లో పాల్గొనాలె.

– మధుసూదన్ రెడ్డి, ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్

లెక్చరర్లందరూ పాల్గొనాలె

విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని లెక్చరర్లందరూ వాల్యుయేషన్ లో పాల్గొనాలె. ప్రైవేటు కాలేజీలు స్పాట్ కు సహకరించాలె.

– గౌరీసతీశ్,ప్రైవేట్ కాలేజీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ఐడీ కార్డులు ఇస్తం

వాల్యుయేషన్​లో పాల్గొనే వారికి ప్రత్యేకంగా ఐడీకార్డులు ఇస్తాం. వచ్చి పోయేందుకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.

‌‌- ఉమర్ జలీల్, ఇంటర్ బోర్డు సెక్రెటరీ