వామపక్షాలే దేశానికి రక్ష.. కమ్యూనిస్ట్ ల ఐక్యత చారిత్రక అవసరం

వామపక్షాలే దేశానికి రక్ష.. కమ్యూనిస్ట్ ల ఐక్యత చారిత్రక అవసరం

హైదరాబాద్, వెలుగు : వామపక్షాలే దేశానికి రక్ష అని సీపీఎం, సీపీఐ జనరల్  సెక్రటరీలు  సీతారాం ఏచూరి, డి.రాజా అన్నారు. కమ్యూనిస్టుల ఐక్యత చారిత్రక అవసరమన్నారు. వామపక్షాలకు పాత రోజులు తెచ్చేందుకు రెండు కమ్యూనిస్టు పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరముందని, దీనికి సీపీఎం, సీపీఐ ఉమ్మడి సమావేశం ఓ ముందడుగు అని వారు పేర్కొన్నారు. ఈ మీటింగ్ అన్ని రాష్ర్టాలకూ స్ఫూర్తిదాయకమని చెప్పారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని ఆరోపించారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్​లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో ఉమ్మడి సమావేశం నిర్వహించారు. సీతారాం ఏచూరి, రాజా ముఖ్య​అతిథులుగా హాజరయ్యారు. ఏచూరి మాట్లాడుతూ.. దేశంలో 40 శాతం సంపద ఒక్క శాతమున్న సంపన్నుల చేతిల్లో ఉందని, 50 శాతం ప్రజల వద్ద మూడు శాతం సంపద మాత్రమే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘మోడీ ప్రధాని అయినప్పటి నుంచి నిత్యావసరాలు, పెట్రో, గ్యాస్  ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలో 80 కోట్ల మందికి ఐదు కిలోల బియ్యం, గోధుమలు ఇస్తున్నామని ప్రధాని గొప్పలు చెప్తున్నాడు. కానీ ఆ 80 కోట్ల మంది బియ్యం లేకుండా బతకలేరు. ఇదేనా మోడీ ప్రభుత్వం సాధించింది? ఏడేండ్ల కాలంలో కార్పొరేట్లకు రూ.11 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు” అని ఏచూరి వ్యాఖ్యానించారు.

డి.రాజా మాట్లాడుతూ..  మోడీ, అదానీ మధ్య సంబంధం బయటపడుతుందనే  జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసేందుకు కేంద్ర సర్కారు సిద్ధంగా లేదని విమర్శించారు. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా వామపక్ష, లౌకిక శక్తులు పనిచేయాలని కోరారు. 

మోడీ మళ్లీ గెలిస్తే దేశాన్ని అమ్మేస్తడు: రాఘవులు

మోడీ మళ్లీ గెలిస్తే దేశాన్ని అమ్మేస్తారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. భాగ్యలక్ష్మి ఆలయం ఉన్న నగరం నుంచి వెంకటేశ్వర గుడి ఉన్న తిరుపతి వరకూ వందేభారత్ రైలు పోతుందని చెప్పడం ద్వారా ఒక హిందూ గుడి నుంచి మరో హిందూ గుడికి రైలు పోతుందని మోడీ పేర్కొన్నారని, కానీ రైలుకు హిందూ ముస్లిం తేడా ఉండదన్నారు. రైలు ప్రారంభోత్సవాన్ని కూడా మతంతో ముడిపెట్టారని విమర్శించారు.

నేతలు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డపై.. బీజేపీ జెండాను ఎగరనివ్వబోమని చెప్పారు. సీపీఎం, సీపీఐ నాయకులు చెరుపల్లి సీతారాములు, వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, పశ్య పద్మ, పోతినేని సుదర్శన్, జాన్ వెస్లీ, టి.సాగర్ పాల్గొన్నారు.