బీఆర్ఎస్​కు బీ టీమ్​గా లెఫ్ట్ పార్టీలు : సీపీఎం ఆఫీస్​లో షర్మిల కామెంట్స్

బీఆర్ఎస్​కు బీ టీమ్​గా లెఫ్ట్ పార్టీలు : సీపీఎం ఆఫీస్​లో షర్మిల కామెంట్స్
  • కోదండరాం, తమ్మినేని, కూనంనేనితో భేటీ  
  • నిరుద్యోగుల కోసం ఏకమవ్వాలని పిలుపు 
  • తమ ఆఫీస్ కొచ్చి తమపైనే కామెంట్లు చేయడంపై తమ్మినేని అసహనం

హైదరాబాద్, వెలుగు: “రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటంలో తమతో కలిసి రావాలని లెఫ్ట్ పార్టీలు నన్ను ఎప్పుడైనా కోరాయా? కనీసం ఫోన్ చేసైనా పిలిచారా? బీజేపీకి బీ టీమ్ లా పని చేస్తున్నామని మమ్మల్ని తమ్మినేని అన్నారు. మేం ఎన్నడూ బీజేపీకి బీ టీమ్ లా వ్యవహరించలేదు. వామపక్షాలే బీఆర్ఎస్‌‌కు బీ టీమ్‌‌లా పనిచేశాయి. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై లెఫ్ట్ పార్టీలు పోరాటం చేయడం లేదు. రాజకీయాలు పక్కనపెట్టి నిరుద్యోగుల భవిష్యత్తు కోసం అన్ని పార్టీలు కలిసి రావాలి. టీ సేవ్ ఫోరం ఏర్పాటు చేసి కేసీఆర్ సర్కార్ పై కొట్లాడాలి” అని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పిలుపునిచ్చారు.

నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు ‘టీ సేవ్ ఫోరం’ ఏర్పాటులో భాగంగా టీజేఎస్, సీపీఎం, సీపీఐ నేతలతో షర్మిల భేటీ అయ్యారు. మంగళవారం ముందుగా నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీస్ లో ఆ పార్టీ చీఫ్ కోదండరాంతో ఆమె సమావేశమయ్యారు. అనంతరం హిమాయత్ నగర్ లో సీపీఐ ఆఫీస్ లో ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావును కలిసి ఫోరం ఏర్పాటుపై చర్చించారు. ఆ తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సీపీఎం ఆఫీస్ లో ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో భేటీ అయ్యారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. నిరుద్యోగుల పక్షాన కొట్లాడటమే ‘టీ సేవ్ ఫోరం’ లక్ష్యమన్నారు. టీ సేవ్ ఫోరం అధ్యక్షుడిగాఉండాలని కోదండరాంను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు పోరాటం చేస్తే కేసీఅర్ అణచివేస్తున్నాడన్నారు.  

షర్మిలపై తమ్మినేని అసహనం  

సీపీఎం ఆఫీస్ లో తమ్మినేనితో పాటు ఆ పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతరాములు, జ్యోతితో షర్మిల భేటీ అయ్యారు. తర్వాత మీడియాతో షర్మిల, తమ్మినేని మాట్లాడారు. తమ్మినేని సమక్షంలోనే లెఫ్ట్ పార్టీలపై షర్మిల విమర్శలు చేశారు. దీంతో ఆమె వ్యాఖ్యలపై తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు. “మాకు విజ్ఞత ఉంది.. షర్మిల మాదిరిగా మేం మాట్లాడలేం. నిరుద్యోగుల విషయమై మాట్లాడేందుకు వస్తామంటే మర్యాదతో పిలిచాం. కానీ ఆమె తన మర్యాదను నిలబెట్టుకోలేదు’’ అని అన్నారు.

మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌‌కు మద్దతు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందేనని.. పార్టీల పరంగా ఎవరి కార్యాచరణ వాళ్లకు ఉంటుందన్నారు. అయితే, షర్మిల సీపీఎం ఆఫీసుకు వెళ్లి.. లెఫ్ట్ నేతలు పక్కన ఉన్నప్పటికీ కావాలనే ఈ కామెంట్స్ చేశారా? లేదంటే అలవాటులో పొరపాటుగా మాట్లాడారా? అన్నది సర్వత్రా చర్చనీయాంశం అయింది. 

బీజేపీ ఉంటే మేం రాలేం: కూనంనేని   

షర్మిల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆమె ప్రతిపాదనలపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీల పరంగా ఎవరి విధివిధానాలు వారికుంటాయన్నారు. అయితే.. నిరుద్యోగుల పట్ల ముందు నుంచి తమ పద్ధతిలో పోరాడుతూనే ఉన్నామన్నారు. అయితే, బీజేపీ ఉంటే కలిసి రావడం కుదరదని షర్మిలకు చెప్పామన్నారు. తమ పార్టీ విధానాలు బీజేపీకి వ్యతిరేకమన్నారు.  

పార్టీలో చర్చించాకే నిర్ణయం: కోదండరాం

‘టీ సేవ్ ఫోరం’లో భాగస్వామ్యం కావాలని షర్మిల తనను అడిగారని టీజేఎస్ చీఫ్ కోదండరాం అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిరుద్యోగుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. షర్మిల ప్రతిపాదనలపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.