బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయం

బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయం

హైదరాబాద్, వెలుగు:  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడంలో లెఫ్ట్ పార్టీలు కీలకంగా వ్యవహరించాయి. దీంతో భవిష్యత్​లోనూ వీరితో కలిసి పనిచేస్తామని అప్పట్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉండటంతో, ఇప్పుడు అందరి దృష్టి పొత్తులపై పడింది. రాష్ట్రంలో గతంతో పోలిస్తే సీపీఎం, సీపీఐ పార్టీ బలం తగ్గిపోయింది. అయినా, కొన్ని నియోజకవర్గాల్లో కొంతపట్టు ఉంది. 25 నియోజకవర్గాల్లో10 వేలకు పైగా ఓటుబ్యాంకు ఉన్నట్టు ఆయా పార్టీల నేతలు చెప్తున్నారు.

రానున్న ఎన్నికలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కావడంతో, ప్రతి ఓటు కీలకంగా మారింది. దీంతో బీఆర్ఎస్​ నేతలు.. సీపీఎం, సీపీఐతో పొత్తుకు ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఒకటి రెండు సీట్లు ఇచ్చి, పొత్తు పెట్టుకునే యోచనలో బీఆర్ఎస్ పెద్దలున్నారనే ప్రచారం జరుగుతుండగా..  సీపీఎం, సీపీఐ పార్టీలు మాత్రం తలో 9 సీట్లు అడగాలని భావిస్తున్నారు. చివరికి తలో 5 సీట్లకు అయినా పట్టు పట్టాలని యోచిస్తున్నారు. చివరికి ఒకటి రెండు తక్కువ ఇచ్చినా.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవాలని భావిస్తున్నారు. అయితే, సీపీఎం, సీపీఐ పార్టీల్లో ఆయా పార్టీల మధ్య గ్యాప్ రావొద్దని, ఇప్పటికే పలుమార్లు సమావేశమై చర్చించారు. దీంట్లో ఒక పార్టీ అడిగిన చోట, మరో పార్టీ అడగొద్దని.. ఆ మేరకు ఆయా పార్టీల నేతలు పట్టున్న సెగ్మెంట్లను ఎంపిక చేసుకున్నారు. వైరా, మధిర సెగ్మెంట్ల విషయంలో ఈ మేరకు ఒప్పదం జరిగినట్టు తెలిసింది.  

సీట్లు ఇవ్వకుంటే లెఫ్ట్ గానే పోటీ 

ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో లెఫ్ట్ పార్టీలకు కొంత బలం ఉంది. పాలేరు, భద్రాచలం, మిర్యాలగూడ సీట్లతో పాటు ఇబ్రహీంపట్నం, మధిర సీట్ల కోసం సీపీఎం పట్టుపడుతుండగా, కొత్తగూడెం, హుస్నాబాద్, వైరా, మునుగోడు తదితర సీట్లను సీపీఐ అడుగుతోంది. వీటిలో చెరో మూడు సీట్లు ఇచ్చినా.. పొత్తుకు సిద్ధంగానే లెఫ్ట్ పార్టీలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత చెరో ఒకటి, రెండు ఎమ్మెల్సీ స్థానాలను అడగాలని భావిస్తున్నారు. అయితే బీఆర్ఎస్​చెరో మూడు సీట్లు ఇవ్వకపోతే, బలమున్న చోట్ల పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే దీనిపై పలుమార్లు ఆయా పార్టీల ఉమ్మడి సమావేశాల్లో చర్చ జరిగింది. సీపీఎం, సీపీఐ తలో15 స్థానాలలో పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. ఒకవేళ ఎన్నికల సమయంలో బీజేపీకి ఆ పార్టీ లొంగిపోతే.. సీపీఎం, సీపీఐగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. అవసరమైతే అప్పుడు కాంగ్రెస్ తోనూ కలిసే అవకాశం ఉందని ఆ పార్టీల నేతలు చెప్తున్నారు.

 బరిలో ఇరు పార్టీల సెక్రటరీలు 

కమ్యూనిస్టు పార్టీల్లో స్టేట్ సెక్రటరీలు ఎన్నికల్లో పోటీ చేయొద్దనే నిబంధన ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ఆ పార్టీ కేంద్ర కమిటీల అనుమతితో బరిలోకి దిగొచ్చు. ప్రస్తుతం సీపీఎం, సీపీఐ స్టేట్ సెక్రటరీలిద్దరూ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలేరు నుంచి సీపీఎం స్టేట్ సెక్రటరీ తమ్మినేని వీరభద్రం, కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంట్లో భాగంగా ఆయా సెగ్మెంట్లలోనే ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉన్నా లేకున్నా.. ఆయా సీట్లలో మాత్రం వీరు పోటీ చేయడం తప్పనిసరి అని ఆయా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సీపీఐ మాజీ స్టేట్ సెక్రటరీ చాడ వెంకట్ రెడ్డి హుస్నాబాద్ నుంచి పోటీకి రెడీ అయ్యారు. సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మిర్యాలగూడలో పోటీ చేయనున్నారు. అయితే, ఎన్నికలకు ఇంకా ఆరు నెలల గడువు ఉండటంతో బీఆర్ఎస్, లెఫ్ట్ పొత్తుపై సందిగ్ధం కొనసాగుతోంది.