భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై గ్యాగ్ ఆర్డర్ల చట్టబద్ధత !

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై గ్యాగ్ ఆర్డర్ల చట్టబద్ధత !

భారత రాజ్యాంగ నిబంధనలు పౌరుల ప్రాథమిక హక్కులను, సమాజ ఉమ్మడి ప్రయోజనాలను సమతుల్యం చేసే బాధ్యతను న్యాయవ్యవస్థకు అప్పగించాయి. పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను, పత్రికా రంగానికి గల సమాచార హక్కును కాపాడటం ప్రజాస్వామ్య మనుగడకు అత్యంతావశ్యకం. ఇటీవలి కాలంలో వివిధ న్యాయస్థానాలు జారీ చేస్తున్న ముందస్తు సమాచార నిరోధక ఉత్తర్వులు.. అంటే గ్యాగ్ ఆర్డర్లు రాజ్యాంగ స్ఫూర్తిని సవాలు చేస్తున్నాయి.

రాజ్యాంగం భావప్రకటన స్వేచ్ఛను ఇచ్చినప్పటికీ అది అపరిమితమైనది కాదు. దేశ సార్వభౌమాధికారం, భద్రత, విదేశాలతో స్నేహసంబంధాలు, ప్రజాశాంతి, నైతికత, కోర్టు ధిక్కరణ, పరువు నష్టం వంటి సందర్భాలలో ఈ స్వేచ్ఛపై  ప్రభుత్వం లేదా న్యాయవ్యవస్థ 'సహేతుకమైన పరిమితులు' విధించవచ్చని ఆర్టికల్ 19(2) నిబంధన పేర్కొంటుంది.

ప్రజా ప్రాముఖ్యత కలిగిన సామాజిక విషయాలపై బహిరంగ చర్చలను నిరోధించడం  ప్రజాస్వామ్య పునాదులను  బలహీనపరుస్తుంది. బాధితుల హక్కుల రక్షణ పేరిట, నిందితుల పరువు ప్రతిష్టల రక్షణ పేరిట జారీచేసే ఇటువంటి రహస్య నిరోధక ఉత్తర్వులు సమాజ పారదర్శకతను దెబ్బతీస్తున్నాయి. న్యాయ ప్రక్రియ సజావుగా సాగడానికి అవసరమైన పరిమితులు విధించే అధికారం కోర్టులకు ఉన్నప్పటికీ, ముందస్తు సెన్సార్‌షిప్ తరహా ఆంక్షలు పౌర హక్కులను కాలరాస్తాయి.

గ్యాగ్ ఆర్డర్లు అంటే ?
న్యాయప్రక్రియలో  నిష్పక్షపాత  దర్యాప్తు  జరగడానికి,  వ్యక్తుల ప్రతిష్టకు కోలుకోలేని నష్టం కలగకుండా ఉండటానికి పౌరులు గ్యాగ్ ఆర్డర్లను కోరుతుంటారు. ప్రధానంగా ఉన్నత రాజకీయ స్థానాలలో ఉన్న నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రముఖ కార్పొరేట్ సంస్థలు తమపై వచ్చే ఆరోపణలను వార్తాపత్రికలు, సామాజిక మాధ్యమాలు ప్రసారం చేయకుండా ముందస్తుగా కోర్టులను ఆశ్రయించి ఈ నిషేధాన్ని అర్థిస్తారు. నిందితుడిపై ముందస్తు పక్షపాత వైఖరితో కూడిన ప్రచారం సాగితే, అది న్యాయవిచారణను ప్రభావితం చేస్తుందని న్యాయవాదులు వాదిస్తారు.

కోర్టు విచారణ పూర్తవకముందే మీడియా సమాంతర విచారణలు జరిపి తీర్పులు ఇవ్వడం వల్ల నిందితుడి జీవన హక్కు దెబ్బతింటుంది. దర్యాప్తు సంస్థల రహస్యాలను కాపాడటానికి,   సాక్షులను భయభ్రాంతులకు గురిచేయకుండా అడ్డుకోవడానికి దర్యాప్తు అధికారులు ఇటువంటి అభ్యర్థనలు చేస్తుంటారు.  వ్యక్తిగత  గోప్యత,  గౌరవప్రదమైన జీవనం సాగించే హక్కులను కాపాడుకోవడానికి  పౌరులు న్యాయస్థానాల రక్షణ కోరడం సహజమైన ప్రక్రియగా మారుతోంది.

న్యాయస్థానాల అనుమతి - రాజ్యాంగ పరిమితులు
న్యాయస్థానాలు ప్రతి సందర్భంలోనూ ఇటువంటి తీవ్రమైన ముందస్తు ఆంక్షలకు అనుమతులు మంజూరు చేయవు.  కేవలం అసాధారణ పరిస్థితుల్లో,  ప్రసారమయ్యే సమాచారం వల్ల న్యాయప్రక్రియ పూర్తిగా పక్కదారి పడుతుందని భావించినప్పుడే గ్యాగ్ ఆర్డర్లను వెలువరిస్తాయి. పరువు నష్టం దావాలలో ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నప్పుడు, తప్పుడు ప్రచారం వల్ల అపారమైన నష్టం జరుగుతుందని రుజువైనప్పుడు మాత్రమే పౌర న్యాయస్థానాలు తాత్కాలిక స్టే ఇస్తాయి.

క్రిమినల్ కేసులలో పారదర్శకత అత్యవసరమని భావిస్తూనే, దేశ భద్రత, మహిళలు, బాలల రక్షణకు సంబంధించిన సున్నితమైన కేసులలో బాధితుల గుర్తింపును దాచడానికి కోర్టులు ప్రసారాలను నిరోధిస్తాయి.  ప్రజా ప్రయోజనం కంటే వ్యక్తిగత రాజకీయ ప్రతిష్టను కాపాడుకునే స్వార్థపూరిత ప్రయత్నం ఎక్కువగా కనిపిస్తే న్యాయస్థానాలు ఈ అభ్యర్థనలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తాయి.  స్పష్టమైన సాక్ష్యాధారాలు, అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి ఉత్తర్వులు చట్టబద్ధత పొందుతాయి.

వివాదాలు
కర్నాటకలోని ధర్మ స్థల కేసులో కింది కోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్  తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సాగుతున్న దర్యాప్తుపై ఏకంగా ఎనిమిది వేల డిజిటల్ లింకులు, పాత వార్తా కథనాలను  తొలగించాలని సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును కర్నాటక హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.

ప్రజలు తెలుసుకునే సమాచార హక్కును ఇటువంటి ఉత్తర్వులు కాలరాస్తున్నాయని స్పష్టం చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆ గ్యాగ్ ఆర్డరును కొట్టివేసింది. ఇటువంటి ఆంక్షలు సమాజంలో అవినీతిని దాచే సాధనాలుగా మారుతున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తంచేసింది.

అలాగే కేంద్ర మంత్రి  కుమారుడికి సంబంధించిన వివాదాస్పద చట్టపరమైన కేసులో కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టులను తొలగించాలని, భవిష్యత్తులో వార్తలు ప్రసారం చేయరాదని హైదరాబాద్  సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేయడం పెద్ద చర్చకు దారితీసింది.

ఇటువంటి ఉత్తర్వులు ప్రజాబాహుళ్యంలో ఉన్న అధికార వ్యక్తుల బాధ్యతను,  ప్రజా పారదర్శకతను  ప్రశ్నించకుండా అడ్డుకునే ఆయుధాలుగా మారుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే సూత్రాన్ని ఇటువంటి ఉత్తర్వులు బలహీనపరుస్తున్నాయి.

రాజ్యాంగ రక్షణలు- కోర్టు తీర్పులు
భారత రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ పౌరులందరికీ వాక్ స్వాతంత్య్రాన్ని, భావప్రకటన స్వేచ్ఛను ప్రసాదించింది. పత్రికా స్వేచ్ఛ కూడా ఈ ప్రాథమిక హక్కులోనే అంతర్భాగంగా ఉందని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. అయితే 19(2) అధికరణ ద్వారా ఈ స్వేచ్ఛపై రీజనబుల్  రిస్ట్రిక్షన్స్ అంటే సహేతుకమైన పరిమితులు విధించే అధికారం న్యాయవ్యవస్థకు లభించింది.

సహారా వర్సెస్ సెబి కేసులో సుప్రీంకోర్టు నిష్పక్షపాత విచారణ కోసం తాత్కా లికంగా వార్తల ప్రసారాన్ని వాయిదా వేసే హక్కు కోర్టులకు ఉంటుందని పేర్కొంది. రాజ్యాంగ  నిబంధనలను  అతిక్రమించి ఇచ్చే ఏ గ్యాగ్ ఆర్డర్ అయినా చెల్లుబాటు కాదు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే చట్టవిరుద్ధ ఉత్తర్వులను ఉన్నత  న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు రద్దు చేస్తూనే ఉన్నాయి.

న్యాయ సమీక్ష
న్యాయ  సమీక్షాధికారం ద్వారా గ్యాగ్ ఆర్డర్ల దుర్వినియోగాన్ని అడ్డుకోవాల్సిన గురుతర బాధ్యత ఉన్నత న్యాయస్థానాలపై ఉంది. ముందస్తు సెన్సార్‌షిప్  తరహాలో జారీ చేసే గ్యాగ్ ఆర్డర్లు సమాజ ప్రగతిని నిరోధిస్తాయి, అవినీతికి రక్షణ కల్పిస్తాయి. భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాధ్యమవుతుంది.

న్యాయవ్యవస్థ తన విచక్షణ అధికారాలను ఉపయోగించి స్వేచ్ఛకు, సామాజిక బాధ్యతకు మధ్య  కచ్చితమైన  సమతుల్యతను  సాధించాలి.  గ్యాగ్ ఆర్డర్లు  కేవలం  అరుదైన  మినహాయింపులుగా  మాత్రమే ఉండాలి కానీ సాధారణ చట్టాలుగా మారకూడదు. పారదర్శకత, జవాబుదారీతనం ఉన్నప్పుడే న్యాయవ్యవస్థపై  ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది.

డా. కట్కూరి, న్యాయ నిపుణుడు, పాలసీ విశ్లేషకుడు