- 88 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో కన్నుమూత
- మైసూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస
- 20 భాషల్లో 48 వేలకుపైగా పాటలకు గాత్రం
- పుట్టింది ఏపీలో, పెరిగింది తెలంగాణలో..
- ‘దక్షిణ భారత నైటింగేల్’, ‘జానకి అమ్మ’గా ప్రసిద్ధి
- ఇయ్యాల మైసూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్న కర్నాటక ప్రభుత్వం.. దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, సినీ ప్రముఖుల సంతాపం
మైసూర్: దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో తన అమృత గాత్రంతో కోట్లాది మంది హృదయాలను రంజింపజేసిన ప్రముఖ నేపథ్య గాయని, గానకోకిల ఎస్. జానకి శనివారం ఉదయం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. మైసూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు ప్రకటించారు. ఎస్. జానకి వయసు 88 సంవత్సరాలు. నిన్న రాత్రి ఆమెకు శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మరణించారని ఎస్. జానకి మనవరాలు అప్సరా వైద్యుల వెల్లడించారు. ఎస్(శిష్ట్లా) జానకి 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పల్లపట్లలో జన్మించారు. ఆమెకు తెలంగాణతోనూ ప్రత్యేక అనుబంధం ఉంది.
ఆమె పుట్టింది ఏపీలో అయినా, పెరిగింది మాత్రం తెలంగాణలోనే. ఉద్యోగం కోసం తండ్రి సిరిసిల్లకు రావడంతో జానకి బాల్యం, విద్యాభ్యాసం ఇక్కడే సాగింది. బాల్యం నుంచే సంగీతం పట్ల ఆసక్తి ఉన్న ఆమె.. మూడేండ్ల వయసులోనే సినిమా పాటలను అనుకరిస్తూ ముద్దుముద్దుగా పాడేవారు. పదేండ్ల వయసులో నాదస్వర విద్యాంసుడు పైడిస్వామి వద్ద సంగీతంలో ప్రాథమిక శిక్షణ పొందారు. తర్వాత సినిమాల్లో పాడటం కోసం మద్రాస్ వెళ్లారు. ఎస్. జానకి1957లో తన 19వ ఏట ‘విధియిన్ విలయాట్టు’ అనే తమిళ చిత్రం ద్వారా గాయనిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు.
తన మధురమైన గాత్రంతో 48 వేల పాటలు పాడిన ఆమె ‘దక్షిణ భారత నైటింగేల్’గా ప్రసిద్ధి చెందారు. ఆమెను శిష్యులు, అభిమానులు ప్రేమగా ‘జానకి అమ్మ’ అని పిలుచుకునేవారు. 1997లో తన భర్త వి. రాంప్రసాద్ మరణించినప్పటి నుంచి కేవలం తెల్లటి చీరలు కట్టుకోవడం, సాధారణ వేషధారణలో ఉండటం అనుసరించారు. కాగా, ఆమె కుమారుడు మురళీకృష్ణ ఈ ఏడాది జనవరి 22న కన్నుమూశారు.
మైసూర్‌లో అంత్యక్రియలు
ఎస్. జానకి మృతిపై కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ‘ఎక్స్’ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘జానకి అమ్మ తన బంగారు స్వరంతో కోట్లాది మంది హృదయాలలో, ఇళ్లలో స్థానం సంపాదించుకున్నారు. ఈ బహుభాషా గాన దిగ్గజం మరణంతో సంగీత ప్రపంచం మూగబోయింది. ఎంతో మంది గాయకులను ప్రోత్సహించి, తీర్చిదిద్దిన గురువు, సరళత్వానికి నిలువెత్తు రూపమైన జానకి అమ్మ అసమాన స్వరం కర్నాటక సాంస్కృతిక వారసత్వంలో ఎప్పటికీ అమరంగా ఉంటుంది”అని డీకే కొనియాడారు. జానకి అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం తరఫున హాజరుకావాల్సిందిగా మంత్రి యతీంద్ర సిద్ధరామయ్యను నియమించారు. జానకి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం మైసూర్ లోని మహారాజా కాలేజీ మైదానంలో ఉంచనున్నట్లు యతీంద్ర సిద్ధరామయ్య తెలిపారు. తన అంతిమ సంస్కారాలు మైసూర్‌లోనే జరగాలని జానకి కోరుకున్నారని, కుటుంబసభ్యుల నిర్ణయం ప్రకారం మైసూర్ లోని కనియనహుండి గ్రామంలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు జరుగుతాయని, దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కాగా, జానకి మరణవార్త తెలియగానే మంత్రి యతీంద్ర సిద్ధరామయ్య, మాజీ ఎంపీ ప్రతాప్ సింహా, జేడీఎస్ ఎమ్మెల్యే జీటీ దేవేగౌడ సహా భారీ సంఖ్యలో అభిమానులు, ప్రజలు ఆసుపత్రికి చేరుకున్నారు.
ప్రముఖుల సంతాపం
ఎస్. జానకి మృతి పట్ల కర్నాటక సీఎం డీకేతోపాటు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, జోసెఫ్ విజయ్, వీడీ సతీశన్, తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. జానకి మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, ఇతర సినీ రంగ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దక్షిణాది భాషల్లో వేలాది పాటలు పాడిన ఆమె చిరకాలం చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు.
20 భాషల్లో 48 వేలకుపైగా పాటలు
ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో జానకి తన అద్భుత స్వర వైవిధ్యంతో కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం వంటి దక్షిణాది భాషలతో పాటు హిందీ, ఒడియా, తులు, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ సహా దాదాపు 20 భారతీయ భాషల్లో 48 వేలకు పైగా పాటలను పాడారు. ఇతర భాషల్లో ఎంత పాపులర్ అయినప్పటికీ, ఆమె తన కెరీర్‌లో అత్యధిక పాటలు కన్నడలోనే పాడారు. కర్నాటక అభిమానులు ఆమెను ‘గాన కోకిలె’ అని పిలుచుకునేవారు. ఆమె ఇంగ్లీష్, జపనీస్, జర్మన్, సింహళ భాషల్లోనూ పాడటం విశేషం. పీబీ శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ రాజ్‌కుమార్ వంటి దిగ్గజాలతో ఆమె పాడిన డ్యూయెట్లు ఎప్పటికీ నిలిచిపోయే హిట్ సాంగ్స్‌గా మారాయి.
మూగబోయిన మధుర స్వరం
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక స్వర్ణయుగానికి ముగింపు పలికింది. దక్షిణ భారత సినీ సంగీతానికి తన అపూర్వమైన గాత్రంతో చిరస్థాయిగా నిలిచిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో భారతీయ సంగీత ప్రపంచం ఒక అపూర్వ గానరత్నాన్ని కోల్పోయింది. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రయాణం కోట్లాది మంది హృదయాలను తాకింది. ప్రేమ, విరహం, భక్తి,
మాతృత్వం, విషాదం, ఉల్లాసం...
ఏ భావాన్నైనా తన గాత్రంలో పలికించి శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన మహాగాయని ఎస్. జానకి. పల్లెటూరి నుంచి సంగీత శిఖరాల వరకు ఎస్. జానకి పూర్తి పేరు శిష్ట్లా శ్రీరామమూర్తి జానకి. 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే సంగీతంపై అపారమైన ఆసక్తి ఉండేది. సాంప్రదాయ శాస్త్రీయ సంగీతంలో పూర్తి స్థాయి శిక్షణ పొందకపోయినా, సహజసిద్ధమైన గాత్రమే ఆమెకు గొప్ప బలం అయింది.
తెలంగాణతో అనుబంధం
ఎస్. జానకి పుట్టింది ఏపీలో అయినా పెరిగింది మొత్తం తెలంగాణలోనే. ఉద్యోగం కోసం తండ్రి సిరిసిల్లకు రావడంతో జానకి బాల్యం, విద్యాభ్యాసం మొత్తం ఇక్కడే సాగింది. చిన్నప్పటి నుంచే సంగీతం పట్ల జానకిలో ఆసక్తి మొదలైంది. మూడేళ్ల వయసులోనే సినిమా పాటలను అనుకరిస్తూ ముద్దుముద్దుగా పాడేవారు. తన పదేళ్ల వయసులో నాదస్వర విద్వాంసుడైన పైడిస్వామి వద్ద సంగీతంలో ప్రాథమిక శిక్షణ పొందారు. సినిమాల కోసం ఇరవై ఏళ్ల వయసులో మద్రాస్ పయనమయ్యారు.
17 భాషల్లో..
1957లో తమిళ చిత్రం 'విధియిన్ విలయట్టు' ద్వారా నేపథ్య గాయనిగా సినీ రంగంలో అడుగుపెట్టారు. అదే ఏడాది తెలుగులోనూ పాడారు. తెలుగులో ఆమె తొలి చిత్రం ‘ఎమ్మెల్యే’. తొలి అవకాశంతోనే సంగీత దర్శకుల దృష్టిని ఆకర్షించారు. దాంతో కెరీర్ ప్రారంభించిన తొలి ఏడాదే ఆరు భాషల్లో పాటలు పాడటం విశేషం.
అనంతరం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం మాత్రమే కాకుండా హిందీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ, తుళు, కొంకణి, సంస్కృతం సహా 17 భాషల్లో పాటలు పాడి అసాధారణ గాన ప్రతిభను చాటారు. ఇంగ్లీష్, జర్మనీ, సింహళీ భాషల్లోనూ ఆమె పాటలు పాడటం విశేషం.
చిన్నారైనా, పండు ముసలైనా..
1960ల నుంచి ఆమెకు బ్రీతింగ్ సమస్య మొదలైంది. పాడేటప్పుడు ఆయాసం ఇబ్బందిపెడుతున్నా లక్ష్యపెట్టకుండా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారామె. 1989లో వచ్చిన ‘మౌన పోరాటం’ చిత్రానికి ఆమె సంగీతం అందించారు. అలాగే ప్రైవేట్ సాంగ్స్‌ను ఆమె కంపోజ్ చేశారు. చందమామ రావే, జడ్జిమెంట్ లాంటి చిత్రాల్లో డబ్బింగ్ చెప్పారు. మూడేళ్ల చిన్నారి వయసుకు తగ్గట్టుగా పాడటమే కాదు.. మగ గొంతుతోనూ, పండు ముసలి గొంతుతోనూ పాటలు పాడి ఆమె మెప్పించారు.
ప్రతి పాట ఒక అద్భుతం
తెలుగులో ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.బి. శ్రీనివాస్, యేసుదాస్, పి.సుశీల వంటి దిగ్గజ గాయనీగాయకులతో కలిసి ఎన్నో చిరస్మరణీయ గీతాలను ఆలపించారు. నాదస్వరం, వయలిన్, ఫ్లూట్ లాంటి సంప్రదాయ వాయిద్యాలతో పాటు మోడ్రన్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో ఆమె గాత్రం పోటీపడేది. ఆమె పాడిన పాటల్లో ఎన్నో ఇప్పటికీ సంగీత ప్రియుల పెదవులపై వినిపిస్తూనే ఉంటాయి. ప్రేమగీతాలు, జానపదాలు, భక్తి గీతాలు, విషాద గీతాలు, పిల్లల పాటలు... ఏ ప్రక్రియలోనైనా ఆమె తనదైన ముద్ర వేశారు.
సంగీత దర్శకుల అభిమాన గాయని
ఎస్.రాజేశ్వరరావు, పెండ్యాల, కె.వి. మహదేవన్, ఎం.ఎస్. విశ్వనాథన్, చక్రవర్తి, ఇళయరాజా, రాజ్-కోటి, ఎ.ఆర్. రెహమాన్, ఎం.ఎం. కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్, ఎస్.ఎ.రాజశేఖర్ వంటి పలువురు ప్రముఖ సంగీత దర్శకుల స్వరాలకు ఆమె గాత్రం అపూర్వమైన అందాన్ని తీసుకొచ్చింది. ప్రత్యేకించి ఇళయరాజా స్వరకల్పనల్లో ఎస్. జానకి గాత్రం ఒక ప్రత్యేక మాధుర్యాన్ని సంతరించుకుంది. ఆమె గాత్రంతో ఇళయరాజా ఎన్నో ప్రయోగాలు చేశారు. దక్షిణ భారత సినీ సంగీత స్వర్ణయుగంలో ఈ ఇద్దరి కలయిక ఎన్నో చిరస్మరణీయ గీతాలకు కారణమైంది.
జాతీయ స్థాయిలో గుర్తింపు
ఎస్. జానకి తన సంగీత జీవితంలో నాలుగు జాతీయ ఉత్తమ నేపథ్య గాయని పురస్కారాలు అందుకున్నారు. అలాగే పది నంది అవార్డులు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక పురస్కారాలు, 33కు పైగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. అనేక విశ్వవిద్యాలయాలు ఆమెకు గౌరవ డాక్టరేట్లు కూడా ప్రదానం చేశాయి.
పద్మభూషణ్‌ను ఎందుకు తిరస్కరించారు?
2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని ఎస్. జానకి మర్యాదపూర్వకంగా తిరస్కరించారు. తనకు ఈ గౌరవం చాలా ఆలస్యంగా లభించిందని, దక్షిణ భారత కళాకారులకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆమె బహిరంగంగానే అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యక్తిగత గౌరవం కంటే కళాకారుల గౌరవమే ముఖ్యమని చెప్పిన ఆమె నిర్ణయం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సంగీతానికి వీడ్కోలు
2017లో మైసూరులో జరిగిన ఒక సంగీత కార్యక్రమం తర్వాత ఇకపై వేదికలపై పాటలు పాడబోనని ప్రకటించారు. అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ తన సంగీత ప్రయాణానికి ముగింపు పలికారు.
వ్యక్తిగత జీవితంలో విషాదం
ఎస్. జానకి ఎప్పుడూ తన కుటుంబ జీవితాన్ని ప్రచారానికి దూరంగా ఉంచారు. ఆమె భర్త రాంప్రసాద్ కూడా మీడియాకు చాలా అరుదుగానే కనిపించేవారు. జానకి తన ఇంటర్వ్యూలలో, తన సంగీత ప్రస్థానం విజయవంతం కావడంలో భర్త ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో కీలకమని పలుమార్లు పేర్కొన్నారు. 1959లో వీరి వివాహం జరిగింది. నుదుటన పెద్ద బొట్టు, సంప్రదాయ చీరకట్టుతో ఎంతో హుందాగా కనిపించేవారామె.
1997లో భర్త మరణం తర్వాత తెల్ల చీర, నుదుట విభూతిని కొనసాగించారు. జీవిత చరమాంకంలో ఎస్. జానకి తీవ్ర వ్యక్తిగత విషాదాన్ని కూడా ఎదుర్కొన్నారు. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ ఈ ఏడాది జనవరిలో ఆకస్మికంగా మరణించడం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. ఆ దుఃఖం నుంచి పూర్తిగా కోలుకోకముందే ఆమె కూడా కన్నుమూశారు.
భారతీయ సంగీతానికి తీరని లోటు
ఎస్. జానకి మరణం ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదు. ఒక సంగీత యుగానికి ముగింపు. ఆమె గాత్రంలో భావాలు పలికాయి. ఆమె పాటల్లో జీవితం వినిపించింది. ఎన్నో తరాల ప్రేమకు, బాధకు, ఆనందానికి, భక్తికి ఆమె స్వరం నేపథ్య సంగీతమైంది. ఈరోజు ఆమె శరీరంగా మన మధ్య లేకపోయినా, ఆమె ఆలపించిన వేలాది పాటలు తరతరాల పాటు భారతీయ సంగీత సంపదగా నిలిచిపోతాయి. ‘‘గానం ఆగిపోయినా... ఆ గాత్రం ఎన్నటికీ మూగబోదు”.
ఎస్.జానకి పాడిన మధుర గీతాల్లో కొన్ని..
నీ లీల పాడెద దేవా (మురిపించే మువ్వలు), పగలే వెన్నెల (పూజాఫలం), గున్నమామిడి కొమ్మపైన (బాల మిత్రుల కథ), ఏ దివిలో విరిసిన (కన్నె వయసులు) సిరిమల్లె పూవా (పదహారేళ్ల వయసు), కన్నెపిల్లవని కన్నులున్నవని (ఆకలి రాజ్యం), తొలిసారి మిమ్మల్ని చూసింది, మనసా తుళ్లి పడకే (శ్రీవారికి ప్రేమలేఖ), శివపూజకు చిగురించిన సిరిసిరి మువ్వ (స్వర్ణ కమలం), ఏ తీగ పువ్వునో (మరో చరిత్ర), గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన (సప్తపది), వెన్నెల్లో గోదారి అందం (సితార), వేణువై వచ్చాను భువనానికి (మాతృదేవోభవ), మంచు కురిసే వేళలో, అరె ఏమైందీ.. (అభినందన), బంతి చామంతి (అభిలాష), ఓం నమశివాయ, మౌనమేలనోయి (సాగర సంగమం), ప్రియతమా నా హృదయమా (ప్రేమ), ఈ దుర్యోధన దుశ్శాసన (ప్రతిఘటన), మాటే మంత్రము (సీతాకోక చిలుక), సుందరి నీవే (దళపతి) ముద్దుగారే యశోద (పడమటి సంధ్యారాగం), ఆకాశం ఏనాటిదో (నిరీక్షణ), నీ ఇల్లు బంగారం కాను (గజదొంగ), కోడి కూయక ముందే (చీమలదండు), మహా కనకదుర్గ (దేవుళ్లు), అమ్మా అని పిలిచిపిలిచి (సింహ రాశి), ఎంతెంత దయనీది ఓ సాయి (శ్రీ సాయి మహిమ).
50 వేలకుపైగా పాటలు
ఎస్. జానకి తన సుదీర్ఘ సంగీత జీవితంలో సుమారు 50 వేలకుపైగా పాటలు ఆలపించారు. భారతీయ సినీ సంగీత చరిత్రలో అత్యధిక పాటలు పాడిన గాయనిలలో ఆమె ఒకరు. ప్రతి సంగీత దర్శకుడి శైలికి, ప్రతి భాష ఉచ్ఛారణకు, ప్రతి నటీమణి భావవ్యక్తీకరణకు తగ్గట్టుగా తన గాత్రాన్ని మార్చుకోవడం ఆమె ప్రత్యేకత. తెరపై కనిపించే పాత్ర వయసు, అమాయకత్వం, బాధ, ప్రేమ, కోపం... ఏ భావమైనా తన గొంతుతోనే వినిపించగలిగే అసాధారణ ప్రతిభ ఆమె సొంతం. అందుకే ఆమెను చాలామంది సంగీత విమర్శకులు ‘ద క్వీన్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అండ్ మాడ్యులేషన్’ గా పిలిచేవారు.
చివరిగా పాడిన పాట
ఎస్. జానకి సినీ గాన జీవితంలో చివరిగా అధికారికంగా రికార్డ్ చేసిన పాట మలయాళ చిత్రం ‘10 కల్పనకల్’లోని ‘అమ్మా పూవినమ్’ అనే జోల పాట. ఈ పాటకు మిథున్ ఈశ్వర్ సంగీతం అందించారు. 2016లో జానకి స్వయంగా ఇదే తన చివరి రికార్డింగ్ అని ప్రకటించారు. దాదాపు 60 ఏళ్లకు పైగా సాగిన ఆమె గాన ప్రస్థానానికి ఇది ముగింపు పాటగా నిలిచింది. అలాగే 2017లో మైసూరులో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో ప్రజల ముందర ఆమె చివరిసారిగా సంగీత కచేరీలో పాడారు.
