గెట్ అవుట్!..మండలిలో బీఆర్ఎస్ సభ్యులపై చైర్మన్ గుత్తా సీరియస్

గెట్ అవుట్!..మండలిలో బీఆర్ఎస్ సభ్యులపై చైర్మన్ గుత్తా సీరియస్
  • మైనింగ్ పై చర్చలో రచ్చ!
  •     మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి
  •     హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన
  •     కాగితాలు, బడ్జెట్ ప్రతులను చించి మండలి చైర్మన్ వైపు విసిరిన సభ్యులు
  •     11 మంది బీఆర్ఎస్ ​సభ్యుల సస్పెన్షన్​

హైదరాబాద్, వెలుగు: శాసనమండలి వేదికగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మైనింగ్ వ్యవహారంపై కౌన్సిల్​లో రచ్చ జరిగింది. మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన ‘రాఘవ కన్‌‌స్ట్రక్షన్స్’ వ్యవహారంపై  ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ఆందోళనకు దిగారు. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి.. అక్రమాలకు బాధ్యత వహించాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. మంత్రిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన పదవిలో కొనసాగే నైతిక అర్హత కోల్పోయారని మండిపడ్డారు. 

మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో మండలి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోమవారం శాసనమండలి ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఇదేమీ రాజ్యం, ఇదేమీ రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం అంటూ నినాదాలు చేశారు. కాగితాలు, బడ్జెట్ ప్రతులను చించి చైర్మన్ చైర్ వైపు విసిరారు. పోడియం వైపు దూసుకెళ్తున్న ఎమ్మెల్సీలను మార్షల్స్ పలుమార్లు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. 

సీట్లపైకి ఎక్కి నిరసన..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ కుమార్ ఏకంగా సభ్యులు కూర్చునే సీట్లపైకి ఎక్కి నిరసన తెలిపారు. సభ్యులు వెళ్లి తమ సీట్లలో కూర్చోవాలని పదే పదే చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విజ్ఞప్తి చేసినా వారు వెనక్కి వెళ్లలేదు. చైర్మన్ వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో గెట్​అవుట్ అంటూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీలాంటి వారు సభకు రావడం సరికాదని, ఇది పెద్దల సభ అని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. సభ గౌరవం కాపాడాలన్నారు. గతంలో ఎన్నడూ మండలిలో సభ్యులను సస్పెండ్ చేయలేదని, ఆ పరిస్థితిని కల్పించొద్దని విజ్ఞప్తి చేశారు. 

అయినా.. చప్పట్లు కొడుతూ.. నినాదాలు చేస్తూ ఎంతసేపటికి బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో సభ్యుల తీరు సరైంది కాదని, వారిని సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు తీర్మానం ప్రవేశపెట్టగా.. మండలి బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనా చారి, తాతా మధు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నవీన్ కుమార్, వంటేర్ యాదవ రెడ్డి, శంబీపూర్ రాజు, దేశపతి శ్రీనివాస్, ఎల్. రమణ, కోటి రెడ్డి, వాణీ దేవిని సోమవారం సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. సస్పెండ్ చేసినా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వెళ్లకపోవడంతో గౌరవ సభ్యులను గౌరవప్రదంగా బయటకు పంపించాలని అక్కడి అధికారులను చైర్మన్ సూచించడంతో మార్షల్స్ వారిని ఎత్తుకెళ్లి బయటకు పంపించారు.

కౌన్సిల్​ బయట బీఆర్​ఎస్​ సభ్యుల ఆందోళన

కౌన్సిల్​బయట బీఆర్ఎస్​సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలపడాన్ని మార్షల్స్ అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్లకార్డులను వెనక్కి తీసుకోవాలని మార్షల్స్ పదే పదే కోరినప్పటికీ, బీఆర్ఎస్ సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో మార్షల్స్, ఎమ్మెల్సీల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం మార్షల్స్‌‌ను అడ్డం పెట్టుకుంటోందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం మీడియాతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మాట్లాడుతూ... ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వస్తున్న ఆరోపణల విషయంలో ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. తనపై వస్తున్న ఆరోపణలకు నైతిక బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.