రెండు రూముల్లో..వంద మందికి పాఠాల.. ఎల్​బీనగర్ హస్తినాపురం ప్రైమరీ స్కూల్ దుస్థితి

రెండు రూముల్లో..వంద మందికి పాఠాల.. ఎల్​బీనగర్ హస్తినాపురం ప్రైమరీ స్కూల్ దుస్థితి

ఎల్ బీనగర్, వెలుగు:‘మన ఊరు – మన బడి’లో భాగంగా గవర్నమెంట్​స్కూళ్లను కార్పొరేట్​కు దీటుగా తయారు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ క్లాస్ ​రూములు నిర్మిస్తున్నామని, టాయిలెట్స్, వంట గది, మంచినీటి సదుపాయాలు కల్పిస్తున్నామని అంటున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఎల్​బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం వెంకటేశ్వరకాలనీ ప్రైమరీ స్కూల్ స్థానిక కమ్యూనిటీ హాల్​బిల్డింగ్​లో కొనసాగుతుండగా, ప్రస్తుతం100 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. ఒకటో తరగతిలో 30 మంది, రెండులో 25, మూడులో​17,  నాలుగులో 15, ఐదో తరగతిలో 13 మంది చిన్నారులు ఉన్నారు. వీరి కోసం నలుగురు టీచర్లు పనిచేస్తున్నారు.

అయితే ఇంత మందికి కలిపి క్లాస్​రూములు రెండే ఉన్నాయి. 1 నుంచి 3 తరగతులను గ్రౌండ్​ ఫ్లోర్ ​రూమ్​లో, 4, 5 తరగతులను పై ఫ్లోర్​లో ఉన్న రూమ్ లో కొనసాగిస్తున్నారు. గ్రౌండ్​ ఫ్లోర్​ రూమే.. స్టాఫ్ రూమ్​కూడా. ఇరుకు గదుల్లోనే టీచర్లు 100 మంది చిన్నారులకు పాఠాలు చెబుతున్నారు. అందరినీ ఒకేచోట కూర్చోబెట్టడంతో టీచర్లు చెప్పేది పిల్లలకు అర్థం కావడం లేదు. కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేకపోవడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి స్కూల్​ను మరో చోటుకు మార్చాలని, సపరేట్​క్లాస్​రూమ్ లు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. వేలకు వేలు ఫీజులు కట్టలేక తమ పిల్లలను సర్కార్​బడికి పంపిస్తున్నామని, అధికారులు పట్టించుకోకపోతే ఎలా అని వాపోతున్నారు. కమ్యూనిటీ హాల్ కు వచ్చిపోయేవారితో పిల్లలు డిస్ట్రబ్​అవుతున్నారని
చెబుతున్నారు.