సమన్వయంతో పనిచేస్తూ కొమురవెల్లి జాతర సక్సెస్​ చేయాలె : కొండా సురేఖ

సమన్వయంతో పనిచేస్తూ కొమురవెల్లి జాతర సక్సెస్​ చేయాలె : కొండా సురేఖ
  •     క్లీన్​ కొమురెల్లిగా చేద్దాం
  •     భక్తులకు అసౌకర్యం కలిగించొద్దు
  •     దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
  •     ప్రొటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే పల్లా ఆగ్రహం

కొండపాక, వెలుగు: కొమురవెల్లి మల్లన్న జాతర ఉత్సవాలను అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సక్సెస్​ చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. శనివారం సాయంత్రం ఆమె కొండపాక మండలం నాగుల బండ వద్ద గల మినర్వా హరిత హోటల్లో మల్లన్న జాతర ఉత్సవాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది మల్లన్న జాతర ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు. 

ఎక్కడా ప్లాస్టిక్, చెత్తాచెదారం లేకుండా చర్యలు తీసుకోవాలని క్లీన్ కొమురవెల్లి లక్ష్యంగా పనిచేయాలన్నారు. జాతర రోజుల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రద్దీ ఎక్కువగా ఉంటే బస్సుల సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొండపైకి వికలాంగులు, గర్భిణులు వెళ్లడానికి బ్యాటరీ రిక్షాలను,  జాతరలో తప్పిపోయిన వారికోసం ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు. 

జాతర జరిగినన్ని రోజులు 108 వెహికల్ అందుబాటులో ఉంచాలని ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రొటోకాల్​ పాటించలేదని ఎమ్మెల్యే ఆగ్రహం

కొమురవెల్లి మల్లన్న జాతర ఉత్సవాల సమావేశంలో ప్రొటోకాల్​ పాటించలేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై గెలిచిన ఎమ్మెల్యే కాకుండా కాంగ్రెస్​ నాయకులు ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. ఈ విషయంపై మంత్రి కొండా సురేఖతో వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంప్రదాయాలకు విరుద్ధంగా స్థానిక ప్రజాప్రతినిధులు లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని, దేవుడితో రాజకీయం ఏంటని ఎమ్మెల్యే పల్లా ప్రశ్నించారు. నిరసనగా సమావేశాన్ని బహిష్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.