
- కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్‌కు కీలక స్థానం ఇస్తామని హామీ
- కలిసి పని చేసేందుకు అంగీకరించిన టీజేఎస్ చీఫ్
- నిరంకుశ పాలనను ఓడించడానికి ఉమ్మడిగా పోరాడుతామని ప్రకటన
- కేసీఆర్, కేటీఆర్ అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని రేవంత్ ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: ఇప్పుడున్న పరిస్థితుల్లో టీజేఎస్‌కు టికెట్లు కేటాయించలేమని ఆ పార్టీ చీఫ్ కోదండరాంకు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. టీజేఎస్‌కు టికెట్లు ఇస్తే అధికార పార్టీ అభ్యర్థులతో పోటీ పడలేరని చెప్పారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. కోదండరాంకు రాజ్యసభ ఎంపీ పదవిని ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలిసింది.
కేసీఆర్ నిరంకుశ పాలనను ఓడించడానికి కలిసి పని చేయాలని నిర్ణయించామని, కాంగ్రెస్‌కు తమ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా కోదండరాం వెల్లడించారు. సోమవారం ఈ మేరకు టీజేఎస్ కార్యాలయంలో కోదండరాం, పీఎల్ విశ్వేశ్వరరావు, భైరి రమేశ్, నిజ్జన రమేశ్, సర్దార్ వినోద్ కుమార్ తదితర నేతలతో ఠాక్రే, రేవంత్ రెడ్డి, కర్నాటక మంత్రి బోసురాజు గంట న్నర పాటు భేటీ అయ్యారు. తర్వాత రేవంత్, ఠాక్రే, కోదండరాం మీడియాతో మాట్లాడారు.
కోదండరాం సహకారం అవసరం: రేవంత్
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కోదండరాంను కోరేందుకు వచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కుటుంబం నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించేందుకు కలసి పని చేద్దామని అడిగామని అన్నారు. ఎన్నికల్లో టికెట్ల అంశంపై వాళ్లు చేసిన ప్రతిపాదనలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ‘‘ప్రజలకు కోదండరాంపై విశ్వాసం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పదేండ్లుగా ఆయన పోరాటం చేస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. ప్రజల పక్షాన నిలబడ్డారు. తెలంగాణకు పట్టిన పీడ వదలాలంటే కోదండరాం సహకారం అవసరం” అని చెప్పారు. ఎన్నికల క్షేత్రంలో టీజేఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రచారంలో జాతీయ నేతలతో కలిసి కోదండరాం ప్రచారం చేస్తారని తెలిపారు. ‘‘డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ అధికారం చేపడుతుంది. మా ప్రభుత్వంలో టీజేఎస్‌కు కీలక స్థానం ఇస్తాం” అని చెప్పారు. భవిష్యత్‌లో సమన్వయ కమిటీని నియమించుకుని ముందుకెళ్తామని, ప్రభుత్వంలో టీజేఎస్ భాగస్వామి అయ్యేలా కమిటీ పని చేస్తుందని తెలిపారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు అండగా ఉంటామని కోదండరాం హామీ ఇచ్చారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. సీట్లు, ఓట్లు కంటే.. ఒక గొప్ప లక్ష్యం కోసం కలిసి పనిచేస్తున్నామన్నారు. ఒక నియంతను గద్దె దించి ప్రజా పాలన తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
ఫోన్లు ట్యాప్ చేస్తున్నరు
తమ ఫోన్‌లను ట్యాప్ చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్‌ను నియంత్రించాలని కేటీఆర్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. ‘‘అందరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకున్నారు. హ్యాకర్స్ ద్వారా మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. మాకు సహకరించాలని అనుకున్న వారిని బెదిరిస్తున్నారు. మా బంధువులు, మిత్రులను భయపెడుతున్నారు. మేము ఫోన్‌లో ప్రైవేటుగా మాట్లాడుకున్న సంభాషణలను హ్యాక్ చేసి వింటున్నారు. ఈ పద్ధతి మంచిది కాదు” అని అన్నారు. తాము అధికారంలోకి రాగానే.. కేసీఆర్ సైన్యంలో పని చేస్తున్న అధికారులపై విచారణ చేస్తామని హెచ్చ రించారు. దుగ్యాల ప్రదీప్ రావు, ప్రభాకర్ రావు, వేణు గోపాల్ రావు, నర్సింగ్ రావులతో కేసీఆర్ ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేశారని, టెలిఫోన్ ట్యాపింగ్ చేసే వారిని నియమించుకున్నారని ఆరోపించారు. ప్రజలు వాళ్లను బండకు కొడతారన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు తలుచుకుంటే కేసీఆర్‌ను గద్దె దించటం ఖాయమని చెప్పారు.
లెఫ్ట్ పార్టీలతో పొత్తుపై దాటవేత
లెఫ్ట్ పార్టీలకు సీట్లు ఇస్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. రేవంత్ రెడ్డి సమాధానం దాటవేశారు. ‘‘ఎలా చేస్తే బాగుంటదో చెప్పండి. మీ సలహాను పరిగణనలోకి తీసుకుంటాం” అంటూ మీడియా ప్రతినిధితో అన్నారు.
కలిసి పోరాడుతం: కోదండరాం
అన్ని అంశాలను రేవంత్, ఠాక్రే దృష్టికి తీసుకెళ్లామని కోదండరాం తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలనను ఓడించడానికి కలిసి పని చేయాలని నిర్ణయించామని చెప్పారు. కాంగ్రెస్‌కు తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని వెల్లడించారు. ‘‘భవిష్యత్‌లో కూడా ఉమ్మడిగా పోరాడుతాం. కొన్ని అంశాలు, రాష్ట్ర ప్రజల సమస్యలు వారి దృష్టికి తెసుకెళ్లాం. వాళ్లు అంగీకరించారు. నవ తెలంగాణ నిర్మాణంలో మా భాగస్వామ్యం ఉంటుంది. సమన్వయ కమిటీని త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. మాకు మద్దతు తెలపాలని ఉద్యమ కారులను, నిరుద్యోగులను కోరుతున్నాం” అని కోదండరాం పిలుపునిచ్చారు. ‘‘అందరికి ఉచిత విద్య అందించాలి. ఏటా ఖాళీ అవుతున్న ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్‌తో ప్రకటించి భర్తీ చేయాలి. చిన్న, కుటీర, సూక్ష్మ పరిశ్రమల ఎదుగుదలకు చర్యలు తీసుకోవాలి. చిన్న, సన్నకారు, కౌలు రైతులకు ఆదాయ మార్గం కల్పించాలి. ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అమరుల కుటుంబాలను ఆదుకోవాలి” అని కోరామని తెలిపారు.