ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుంచి ఫొటోలు, స్టోరీలు, రీల్స్.. అంటూ తెగ వాడేస్తున్నారు యూత్. వాళ్లకేం తక్కువ కాదంటున్నారు బామ్మాతాతలు. టెక్నాలజీ వాడడం కూడా వాళ్ల తరువాతే అన్నట్టు మారిపోయింది ఇప్పుడు సీన్. యూత్‌కి పోటీగా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ తక్కువ టైంలోనే ఎక్కువ మంది ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నారు. వాళ్ల ఇన్స్టాగ్రామ్ స్టోరీలే ఇవి...
మదర్ విత్ సైన్ మెసేజెస్
పూ నమ్ సప్ర వయసు 66 ఏండ్లు. ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీ. ఆమె సక్సెస్ వెనక ఉన్నది ఎవరో కాదు.. ఆమె కొడుకు ప్రణవ్ సప్ర. వాళ్లమ్మను సోషల్ మీడియాకి పరిచయం చేయడానికి కారణం ఏంటని అడిగితే.. ‘చిన్నప్పుడు మా అమ్మ నాకు అలా చేయొద్దు. ఇలా మాట్లాడొద్దు.. అని ఎన్నో మంచి విషయాలు నేర్పించేది. అయితే, అవి చుట్టు పక్కల వాళ్లకి చెప్తే ఎవరూ వినరు కదా. అందుకని ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే అందరూ చూస్తారు. కొందరైనా పాటిస్తారు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశా.
కాకపోతే వెరైటీ కోసం మాటలతో కాకుండా, ప్లకార్డుల మీద రాసి, చూపించాలి అనుకున్నా. అలాగైతే ప్రజలకి ఇంట్రెస్ట్ కల్పించొచ్చు’ అనే ఆలోచనతో ‘మదర్ విత్ సైన్’ ఇన్స్టాగ్రామ్ పేజీ క్రియేట్ చేశా. ఇదే విషయాన్ని మొదట మా అమ్మతో చెప్పా. నేను కార్డు బోర్డ్ షీట్ మీద మంచి మాటలు రాసిస్తా. దాన్ని నువ్వు పట్టుకో చాలు. అలా ఒక ఇన్‌స్టా పేజీ పెడదాం’ అన్నా. అది వినగానే అమ్మ ‘ఎందుకు?’ అని అడిగింది. దానికి కొడుకు, ‘సరదాగా మంచి విషయాలు చెప్పడంలో తప్పేముంది?’ అంది పూనమ్. అలా మొదలైన ఇన్స్టాగ్రామ్ పేజీకి ప్రస్తుతం ఒక లక్షా 56 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
మిస్టర్ అండ్ మిసెస్ వర్మ కపుల్
ఆయనకు 83, ఆమెకి 76 ఏండ్లు. సోషల్ మీడియాలో వీడియో పెట్టారంటే, లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్, వందల్లో కామెంట్స్. ఇప్పటికే పాతికవేలకు పైగా ఫాలోవర్లతో ‘సూపర్బ్!’ అనిపిస్తున్నారు ఈ సీనియర్ సిటిజెన్లు. వాళ్లే.. హర్యానాకు చెందిన భార్యాభర్తలు శాంత వర్మ, యశ్పాల్ సింగ్. ఈ వయసులో వాళ్లు చేసే అల్లరి చూస్తుంటే ముచ్చటేస్తుంది ఎవరికైనా. అంతేకాదు, వాళ్లని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అవుతున్నారు కూడా. ఇంట్లో ఉన్న ముసలివాళ్లను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనంతటికి కారణం.. వీళ్ల మనవరాలు జోనిత. 2020, ఏప్రిల్‌లో తాతయ్య వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాలనే ఆలోచనతో ‘గ్యాంగ్స్టా గ్రాండ్‌పా’ అనే అకౌంట్ ఓపెన్ చేసింది. అందులో వాళ్ల అమ్మమ్మ మాటలకు తాతయ్య రియాక్షన్స్ పెట్టేది. అప్పుడు వాళ్ల తాతయ్య మాత్రమే కనిపించేవాడు వీడియోలో. కానీ, ఆ తర్వాత నెటిజన్ల రెస్పాన్స్ చూసి అమ్మమ్మని కూడా కెమెరాలో చూపించాలనుకుందట. అంతే.. అకౌంట్ పేరుని ‘మిస్టర్ అండ్ మిసెస్ వర్మ’గా మార్చింది. అందులో ఫ్యాషన్, స్టైలిష్ బట్టలు వేసుకుని, బెస్ట్ కపుల్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు వీడియోల్లో చూపించేది. అలా ఇప్పుడు ఈ ఓల్డ్, క్యూట్ కపుల్ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం వీళ్ల చానెల్‌కి 69.4వేల ఫాలోవర్స్ ఉన్నారు.
గ్రీన్ యాపిల్ పికిల్‌తో మొదలు
శాం తి రామచంద్రన్, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయి. ఆమె వయసు ప్రస్తుతం 57ఏండ్లు. తమిళనాడుకి చెందిన శాంతికి చదువుకునే రోజుల నుంచి వంట చేయడం అలవాటు. ఇష్టం కూడా. కాలేజీకి వెళ్లే రోజుల్లో పార్ట్ టైం జాబ్ చేస్తూనే ఇంట్లో పనులు చేసేది. ఆ తర్వాత బ్యాంక్‌లో జాబ్ చేస్తూనే ఇంటిని చూసుకునేది. అయితే, శాంతికి వంట చేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ గురించి ఆమె కూతురికి బాగా తెలుసు. దాంతో ఆమె కూతురు, ఇన్స్టాగ్రామ్ పేజీ క్రియేట్ చేసి ఇచ్చింది. అందులో ‘గ్రీన్ యాపిల్ పికిల్’ అనే రెసిపీ పోస్ట్ చేయడంతో మొదలుపెట్టింది. అప్పటి నుంచి డైలీ వంటలు చేసి అప్లోడ్ చేసేది. ఉదయం వంట చేసేటప్పుడు, ఫొటోలు తీసుకునేది. జాబ్కెళ్లి, తిరిగి ఇంటికొచ్చాక రాత్రి వాటిని పోస్ట్ చేసేది. అయితే, రీసెంట్గా ఆమె రిటైర్ అయింది. దాంతో ఫుల్ టైం వీడియోలకే కేటాయిస్తోంది. అందరికీ ఉపయోగపడేలా కొత్తకొత్త టిప్స్ చెప్తోంది. వంటలో వాడే ఇంగ్రెడియెంట్స్లో పర్టిక్యులర్‌గా ఉండే శాంతి, నార్త్, సౌత్ ఇండియన్ వంటలు బాగా చేస్తుంది. ప్రస్తుతం ఆమె పేజీకి 55 వేలమంది ఫాలోవర్స్ ఉన్నారు.
బొమ్మల బామ్మ
హీరోయిన్ సమీరా రెడ్డి అత్త పేరు వర్దే. ఈమె వయసు 67 ఏండ్లు. అప్పుడప్పుడు కోడలు సమీరా ఇన్స్టాగ్రామ్ వీడియోల్లో కనిపించేది. వర్దే ఒక ఆర్టిస్ట్. కాలేజీ చదువు అయిపోయాక పెండ్లి, 27 ఏండ్లకు ఇద్దరు పిల్లల తల్లి అయింది. అప్పటికీ ఆమె పెయింటింగ్స్ వేస్తూనే ఉండేది. 35 ఏండ్ల వయసులో ఆమె వేసిన పెయింటింగ్స్ అన్నీ మొదటిసారి ఎగ్జిబిషన్‌కి పెట్టింది. అలా సాగుతున్న ఆమె లైఫ్‌లో ఒక్కసారిగా కుదుపు. కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోవాల్సి వచ్చింది. పిల్లలు భర్త దగ్గరే ఉన్నారు. ఎందుకంటే వాళ్లను పెంచడానికి వర్దే దగ్గర డబ్బుల్లేవు. అప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ‘డబ్బుల గురించి ఎవరి మీదా ఆధారపడకూడదు. నాకంటూ సొంత సంపాదన ఉండాలి’ అని. దాంతో మళ్లీ పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టింది. మొదట్లో ఎవరూ కొనలేదు. కానీ, ఒకసారి కొనడం మొదలయ్యాక ఆమె తిరిగి చూసుకోలేదు. సమీరాని వర్దే కొడుకు పెండ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లతోనే ఉంటుంది వర్దే. ఇప్పటికీ పెయింటింగ్స్ వేస్తోంది. వాటిని ‘మంజ్రీ వర్దే’ పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ, ఎగ్జిబిషన్స్ పెడుతూ చాలా ఫేమస్ అయింది. ఇప్పటికే లక్షా 39 వేల మంది ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది.
వీళ్లే కాదు.. అరవై పదుల వయసులో జీన్స్, షర్ట్, మేకప్‌తో ట్రెండీ లుక్‌లో కనిపిస్తుంది రజినీ చాందీ. 84 ఏండ్ల వయసులో నీటిలో సాహసాలు చేస్తున్న పాతకాలం నటి వహీదా రెహ్మాన్ వంటి వాళ్లు ఎందరో, సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. ఈ లిస్ట్‌లో బామ్మలే కాదు, తాతలు కూడా ఉన్నారు. రోజూ వాళ్ల వాళ్ల అభిరుచులను, మంచి విషయాలను ప్రజలతో పంచుకుంటున్నారు. వాళ్లకు నచ్చినవి చేస్తూ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. ఈ వయసులో వాళ్లకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఆదరణ, ప్రేమ, సంతోషాలు సంపాదించుకున్నారు.
డాన్సింగ్ దాదీ
రవి బాల శర్మ అనే పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ.. డాన్సింగ్ దాదీ అంటే ఇట్టే గుర్తొచ్చేస్తుంది ఈ బామ్మ. వయసు 63 ఏండ్లు. అయినా.. డాన్స్ విషయానికొస్తే సీన్ వేరే! ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన ఈమెది మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. చిన్నప్పుడు వాళ్ల నాన్న దగ్గర మ్యూజిక్ నేర్చుకుంది. దాంతోపాటు కథక్ డాన్స్ కూడా నేర్చుకుంది. ఆ అలవాటు, ఇష్టమే ఆమెని సోషల్ మీడియాలో అడుగుపెట్టేలా చేశాయి. ‘ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే. ఏదైనా చేయాలనే తపన ఉంటే దానికి ఏజ్ ప్రాబ్లమ్ కాదు’ అంటుంది ఈ దాదీ. ఇన్‌స్టాగ్రామ్‌లో యూత్‌ఫుల్ డాన్స్‌లతో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం డాన్సింగ్ దాదీకి రెండు 2లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
