మాన్​స్టర్​తో ఆ కల నెరవేరింది

మాన్​స్టర్​తో ఆ కల నెరవేరింది

హనీ రోజ్.. ఈ పేరు తెలుగువాళ్లకి కొత్త. కానీ, మలయాళ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. మలయాళం, తమిళంలో సినిమాలు చేస్తూనే అడపాదడపా కన్నడ, తెలుగులోనూ కనిపించింది. రీసెంట్​గా వచ్చిన ‘మాన్​స్టర్’​లో ఫుల్ లెంగ్త్​ రోల్​ చేసిన ఈమె, తెలుగులో బాలకృష్ణ107 వ సినిమా ‘వీరసింహారెడ్డి’లో నటిస్తోంది. ఆమె పర్సనల్​ అండ్ సినీ కెరీర్​ గురించి ఆమె మాటల్లోనే...

‘‘నేను మోడల్​గా ఇండస్ట్రీలో అడుగుపెట్టా. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో నటించా. మాది కేరళలోని ఇడుక్కి జిల్లాలో మూలమట్టం గ్రామం. నాన్న వర్గీస్ థామస్, అమ్మ రోజ్. నేను స్కూల్ వరకు మా ఊళ్లోనే చదివా. ఆ తర్వాత అలువలోని సెయింట్ జేవియర్ ఉమెన్స్ కాలేజీలో ఆర్ట్స్​లో డిగ్రీ చేశా. 

ఆ సినిమా నాకు బ్రేక్​ ఇచ్చింది 

2005లో ‘బాయ్ ఫ్రెండ్’ అనే మలయాళ సినిమాలో అవకాశం వచ్చింది. అప్పుడు నా వయసు పద్నాలుగేండ్లు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేశా. 2012లో ‘త్రివేండ్రం లాడ్జ్’ సినిమాలో అవకాశం వచ్చింది. అందులో నా క్యారెక్టర్ పేరు ‘ధ్వని నంబియార్’. ఆ రోల్ నాకు మంచి గుర్తింపునిచ్చింది. అప్పటినుంచి నాకు మాలీవుడ్​లో కొత్త ఇన్నింగ్స్ మొదలైంది. నిజానికి ఆ సినిమా తర్వాత నా పేరు కూడా మారిపోయింది. ఎక్కడికి వెళ్లినా ‘ధ్వని’ అనే పిలిచేవాళ్లు. కొంతకాలం ఆ పేరు చాలా ట్రెండ్ అయింది. 

మాన్​స్టర్ గురించి..

ఈ మధ్య విడుదలైన ‘మాన్​స్టర్​’ సినిమాలో భామిని రోల్ రావడం నా అదృష్టం. ఇలాంటి రోల్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నా. ఇది భామిని సినిమా.. మిగతా పాత్రలన్నీ వచ్చిపోతుంటాయని డైరెక్టర్ వైశాఖ్​ ముందే చెప్పాడు. తీసేటప్పుడు కూడా ఆ పాత్ర  బాగా రావాలని చెప్పాడు. నాకు చాలా సపోర్ట్ చేశాడు. అయితే, మొదటిరోజు సెట్​కి వెళ్లి, నేను మేకప్​ వేసుకుని కూర్చున్నా. అది చూసి వైశాఖ్​ సర్ ‘భామిని ఇలా ఉండదు. మేకప్ తీసేయాలి. కావాలంటే కొంచెం లిప్ స్టిక్ వేసుకోండి. ఎందుకంటే భామిని క్యాబ్ డ్రైవర్. జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్న మహిళ. అలాంటప్పుడు మేకప్ వేసుకుంటే బాగోదు’ అని చెప్పాడు. వెంటనే నేను మేకప్ మొత్తం తీసేసి, మొహం కడుక్కున్నా. ఆ రోల్​లో నటించాక స్క్రీన్ మీద చూసుకుంటే వైశాఖ్ సర్ చెప్పింది ‘కరెక్ట్’ అనిపించింది.

పదిహేడేండ్ల జర్నీ

సినిమా ఇండస్ట్రీలో పదిహేడేండ్ల జర్నీ నాది. మంచి యాక్టర్​గా ప్రూవ్ చేసుకోవాలంటే అందుకు సరైన అవకాశం రావాలి. ఏ రోల్ అయినా చేసే సత్తా ఉంటే దాన్ని ప్రూవ్ చేయాలి. అంతేకానీ, నాకు అన్నీ వచ్చు అని, ఇంట్లో కూర్చుంటే లాభం లేదు కదా. ఇంతకుముందు ‘చంక్జ్’ సినిమాలో మంచి రోల్ చేశా. అయితే, నేను ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలో నా రోల్ చిన్నదే. ఎప్పుడూ ఫుల్ లెంగ్త్ ఉన్న క్యారెక్టర్ రాలేదు. పెద్ద క్యారెక్టర్స్ కోసం ఎదురుచూసేదాన్ని. ఫస్ట్ టైం ‘మాన్​స్టర్’తో నా కల నెరవేరింది. ఇందులో నా రోల్ చాలా ఛాలెంజింగ్​గా ఉంటుంది. కానీ, నేను చేయగలను అనే నమ్మకం కూడా ఉంది. మనల్ని మనం నమ్మితేనే ఏదైనా చేయగలం. ఇందులో నా కో–యాక్టర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. అందుకే ఆ క్యారెక్టర్ బాగా చేయగలిగా. 

ఆయన నాకు గురువుతో సమానం

ఇంతకుముందు కూడా మోహన్​లాల్​ సినిమాల్లో నటించా. కానీ, వాటితో పోలిస్తే ఇది డిఫరెంట్​. ఈ సినిమా షూటింగ్​లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను నాకు ఇచ్చిన చిన్న డైలాగ్స్ చెప్పడానికే, చాలా టెన్షన్​గా ప్రిపేర్​ అయ్యేదాన్ని. కానీ, ఆయన పెద్ద పెద్ద డైలాగ్స్ చాలా ఈజీగా చెప్పేవాళ్లు. అలా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒకసారి నా దగ్గరికొచ్చి, ‘ఏం టెన్షన్​ పడకు.. నువ్వు చెప్పగలవ్’​ అని ధైర్యమిచ్చారు. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. అందుకే ఆయన్ని గురువులా భావిస్తా. ఒకసారి సోషల్​ మీడియాలో నేను ఆయన గురించి ఏదో చెప్పానని, తప్పుగా ప్రచారం చేశారు. అది చూసి నేను చాలా ఫీలయ్యా. దాని మీద గట్టిగా రియాక్ట్ అవుదామనుకున్నా. కానీ, ఆయన పేరు బయటికి తీసుకురాకూడదు. మోహన్​లాల్ అనే పేరుకి ఉన్న ఫేమ్​ నా వల్ల పాడవ్వకూడదు అని సైలెంట్ అయ్యా. కానీ, దాని గురించి ఆయనకు ఒక మెసేజ్​ పెట్టా.  దానికి రిప్లైగా ఇవేం పట్టించుకోవద్దు, ఇవన్నీ కామన్​ అని కొట్టిపారేశారు. లాల్​ సర్ నిజంగా చాలా కూల్ పర్సన్. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. 

ఇష్టంలేదని చెప్పను. కానీ...

‘పెండ్లి చేసుకోవడం ఇష్టం లేదు’ అని నా కెరీర్​ బిగినింగ్​లో చెప్పి ఉంటా. కానీ, మనుషులు అన్నాక, ఆలోచనల్లో మార్పు వస్తుంది కదా. ఇప్పుడైతే పెండ్లి ఇష్టం లేదని చెప్పను. అలాగని ప్రేమలోనూ లేను. కానీ, నేను ప్రేమను ఇష్టపడతా. నాకు నచ్చిన వ్యక్తి నా జీవితంలోకి వస్తే ప్రేమించి పెండ్లి చేసుకుంటా. సినిమాల విషయానికొస్తే.. నేను కూడా మంచి రొమాంటిక్​ సినిమాలో చేయాలనుకుంటున్నా. ఇంతకుముందు ఇలాంటి పాత్ర చేయలేదు. ఫుల్​ లెంగ్త్​ రొమాంటిక్ మూవీలో నటించడం అనేది పెద్ద డ్రీమ్. 

తెలుగులో..

ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్​లో ‘ఆలయం’ అనే తెలుగు సినిమాలో మొదటిసారి నటించా. ఆ తర్వాత వరుణ్ సందేశ్ ‘ఈ వర్షం సాక్షిగా’ సినిమాలో చేశా. ప్రస్తుతం బాలకృష్ణ సినిమా ‘వీర సింహారెడ్డి’లో నటిస్తున్నా. సొసైటీలో చాలా ఇంపార్టెంట్​ అయిన సోషల్ ఇష్యూని చర్చించే సినిమా అది. ​

నేను చాలా సైలంట్

‘చంక్జ్’​ సినిమాలో నా రోల్ పేరు రాణి. తను ఎక్స్ట్రావర్ట్, ఏదైనా బయటికి చెప్పేస్తుంది. మనసులో ఏం దాచుకోదు. కానీ, నేను అలా కాదు. ఆ క్యారెక్టర్​ నాకు ఆపోజిట్​. నేను చాలా కూల్​గా, సైలంట్​గా ఉండే అమ్మాయిని. అయితే, ఈ సినిమాలో ఆ రోల్​లో నటించినందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యా. షూటింగ్​లో క్యాంపస్​ లైఫ్​  కొత్తగా అనిపించింది. ఆ ఎక్స్​పీరియెన్స్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమా కాలేజీ బ్యాక్​డ్రాప్​లో ఉంటుంది. అయితే, సినిమా మొదలవ్వడానికి కొన్ని రోజుల ముందే నా డిగ్రీ పూర్తైంది. దాంతో ఈ రోల్ చేయడం నాకు కాస్త ఈజీగా అనిపించింది. కాకపోతే ఈ క్యారెక్టర్​కి కావాల్సినట్టు మారడానికి ఒక నెల మాత్రమే టైం ఉంది. ఆ టైం అంతా వర్కవుట్ చేయడం, స్కిన్​ కాపాడుకోవడం చేశా.

నాకు డ్రాయింగ్, పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్​ అంటే కూడా ఇష్టం. లేదంటే మా ఫ్యామిలీ బిజినెస్​ చూసుకునేదాన్ని. బ్యూటీ, స్కిన్ కేర్​కి సంబంధించిన బిజినెస్ అది. మా సొంతూరులో ఉన్న మా ఫ్యాక్టరీలో ఊరి మహిళలు దాదాపు100 మంది పనిచేస్తున్నారు. అది వ్యాపారం కంటే చాలా ఎక్కువ. ఎంతో మందికి ఆసరాగా నిలుస్తోంది. షూటింగ్​లతో బిజీ లేనప్పుడల్లా బిజినెస్​ చూసుకుంటా. 

మొదట్లో ‘హనీ బాత్ ప్రొడక్ట్స్’ పేరుతో ఆయుర్వేదిక్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అమ్మేవాళ్లు. ప్రజెంట్ మా కంపెనీలో ఆర్గానిక్ బాత్ బ్రష్​లు తయారుచేస్తున్నారు. వాటి పేరు ‘హనీ బాత్ బ్రష్​’. 25 ఏండ్లకు పైగా మా ఫ్యామిలీ ఈ బిజినెస్​లో ఉంది. సినిమాల్లోకి రాకపోయి ఉంటే నేను కూడా ఒక ఎంట్రప్రెనూర్ అయ్యేదాన్ని. చాలామంది ‘నా గ్లామర్ సీక్రెట్ ఏంటి?’ అని అడుగుతారు. ‘నేను వాడేది మా ప్రొడక్ట్సే’ అని చెప్తే  ‘ప్రమోట్ చేస్తున్నావా?’ అంటారు. కానీ, నేను నిజంగానే మా ప్రొడక్ట్సే వాడతా.’’ 

వేరే భాషల్లో గెస్ట్​లా...

దక్షిణాది ఇండస్ట్రీలు అన్నీ ఒకేలా ఉండవు. అక్కడి భాష, కల్చర్, ఫుడ్, క్లైమెట్ అన్నీ డిఫరెంట్​గా ఉంటాయి. ఒక చోట నుంచి మరో చోటికి వెళ్లినప్పుడు చాలా నేర్చుకోవాలి. అవన్నీ తెలుసుకుంటే ఆ ఇండస్ట్రీలో వర్క్ బాగా చేయగలం. పెద్ద డిఫరెన్స్ ఏంటంటే.. మలయాళం మూవీ సెట్​కి వెళ్తే ఫ్యామిలీలా అనిపిస్తుంది. కానీ, వేరే భాషల్లో చేస్తే గెస్ట్​లా ట్రీట్ చేస్తారు.

స్వీట్స్ అంటే ఇష్టం

నాకు వంట చేయడమంటే ఇష్టం. అలాగే తినడం కూడా. తినేటప్పుడు బరువు పెరుగుతా అనే ఆలోచనే ఉండదు. అలా కొన్ని రోజులు గడిచాక, అప్పుడు రియలైజ్ అవుతా. వెయిట్ మెయింటెయిన్ చేయడానికి రెగ్యులర్​గా డాన్స్, ఫిట్​నెస్​ వర్కవుట్స్ చేస్తా. అయినా సరే, స్వీట్స్ చూస్తే నా మనసు ఊరుకోదు. కానీ, వెయిట్ లాస్​ అవ్వడం చాలా కష్టమైన పని. 
::: ప్రజ్ఞ