
- పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్
- మోదీ ఆర్థిక విధానాలతో పేదరికంలోకి ప్రజలు : కోదండరాం
బషీర్ బాగ్, వెలుగు : కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించి దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందామని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీపీజేఏసీ) రాష్ట్ర కన్వీనర్ పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. పదేండ్లలో మోదీ ప్రభుత్వ నిరంకుశపాలన, ఆర్థిక విధానాలు, అవినీతిని ప్రజలు ఓటు ద్వారా ప్రశ్నించి, తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో
ఈనెల 2 నుంచి 11వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా10 రోజుల ప్రచార కార్యక్రమాన్ని గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రచార పోస్టర్‌ను విడుదల చేసి మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని, బీజేపీ నేతలు, ప్రధాని మోదీ ముస్లింలు, మంగళసూత్రాలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ చర్చను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. మోదీ ఆర్థిక విధానాలతో కొందరు బిలియనీర్లుగా మారితే, మిగిలిన ప్రజలు పేదరికంలో కూరుకుపోయారని టీజేఎస్ చీఫ్ కోదండరాం విమర్శించారు.
బీజేపీని కేంద్రంలో మళ్లీ అధికారంలో రాకుండా, ప్రజలు చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రమా మెల్కొటె, ప్రముఖ విద్యా వేత్తలు డాక్టర్ వనమాల, ప్రొఫెసర్ సుకుమార్, అనిశెట్టి శంకర్, మహిళా రైతుల హక్కుల వేదిక నేతలు డాక్టర్ రుక్మిణీ రావు, విరసం నేత రాము, టీపీజేఏసీ కో కన్వీనర్లు కన్నెగంటి రవి, రవిచందర్, మైసా శ్రీనివాస్, జ్యోతి, ముత్తయ్య, రామగిరి ప్రకాశ్ పాల్గొన్నారు.