కేసీఆర్​ను గద్దె దించుదాం

కేసీఆర్​ను గద్దె దించుదాం
  •     ఆయన బలవంతుడేం కాదు.. గట్టిగ పని చేస్తే పెద్ద పనేం కాదు
  •     గజ్వేల్​ సభతో దండోరా మోగిద్దాం
  •     కేసీఆర్​ గుండెల్లో దడ పుట్టిద్దామన్న పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి

సీఎం కేసీఆర్ బలవంతుడేం కాదని, అయనవన్నీ నక్కజిత్తులేనని పీసీసీ చీఫ్​​రేవంత్ రెడ్డి అన్నారు. గట్టిగా పని చేస్తే ఆయన్ను గద్దె దించడం పెద్ద పనేం కాదని చెప్పారు. కేసీఆర్ మాటలు, మంత్రాలు ఎదుర్కొని పని చేయాలన్నారు. దీని కోసం గజ్వేల్ సభ నాందిగా దండోరా మోగిద్దామని, దండు కడదామని, కేసీఆర్ గుండెల్లో దడ పుట్టిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గజ్వేల్ లో ఈ నెల 17న జరిగే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ ఏర్పాట్లపై సోమవారం గాంధీభవన్ లో రేవంత్ సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడున్నరేళ్లలో దళిత, గిరిజనులు కేసీఆర్ చేతిలో దగా పడ్డారన్నారు. ‘ఈ రెండు వర్గాలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చి ఉంటే వాళ్లు ఎంతో లాభపడేవారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేసి ఉంటే ఎందరికో లబ్ధి జరిగేది’ అన్నారు. 125వ అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని పెడతానని దాని జోలే తీయట్లేదని మండిపడ్డారు. పంజాగుట్టలో కాంగ్రెస్ ఏర్పాటు చేయాలనుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం జైల్లో పెట్టారన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. గజ్వేల్ సభలో దీనికి సంబంధించి తీర్మానం ప్రవేశపెడతామన్నారు.
  
కాంగ్రెస్​కు మళ్లీ వైభవం వస్తది: జానారెడ్డి

రేవంత్ రెడ్డి అధ్యక్షుడైన తర్వాత తొలిసారి గాంధీభవన్ కు మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి వచ్చారు. కాంగ్రెస్​కు పూర్వ వైభవం తేవడానికి జరుగుతున్న కృషిని అభినందించారు. పార్టీ కార్యక్రమాలు చూస్తే అధికారంలోకి వస్తుందని ప్రజల్లో నమ్మకం కలుగుతోందన్నారు. తాను అన్ని కార్యక్రమాలకు రాలేకపోయినా తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రసంగానికి ముందు కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతికి ఆయన సంతాపం ప్రకటించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ జె. గీతారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళిత గిరిజనలు కలిసి 86 లక్షల మంది ఉన్నారని, అందరూ కలిసి ఓటేస్తే కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. కల్వకుర్తికి చెందిన కొందరు నేతలు సోమవారం కాంగ్రెస్ లో చేరారు. వాళ్లకు రేవంత్ కండువా కప్పి ఆహ్వానించారు. సమావేశంలో ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజ నర్సింహా, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. 

లక్ష మందితో గజ్వేల్ సభ 

గజ్వేల్ నియోజక వర్గంలోని కొండపోచమమ్మ, మల్లన్న సాగర్ జలాశయాలతో దళిత, గిరిజనుల ఆకాంక్షలు జల సమాధి అయ్యాయని రేవంత్ అన్నారు. అందుకే తాము గజ్వేల్ వేదికగా కేసీఆర్​పై దండోరా మోగిస్తున్నామని తెలిపారు. గజ్వేల్​లో లక్ష మందికి తక్కువ కాకుండా సభ నిర్వహిస్తామని, ఇందుకు కార్యకర్తలంతా సహకరించాలని కోరారు. గజ్వేల్ చుట్టూ ఉన్న 32 మండలాల నుంచి 3 వేల మంది చొప్పున రావాలన్నారు. రాష్ట్రంలోని 34 వేల బూత్​ల నుంచి 9 మంది చొప్పున వచ్చేలా కో ఆర్డినేటర్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సభకు వస్తున్నారని, ఆయన ప్రసంగాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకుపోవాలని పిలుపునిచ్చారు.